Share News

ఓటు హక్కు తొలగింపు చిన్న విషయమా?

ABN , Publish Date - Oct 23 , 2026 | 02:40 AM

ఓటర్‌ జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) ప్రక్రియ కోట్లాది వయోజన భారతీయుల ఓటుహక్కు తొలగింపునకు దారితీసిందా? భారీ స్థాయిలో ఓటుహక్కు రద్దుపై వెల్లువెత్తిన విమర్శలను కొట్టివేస్తూ...

ఓటు హక్కు తొలగింపు చిన్న విషయమా?

ఓటర్‌ జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) ప్రక్రియ కోట్లాది వయోజన భారతీయుల ఓటుహక్కు తొలగింపునకు దారితీసిందా? భారీ స్థాయిలో ఓటుహక్కు రద్దుపై వెల్లువెత్తిన విమర్శలను కొట్టివేస్తూ... చిన్న విషయంపై పెద్ద రభస చేస్తున్నారని అర్థశాస్త్ర విజ్ఞుడు సుర్జిత్‌ భల్లా విమర్శలు చేస్తున్న దృష్ట్యా పై ప్రశ్నను మరింత నిశితంగా తర్కించవలసిన అవసరమున్నది.

ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ ప్రారంభం కాకముందు ఉన్న ఓటర్‌ జాబితాల నుంచి పేర్ల తొలగింపుల పైనే ‘సర్‌’ చర్చలన్నీ ప్రధానంగా జరుగుతున్నాయి. సర్‌ పూర్వపు ఓటర్‌ జాబితాల నుంచి 13.3 కోట్ల పేర్లను తొలగించడమే భారీ స్థాయి ఓటుహక్కు రద్దునకు రుజువు అని ఈ విమర్శకులు ప్రస్తావిస్తున్నారు. అయితే గత ఓటర్‌ జాబితాలలో పేర్లు అత్యధికంగా ఉన్నాయని తొలగించిన పేర్లు అన్నీ ఓటర్‌ నమోదులో లేనివారు, వేరే ప్రాంతాలకు వెళ్లినవారు, మరణించినవారు, ఒకే పేరు రెండుసార్లు ఉన్నవారివేనని సర్‌ మద్దతుదారులు ప్రతిస్పందిస్తున్నారు. నిజానిజాలు ఏమిటి? భారత ఎన్నికల సంఘం రూపొందించిన సర్‌ తుది జాబితాలు సరైనవేనని విశ్వసనీయ తనిఖీతో ధ్రువీకరించడం జరగకపోవడంతో వాటిపై గందరగోళం, వివాదాలు నెలకొన్నాయి. అయితే సర్‌ ఫలితాలను మూల్యాంకనం చేసేందుకు ఒక వివేకవంతమైన పద్ధతి ఉన్నది. సర్‌ తుది ఓటర్‌ జాబితాలను ఓటుహక్కుకు అర్హత ఉన్న వయోజన జనాభా అధికారిక అంచనాలతో పోల్చిచూడడం ద్వారా సర్‌ నిష్పాక్షికతను తెలుసుకోవచ్చు. నిజానికి ఈసీఐ సైతం ఓటర్‌ జాబితాలను మూల్యాంకనం చేసేందుకు అధికారిక వయోజన జనాభా అంచనాలను ఒక ప్రమాణంగా తీసుకుంటున్నది. కోట్లాది వయోజనుల ఓటుహక్కును రద్దు చేశారన్న ఆరోపణ సమర్థనీయమైనదేనని సర్‌ తుది ఓటర్‌ జాబితాలు, వయోజన జనాభా అంచనాల తులనాత్మక పరిశీలన స్పష్టం చేసింది. అంతేకాదు తుది జాబితాలలో పేర్లు లేనివారి సంఖ్యపై ఒక కచ్చితమైన అభిప్రాయానికి రావడానికి కూడా అది తోడ్పడింది.


