Share News

తెలంగాణ సంస్కృతికి ప్రతీక అలయ్‌ బలయ్‌

ABN , Publish Date - Oct 23 , 2026 | 06:07 AM

చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిలిచే విజయ దశమి పండుగ తర్వాత నిర్వహించే అలయ్‌ బలయ్‌ కార్యక్రమం ప్రజలను ఏకం చేస్తుందని, సమాజంలో ప్రేమానురాగాలు, సోదరభావాన్ని పెంపొందిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.

తెలంగాణ సంస్కృతికి ప్రతీక అలయ్‌ బలయ్‌
dattathreya with venkaiahnaidu

  • తెలంగాణ సంస్కృతికి ప్రతీక అలయ్‌ బలయ్‌

  • ప్రజలను ఏకం చేసేందుకు దోహదం.. దత్తాత్రేయకు లేఖలో ప్రధాని మోదీ.

  • నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో వేడుక

  • ‘నిషా ముక్త్‌ భారత్‌, వికసిత్‌ భారత్‌’ ఇతివృత్తంతో నిర్వహణ.. అతిథుల ప్రతిజ్ఞ

  • డ్రగ్స్‌ నియంత్రణ సమష్టి బాధ్యత: గవర్నర్‌

  • భారత్‌లోనే సెక్యులరిజం ఉంది: కిషన్‌ రెడ్డి

  • ఆత్మీయ అనుబంధాలు సమాజంలో ప్రతి ఒక్కరికీ కీలకం: వెంకయ్యనాయుడు

  • తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకుంటూ అభివృద్ధికి ఐక్యంగా కృషి చేయాలి: పొన్నం

న్యూఢిల్లీ/హైదరాబాద్‌/బర్కత్‌పుర/అఫ్జల్‌గంజ్‌, అక్టోబరు 22(ఆంధ్రజ్యోతి): చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిలిచే విజయ దశమి పండుగ తర్వాత నిర్వహించే అలయ్‌ బలయ్‌ కార్యక్రమం ప్రజలను ఏకం చేస్తుందని, సమాజంలో ప్రేమానురాగాలు, సోదరభావాన్ని పెంపొందిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. మాజీ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ ఆధ్వర్యంలో ప్రతి ఏటా నిర్వహిస్తున్న అలయ్‌ బలయ్‌పై ప్రధాని హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలను ఈ వేడుకల ద్వారా సజీవంగా ఉంచుతున్న దత్తాత్రేయ కృషి ప్రశంసనీయమన్నారు.ఈ మేరకు మోదీ.. దత్తాత్రేయకు ప్రత్యేకంగా లేఖ రాశారు. ఈ ఏడాది అలయ్‌ బలయ్‌ సమ్మేళనానికి ‘నషా ముక్త్‌ భారత్‌.. వికసిత్‌ భారత్‌ 2047’అనే ఇతివృత్తాన్ని ఎంచుకోవడం జాతీయ సంకల్పాన్ని గుర్తుచేస్తోందని మోదీ పేర్కొన్నారు. కాగా, హైదరాబాద్‌ నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో అలయ్‌ బలయ్‌ ఫౌండేషన్‌ చైర్‌పర్సన్‌ బండారు విజయలక్ష్మి నేతృత్వంలో గురువారం వేడుకను ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా మాట్లాడుతూ డ్రగ్స్‌ నియంత్రణ సమష్టి బాధ్యతని అన్నారు. ఇది ఒక్క పోలీసుల బాధ్యత మాత్రమే కాదని, విద్యాసంస్థలు, ప్రభుత్వ యంత్రాంగం, సామాజిక, స్వచ్ఛంద సంస్థలు తమ వంతు బాధ్యత నిర్వర్తించాలని పిలుపునిచ్చారు. దేశ భవిష్యత్తుకు డ్రగ్స్‌ ముప్పులా మారుతున్నాయని పంజాబ్‌ గవర్నర్‌ గులాబ్‌ చంద్‌ కటారియా ఆందోళన వ్యక్తం చేశారు. కుటుంబ సంపద, స్నేహ సంపద ప్రతీ ఒక్కరికీ ముఖ్యమని మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు


మానవ జీవితానికి ఆత్మీయ అనుబంధాలు అత్యంత అవసరమని చెప్పారు. పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌ వంటి దేశాల్లో సెక్యులరిజం లేదని, అక్కడ నియంతృత్వం మాత్రమే ఉందని, కేవలం భారత్‌లోనే సెక్యూలరిజం ఉందని కేంద్ర మంత్రి జీ కిషన్‌రెడ్డి అన్నారు. హిందువులు ఐక్యంగా ఉండాలన్నారు. తెలంగాణ ఆస్తిత్వాన్ని కాపాడుకుంటూ రాష్ట్రాభివృద్ధికి అందరూ ఐక్యంగా కృషి చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌ సూచించారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌, మాజీ గవర్నర్‌ సీహెచ్‌.విద్యాసాగర్‌రావు, మంత్రి వివేక్‌ వెంకటస్వామి, ఎంపీలు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌, డీకే అరుణ, రఘునందన్‌రావు, ఈటల రాజేందర్‌, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఆర్‌.కృష్ణయ్య, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రాంచందర్‌రావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి, బీసీ సంక్షేమ శాఖ ప్రభుత్వ సలహాదారు వీ హనుమంతరావు, మాజీ మంత్రి జానారెడ్డి, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి

ఓటు హక్కు తొలగింపు చిన్న విషయమా?

భారత టెలికాంపై బడా గుత్తాధిపత్యం!

Updated Date - Oct 23 , 2026 | 06:08 AM