Share News

భారత టెలికాంపై బడా గుత్తాధిపత్యం!

ABN , Publish Date - Oct 23 , 2026 | 02:34 AM

స్టార్‌లింక్‌ వివాదం నుంచి 2జీ కుంభకోణం వరకు, స్పెక్ట్రమ్‌ కేటాయింపుల నుంచి ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్‌ ఎదుర్కొంటున్న సవాళ్ల వరకు టెలికాం రంగాన్ని వెంటాడుతున్న అసలు ప్రశ్న ఒక్కటే.

భారత టెలికాంపై బడా గుత్తాధిపత్యం!

స్టార్‌లింక్‌ వివాదం నుంచి 2జీ కుంభకోణం వరకు, స్పెక్ట్రమ్‌ కేటాయింపుల నుంచి ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్‌ ఎదుర్కొంటున్న సవాళ్ల వరకు టెలికాం రంగాన్ని వెంటాడుతున్న అసలు ప్రశ్న ఒక్కటే. ప్రజల సంపదపై హక్కు ఎవరిది? ప్రభుత్వ విధానాలను నిర్ణయించేది ప్రజా ప్రయోజనమా? కార్పొరేట్‌ ప్రయోజనమా?

ఒకప్పుడు టెలిఫోన్‌ కనెక్షన్‌ కోసం ఏళ్ల తరబడి ఎదురుచూసిన దేశం నేడు ప్రపంచంలోనే అతిపెద్ద టెలికాం మార్కెట్లలో ఒకటిగా ఎదిగింది. కోట్లాది మంది చేతుల్లో స్మార్ట్‌ఫోన్లు, జీవితంలో భాగమైన ఇంటర్నెట్‌, డిజిటల్‌ చెల్లింపుల నుంచి విద్య, వైద్యం, వ్యాపారం, ప్రభుత్వ సేవల వరకు విస్తరించిన టెలికాం వ్యవస్థ... ఇవన్నీ సాంకేతిక అభివృద్ధికి నిదర్శనాలు. కానీ ఈ విస్తరణ వెనుక స్పెక్ట్రమ్‌ కేటాయింపుల వివాదాలు, లైసెన్స్‌ ఫీజుల లెక్కలపై ఆరోపణలు, రాజకీయ అవినీతి కేసులు, ప్రభుత్వ రంగ సంస్థ ఎదుర్కొంటున్న సవాళ్లు కూడా ఉన్నాయి. మార్కెట్‌ కొద్దిమంది ప్రైవేట్‌ దిగ్గజాల చేతుల్లోకి కేంద్రీకృతమవుతున్నవేళ, స్టార్‌లింక్‌ ప్రవేశం స్పెక్ట్రమ్‌ కేటాయింపులు, ప్రభుత్వ ఆదాయ రక్షణ, జాతీయ భద్రత, సమాన పోటీపై కీలక ప్రశ్నలను ముందుకు తెచ్చింది.


భారత టెలికాం రంగంలో ఎలన్‌మస్క్ ‘స్టార్‌లింక్’ ప్రవేశం కేవలం జియో, ఎయిర్‌టెల్ వంటి దిగ్గజాలతో నయా ఆధిపత్య పోరు మాత్రమే కాదు. పరిమిత సహజ వనరు అయిన రేడియో స్పెక్ట్రమ్ కేటాయింపులపై పారదర్శకతను కోరే మౌలిక పరీక్ష. స్పెక్ట్రమ్ అనేది ఏ ఒక్కరి వ్యాపార ఆస్తి కాదు, అది దేశ ప్రజా వనరు. ప్రభుత్వ రాబడి, వినియోగదారుల ప్రయోజనాలు, సమాన పోటీ వాతావరణం జాతీయ భద్రతలకు ఏ మాత్రం భంగం కలగకుండా, అనుమతుల ప్రక్రియలో ఏ సంస్థకూ కొమ్ముకాయకుండా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించాలి.

1999 నాటి లైసెన్స్ ఫీజు సవరణ మొదలు వైర్‌లెస్ ఇన్ లోకల్ లూప్ (WiLL) దుర్వినియోగం, రూ.1,300 కోట్ల డైవర్షన్ కుంభకోణాలు, విదేశీ పెట్టుబడుల ఉల్లంఘనలు, 122 లైసెన్సుల రద్దుకు దారితీసిన 2జీ స్కామ్ వరకు టెలికాం చరిత్రంతా కార్పొరేట్ శక్తులకు పాలకులు మోకరిల్లిన నగ్న సత్యమే. ఒకవైపు బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్‌ల రెక్కలు విరుస్తూ మంత్రులే జైలుపాలయ్యేంతగా అవినీతి వేర్లు లోతుగా పాతుకుపోగా, 2014లో ‘కుంభకోణ రహిత’ నినాదంతో వచ్చిన బీజేపీ ప్రభుత్వం సైతం పాత ఉదార విధానాలనే కొనసాగిస్తోంది. ప్రభుత్వాలు మారుతున్నా లక్షల కోట్ల విలువైన ప్రజా వనరులను కొద్దిమంది ప్రైవేట్ వ్యక్తుల స్వార్థానికి తాకట్టు పెట్టే వ్యవస్థీకృత దోపిడీ ఇప్పటికీ నిరంతరాయంగా కొనసాగుతుండటమే అత్యంత విచారకరం.