సర్‌ ప్రక్రియ ప్రథమ, ద్వితీయ దశలు అమలయిన తొమ్మిది రాష్ట్రాలలో తుది జాబితాలలోని మొత్తం ఓటర్ల సంఖ్య ఆ రాష్ట్రాలలోని సమస్త వయోజన జనాభా అంచనాలకు 7 కోట్ల కంటే తక్కువగా ఉన్నది. దాదాపు 12శాతం వయోజనులను తుది జాబితాల నుంచి మినహాయించారు. ఒక్క ఉత్తరప్రదేశ్‌లోనే 2.8 కోట్ల మంది ఓటర్లను తొలగించారు. యూపీలో ఇలా ఓటు హక్కు కోల్పోయినవారు మొత్తం వయోజన జనాభాలో 17శాతానికంటే అధికం. ఈ తొమ్మిది రాష్ట్రాలలో సగటు తొలగింపుల రేటు 12శాతం దేశవ్యాప్తంగా మొత్తం తొలగింపులకు కూడా సూచకమయితే తుది ఓటర్‌ జాబితాలలో లేనివారు దాదాపు 12 కోట్ల మందిగా ఉంటారు. మూడో దశ సర్‌ ధోరణులను పరిగణనలోకి తీసుకుంటే వాస్తవ సంఖ్య మరింత అధికంగా ఉండవచ్చు. హిమాచల్‌ప్రదేశ్‌, జమ్మూ–కశ్మీర్‌ మినహా మిగతా రాష్ట్రాలు అన్నిటికీ ముసాయిదా సర్‌ జాబితాలను విడుదల చేశారు. ముసాయిదా జాబితాలలోనే తొలగింపులు సర్‌ మూడో దశలో మరింత అధికంగా ఉన్నాయి. మొదటి రెండు దశల ముసాయిదా జాబితాలను సరిదిద్దిన విధంగానే మూడో దశ జాబితాలలోనూ మార్పులు చేయడం జరగవచ్చని భావిద్దాం. అయినప్పటికీ అఖిల భారత స్థాయిలో సర్‌ అనంతర తుది ఓటర్‌ జాబితాలలో ఉండే పేర్లు ఇంచుమించు 87.8 కోట్లుగా ఉండగలవని రాహుల్‌ శాస్త్రి అంచనా వేశారు.


భారతదేశ ప్రస్తుత వయోజన జనాభా 101.6 కోట్లు. అంటే ఓటు హక్కుకు అర్హులైన దాదాపు 14 కోట్లమంది తుది జాబితాల నుంచి జారిపోయారు. వయోజన జనాభా పరిమాణం, ఓటర్‌ జాబితాల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని సుర్జిత్‌ భల్లా అంగీకరిస్తూనే, ఈ తేడా ఓటుహక్కు తొలగింపులను సూచించదని వాదిస్తున్నారు. ఓటర్‌ జాబితాలలోని మొత్తం ఓటర్ల సంఖ్య వయోజన జనాభా సంఖ్యతో సరిసమానంగా ఉండి తీరాలని ఏమీ లేదని ఆయన వాదన. 2024లో ఓటుహక్కుకు అర్హమైన వయసుకు వచ్చిన వారిలో ఎంతోమంది ఓటరుగా నమోదు చేయించుకునేందుకు శ్రద్ధ చూపలేదని, ఇటువంటి అలక్ష్యపరులు ఆ ఏడాది మొత్తం వయోజనులలో 7.5శాతంగా ఉన్నారని భల్లా చెబుతున్నారు. మిగిలిన జనాభాలోనూ ఇటువంటి తక్కువ నమోదును మరో 1శాతం మేరకు కలుపుకుంటే సాధారణంగా వాటిల్లే లోటు 8.5శాతంగా ఉండగలదని ఆయన నిర్ధారిస్తూ, ఈ 8.5శాతం పరిమితి కంటే ఎక్కువ ఉంటేనే, దానిని మితిమీరినదిగా, న్యాయ విరుద్ధమైనదిగా పరిగణించాలనేది సుర్జిత్‌ భల్లా వాదన.


