Kamareddy Stray Dogs: కామారెడ్డిలో దారుణం.. 600 వీధి కుక్కల మృతి
ABN , Publish Date - Jan 14 , 2026 | 01:31 PM
కామారెడ్డి జిల్లా మాచారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు గ్రామాల్లో వీధి కుక్కలను చంపిన ఘటన కలకలం రేపింది. పాల్వంచ మండల కేంద్రంతో పాటు ఫరీద్‌పేట్, బండరామేశ్వర్ పల్లి, భవాని పేట్, వాడి గ్రామాల్లో సుమారు 600కు పైగా కుక్కలను హతమార్చారు.
కామారెడ్డి జిల్లా, జనవరి 14: మాచారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఐదు గ్రామాలలో గ్రామ సర్పంచ్‌లు.. సుమారు 600 కుక్కలను చంపి పూడ్చేశారు. పాల్వంచ, ఫరీద్‌పేట, బండరామేశ్వర్ పల్లి, భవాని పేట్, వాడి గ్రామ పంచాయతీ పరిధిల్లో ఉండే వీధి శునకాలకు విష ఇంజక్షన్లు, గుళికలు పెట్టి హతమార్చినట్టుగా జంతు ప్రేమికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుతో.. పాతిపెట్టిన శునకాల మృతదేహాలను జేసీబీ సాయంతో వెలికితీసి.. వెటర్నరీ డాక్టర్ల ఆధ్వర్యంలో పోస్టుమార్టం నిర్వహించారు.
కుక్కల మృతిపై స్ట్రే అనిమల్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా మేనేజర్ మాట్లాడుతూ.. తమకు తెలిసిన సమాచారం మేరకు ఆయా గ్రామాలలో పర్యటించి సుమారు 5 ఊర్లలో 600 కుక్కలను విష ఇంజక్షన్లు, గుళికలతో చంపివేసి గ్రామ శివారులో పాతిపెట్టినట్లుగా(600 Dogs Poisoned) ఆనవాళ్లు లభించినట్లు తెలిపారు. సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో కుక్కలను గ్రామాల నుంచి తరిమేస్తామంటూ కొందరు సర్పంచ్‌లు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చుకునేందుకు ఇలా మూగజీవులను చంపడం ఎంతవరకు సమంజసమని జంతు ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేశారు. కుక్కలకు రేబిస్ వ్యాధి రాకుండా ముందస్తుగా ఇంజక్షన్ ఇవ్వాలని సూచించారు.
జంతువుల పట్ల ప్రేమగా ఉండాలి తప్ప.. వాటిని హతమార్చడం ఎంతవరకు సమంజసమని అనిమల్ లవర్స్ ప్రశ్నించారు. అనంతరం.. ఈ విషయమై స్థానిక మాచారెడ్డి పోలీస్ స్టేషన్‌లో సంబంధిత సర్పంచ్‌లపై ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. గ్రామ సర్పంచ్‌లు, పంచాయతీ అధికారులైన సెక్రెటరీలు కలిసే శునకాలను చంపివేసినట్లుగా ప్రాథమికంగా నిర్ధారించినట్లు పేర్కొన్నారు. మాచారెడ్డి ఎస్ఐ అనిల్ స్పందిస్తూ.. సదరు ఐదు గ్రామాల సర్పంచులపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
ఇవి కూడా చదవండి...
ఏపీ వ్యాప్తంగా అంబరాన్నంటిన భోగి సంబరాలు
మహిళా ఐఏఎస్‌పై అసభ్య కథనాలు.. సీసీఎస్ దూకుడు