సహజ వనరులు, ప్రజా మౌలిక సదుపాయాల ఆధారంగా వేల కోట్లు ఆర్జించే ప్రైవేట్ సంస్థలు ప్రభుత్వానికి చెల్లించాల్సిన ప్రతి పైసానూ సక్రమంగా లెక్కచెప్పాల్సిందే. 2019 నాటి ఏజీఆర్ (Adjusted Gross Revenue) వివాదంలో సుప్రీంకోర్టు స్పష్టం చేసినట్లుగా ప్రభుత్వ రాబడి వసూలు ఎంత కీలకమో, అసలు విధానపరమైన లోపాలే తలెత్తకుండా ఆరంభం నుంచే పారదర్శక నియమాలు అమలు చేయడం అంతకంటే ముఖ్యం. లాయర్లు, ఆర్థిక సలహాదారుల బలంతో కార్పొరేట్ దిగ్గజాలు రహస్య ఒత్తిళ్లతో విధానాలను తమకు అనుకూలంగా మలచుకోవడం ప్రజాస్వామ్యానికే పెనుముప్పుగా మారగా.. 2016లో మొబైల్‌ రంగంలో మొదలైన తీవ్రమైన ధరల పోటీకి చిన్న కంపెనీలు కనుమరుగై మార్కెట్ కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతమవ్వడం, దానికితోడు దేశవ్యాప్తంగా సామాన్యులకు సేవలు అందించాల్సిన ప్రభుత్వ రంగ బీఎస్ఎన్ఎల్‌ను కావాలనే బలహీనపరచడం పాలకుల తీవ్ర నిర్లక్ష్యానికి నిదర్శనం. నేడు స్టార్‌లింక్ ప్రవేశ వివాదంలోనైనా ఎవరి స్వార్థ ఆరోపణలకో, కార్పొరేట్ లాబీయింగ్‌కో లొంగకుండా, ప్రజా ప్రయోజనాలే పరమావధిగా నియంత్రణ సంస్థలు తీసుకునే ప్రతి నిర్ణయాన్నీ నిష్పక్షపాతంగా ప్రజల ముందు ఉంచాలి.

ప్రారంభంలో చౌకైన డేటా పేరుతో పోటీదారులను మార్కెట్ నుంచి తరిమేసి, ఆపై గుత్తాధిపత్యంతో ధరలు పెంచే కార్పొరేట్ వ్యూహాలకు అడ్డుకట్ట వేస్తూ.. సేవల నాణ్యత, డేటా భద్రత, ప్రభుత్వానికి రావాల్సిన రాబడి మధ్య సరైన సమతుల్యత సాధించినప్పుడే టెలికాం రంగం నిజమైన ప్రజా సంక్షేమంగా మారుతుంది. ఇదే క్రమంలో, స్టార్‌లింక్ అయినా సరే విదేశీ సంస్థ అనే నెపంతో అన్యాయంగా అడ్డుకోవడం ఎంత తప్పో, అత్యాధునిక సాంకేతిక పేరుతో ప్రత్యేక మినహాయింపులు ఇవ్వడమూ అంతే నేరం. కాబట్టి దేశీయ, విదేశీ కంపెనీలన్నింటికీ ఒకే పారదర్శక నిబంధనలు, సమాన అవకాశాలు వర్తింపజేస్తూ, పాలకుల నిర్ణయాలు కార్పొరేట్ల కనుసన్నల్లో కాక ప్రజా ప్రయోజనాల గీటురాయిపైనే రూపుదిద్దుకోవాలి.


టెలికాం రంగంలో పేరుకుపోయిన అవినీతి మూలాలను తెంచి పారదర్శకతను నెలకొల్పాలంటే స్పెక్ట్రమ్ కేటాయింపుల నుంచి బకాయిల వసూలు, అలాగే స్టార్‌లింక్, జియో, వన్‌వెబ్‌ల అనుమతుల వరకు ప్రతి నిర్ణయాన్నీ రాజకీయ, కార్పొరేట్ ఒత్తిళ్లకు లొంగకుండా బహిరంగపరచాలి. స్వతంత్ర నియంత్రణ సంస్థల ద్వారా తప్పు చేసిన ప్రతి శక్తినీ నిర్దాక్షిణ్యంగా బోనెక్కించినప్పుడే ఈ వ్యవస్థపై ప్రజలకు నమ్మకం నిలుస్తుంది. డిజిటల్ భారత్ అంటే కేవలం కార్పొరేట్ దిగ్గజాల ఖాతాల్లో వేల కోట్ల లాభాలు నింపడం కాదు.‌ రైతుకు సమాచారం, విద్యార్థికి జ్ఞానం, గ్రామీణ పేదవాడికి అందుబాటు ధరలో కనెక్టివిటీ దక్కినప్పుడే ఆ సాంకేతికతకు అసలైన సార్థకత చేకూరుతుంది.

గత కుంభకోణాల నుంచి పాఠాలు నేర్చుకోకుండా, కొత్త సాంకేతిక పరిజ్ఞానం పేరుతో పాత తప్పిదాలను పునరావృతం చేస్తే నష్టపోయేది ప్రజలే. స్టార్‌లింక్‌ ప్రవేశించినా, మరో సంస్థ వచ్చినా, ఇప్పటికే ఉన్న దిగ్గజాలు తమ వ్యాపారాన్ని విస్తరించినా.. ప్రజా ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరించే హక్కు ఎవరికీ లేదు. స్పెక్ట్రమ్‌ ప్రజా వనరు. దాని వినియోగం ద్వారా వచ్చే ఆదాయం దేశానికి చెందాలి. పోటీ న్యాయంగా ఉండాలి. సేవలు అందరికీ అందుబాటులో ఉండాలి. ప్రభుత్వ నిర్ణయాలు ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. ప్రజల సంపదతో కార్పొరేట్లు ఎదగవచ్చు, కానీ తమ ఎదుగుదలకు ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టకూడదు.

- కృష్ణ కానూరి

Updated Date - Oct 23 , 2026 | 02:38 AM