సుర్జిత్‌ భల్లాతో మేము విభేదిస్తున్నాం. ఇవీ మా కారణాలు: మొదటిది– భారతదేశంలో ఓటర్‌ గుర్తింపు కార్డు ఒక ముఖ్యమైన డాక్యుమెంటు. ఈ గుర్తింపు కార్డును కలిగి ఉండేందుకు ఇంచుమించు ప్రతి వయోజనుడూ ఆరాటపడుతున్నాడు. ఓటర్‌ గుర్తింపు కార్డు లేని పక్షంలో ప్రభుత్వ వ్యవస్థల నుంచి అందే వివిధ సేవలను కోల్పోవాల్సి వస్తుంది. ఓటుహక్కుకు అర్హమైన వయసు వచ్చినవారు స్వచ్ఛందంగా ఓటరుగా నమోదు చేయించుకునేందుకు శ్రద్ధ చూపకపోవడమనేది ఒక సాధారణ పరిణామంగా ఈసీఐ సైతం చూడడం లేదు. ఓటర్ల నమోదు అనేది రాజ్యవ్యవస్థ చొరవతో ప్రారంభమయ్యే ప్రక్రియ. దేశ పౌరులు ఓటరుగా నమోదు చేయించుకోకపోవడమనేది ఎన్నికల సంఘం వైఫల్యంగా పరిగణించి తీరాలి. దీనిని సరిదిద్దుకోవచ్చు. వయోజన జనాభా, ఓటర్ల సంఖ్య మధ్య ఉన్న తేడాను అంగీకరించడం సబబు కాదు. ఓటర్‌ జాబితాల ప్రత్యేక సవరణ ద్వారా ఈ వ్యత్యాసాన్ని తొలగించాలి. నిజానికి గతంలో యువజనులలో ఓటరుగా నమోదైన వారి సంఖ్య 7.5శాతం కంటే తక్కువగా ఉండేది. ఉదాహరణకు 2014లో ఓటరుగా నమోదైన యువజనుల శాతం మొత్తం వయోజన జనాభాలో 5.2 శాతం మాత్రమే.


స్వచ్ఛందంగా ఓటరుగా నమోదు చేయించుకోనివారు భల్లా పేర్కొన్నట్టు 8.5శాతంగా ఉన్నారని అంగీకరించినప్పటికీ న్యాయవిరుద్ధంగా ఓటర్‌ జాబితాల నుంచి తొలగింపునకు గురైనవారు ఒక్క ఉత్తరప్రదేశ్‌లోనే 1 కోటీ 40 లక్షలు. సర్‌ ప్రథమ, ద్వితీయ దశలు అమలయిన తొమ్మిది రాష్ట్రాలలో కేవలం 70 లక్షల మంది మాత్రమే తుది ఓటర్‌ జాబితాల నుంచి తొలగింపునకు గురయ్యారన్న భల్లా వాదన సహేతుకమైనది కాదని యూపీ వాస్తవం స్పష్టం చేసింది. 2024లో ఉత్తరప్రదేశ్‌లో 18 నుంచి 29 సంవత్సరాల మధ్య వయసు ఉన్న యువజనులలో 40శాతం మంది ఓటరుగా నమోదు చేయించుకోలేదని భల్లా పేర్కొన్నారు. అయితే ఆ రాష్ట్రంలో ఓటరుగా నమోదు కాకపోవడానికి అనుమతించదగిన పరిమితిని ప్రామాణిక 8.5శాతం కంటే అధికం చేశారు. ఇదెలా సమర్థనీయం?

కొద్దివారాల క్రితం సుర్జిత్‌ భల్లా ఒక వ్యాసంలో సర్‌ తుది జాబితాల నుంచి ఒక ఓటు సంభావ్య తొలగింపు గురించి భావావేశంతో నిరసన తెలిపారు. తొలగింపునకు గురయ్యే అవకాశమున్న ఆ ఓటు ఆయనదే! మరి ఓటుహక్కుకు పూర్తిగా అర్హులయి ఉండి కూడా ఓటర్‌ జాబితాల నుంచి తొలగింపునకు గురికావడమనేది చిన్న విషయంపై పెద్ద రభస ఎలా అవుతుంది?

- జీన్‌ డ్రెజ్‌

- యోగేంద్ర యాదవ్‌

Updated Date - Oct 23 , 2026 | 02:45 AM