Share News

ఆదిలాబాద్ విమానాశ్రయం ఏర్పాటుకు అడుగులు వేగంగా పడుతున్నాయి: కిషన్ రెడ్డి

ABN , Publish Date - Sep 12 , 2026 | 05:25 PM

ఆదిలాబాద్ విమానాశ్రయం ఏర్పాటుకు అడుగులు వేగంగా పడుతున్నాయని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఈ అంశంపై శనివారం నాడు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో సమావేశమైనట్లు తెలిపారు.

ఆదిలాబాద్ విమానాశ్రయం ఏర్పాటుకు అడుగులు వేగంగా పడుతున్నాయి: కిషన్ రెడ్డి
Union Minister Kishan Reddy

న్యూఢిల్లీ: వాణిజ్యపరంగా, వ్యూహాత్మకంగా కీలకమైన ఆదిలాబాద్ ప్రాంతంలో విమానాశ్రయం ఏర్పాటుకు అడుగులు వేగంగా పడుతున్నాయని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఈ అంశంపై ఇవాళ (శనివారం) కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో సమావేశమైనట్లు తెలిపారు. ఈ భేటీలో ఆదిలాబాద్ విమానాశ్రయ ప్రాజెక్టు పురోగతిపై సమీక్షించినట్లు కిషన్ రెడ్డి పేర్కొన్నారు.


ఈ సందర్భంగా ఎయిర్‌పోర్ట్ ప్రాజెక్టు అమలును వేగవంతం చేయాలని నిర్ణయించినట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. దీనికి సంబంధించిన కార్యాచరణను మరింత పకడ్బందీగా అమలు చేసేందుకు రక్షణ శాఖ, పౌర విమానయాన శాఖ, తెలంగాణ ప్రభుత్వం నుంచి ఒక్కో నోడల్ అధికారిని వచ్చే వారంలోగా నియమించాలని నిర్ణయించినట్లు తెలిపారు. జాయింట్ యూజర్ ఎయిర్‌పోర్ట్‌కు డీపీఆర్, మాస్టర్ ప్లాన్ రూపకల్పనను వేగవంతం చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ఉత్తర తెలంగాణ కనెక్టివిటీకి సంబంధించి విమానాశ్రయం, ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ ఏర్పాటు అవసరాన్ని కేంద్ర మంత్రులకు వివరించినట్లు తెలిపారు. రీజినల్ కనెక్టివిటీని మెరుగుపరచాల్సిన అంశాన్నీ వారి దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు.


ఈ మేరకు ఆదిలాబాద్‌లో జాయింట్ యూజర్ ఎయిర్‌ఫీల్డ్ (JUA)ను అభివృద్ధి చేసేందుకు రక్షణ మంత్రిత్వ శాఖ సిద్ధంగా ఉందని రాజ్‌నాథ్ సింగ్ చెప్పారన్నారు. అలాగే ఇందుకు అవసరమైన సంపూర్ణ సహకారాన్ని అందిస్తామని ఆయన హామీ ఇచ్చారని కిషన్ రెడ్డి తెలిపారు. మరోవైపు, ఈ విమానాశ్రయం కోసం ఏళ్లుగా చేస్తున్న ప్రయత్నాలు.. వరుస సమావేశాలు, లేఖలు, నిరంతర సమన్వయం నేడు తుది దశకు చేరుకోవడం సంతోషంగా ఉందని ఆయన చెప్పుకొచ్చారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు ఉత్తర తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్ష సాకారమయ్యే దిశగా కీలక ముందడుగు పడిందని కేంద్ర మంత్రి హర్షం వ్యక్తం చేశారు.


కాగా, ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టుకు సంబంధించి రాజ్‌నాథ్ సింగ్, రామ్మోహన్ నాయుడు, తెలంగాణ అధికారుల మధ్య ఇప్పటికే పలు సమావేశాలు జరిగాయని కిషన్ రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా రక్షణ, పౌర విమానయాన అధికారులు 17 ఏప్రిల్ 2026న విమానాశ్రయ స్థలాన్ని పరిశీలించారన్నారు. ఈ సందర్భంగా 2.75 కిలోమీటర్ల రన్‌వే నిర్మాణం అవసరమని వారు నిర్ణయించారని తెలిపారు. దీంతోపాటుగా ఐఏఎఫ్ వద్ద ఉన్న 369.45 ఎకరాల భూమికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం మరో 1,500 ఎకరాల భూమిని సేకరించాలని నిర్ణయించిందని చెప్పారు. ఈ భూమిలో ట్రైనర్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు, విజిటింగ్ ఎయిర్‌క్రాఫ్ట్ పార్కింగ్, వెదర్ షెల్టర్లు, ఎయిర్‌క్రాఫ్ట్ హ్యాంగర్లు, ఆపరేషనల్ కాంప్లెక్స్, ట్రైనింగ్ ఫెసిలిటీస్, మెయింటెనెన్స్ ఇన్‌ఫ్రా ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తామన్నారు.


అలాగే పౌర సేవలకు సంబంధించి సివిల్ టెర్మినల్‌తో పాటు నిర్వహణ, మరమ్మతు కార్యకలాపాల కేంద్రాన్ని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) ఏర్పాటు చేస్తుందన్నారు. వీటితో పాటు అక్కడ పనిచేసే ఎయిర్‌ఫోర్స్ సిబ్బందికి అవసరమైన నివాస, ఇతర మౌలిక సదుపాయాలను కూడా ఏర్పాటు చేస్తారని కిషన్ రెడ్డి చెప్పారు.


ఈ వార్తలు కూడా చదవండి

కేసీఆర్ హయాంలోని భూ అక్రమాలను అసెంబ్లీ ముందు ఉంచుతాం: పొంగులేటి

భాగ్యనగరవాసులకు అలర్ట్.. ఈ రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలివే..

Updated Date - Sep 12 , 2026 | 05:27 PM