Share News

ఆదిలాబాద్‌లో భారీగా పేలుడు పదార్థాల స్వాధీనం.. ఏడుగురి అరెస్ట్‌

ABN , Publish Date - Oct 15 , 2026 | 04:40 PM

ఉత్తరప్రదేశ్‌ నుంచి తెలుగు రాష్ట్రాలకు పేలుడు పదార్థాలను అక్రమంగా తరలిస్తున్న ముఠాను ఆదిలాబాద్‌ పోలీసులు పట్టుకున్నారు. జైనథ్‌ మండలం పిప్పర్‌వాడ టోల్‌ప్లాజా వద్ద తనిఖీలు నిర్వహించి.. 20 వేల డిటోనేటర్లు, 90 బూస్టర్లను స్వాధీనం చేసుకున్నారు.

ఆదిలాబాద్‌లో భారీగా పేలుడు పదార్థాల స్వాధీనం.. ఏడుగురి అరెస్ట్‌
Adilabad Explosives

ఆదిలాబాద్‌, అక్టోబర్ 15: ఉత్తరప్రదేశ్‌ నుంచి తెలుగు రాష్ట్రాలకు భారీగా పేలుడు పదార్థాలను తరలిస్తున్న ముఠా గుట్టును ఆదిలాబాద్‌ పోలీసులు రట్టు చేశారు. జైనథ్‌ మండలం పిప్పర్‌వాడ టోల్‌ప్లాజా సమీపంలో చేపట్టిన తనిఖీల్లో భారీ మొత్తంలో పేలుడు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల తనిఖీల్లో 20 వేల ఎలక్ట్రానిక్‌ డిటోనేటర్లు, 90 బూస్టర్లు బయటపడగా.. వీటి విలువ రూ.20 లక్షలకు పైగా ఉంటుందని అధికారులు అంచనా వేశారు. పేలుడు పదార్థాలను తరలించేందుకు ఉపయోగించిన బొలెరో వాహనం, హోండా సిటీ కారుతో పాటు ఆరు సెల్‌ఫోన్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.


ఇతర ప్రాంతాల నుంచి పేలుడు సామగ్రిని తీసుకొచ్చి తెలుగు రాష్ట్రాలకు సరఫరా చేస్తున్న ముఠా కదలికలపై పోలీసులు నిఘా పెట్టిన నేపథ్యంలో ఈ పట్టివేత ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ కేసులో మొత్తం ఏడుగురు నిందితులను అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ వెల్లడించారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని, వారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాలను ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? తెలుగు రాష్ట్రాల్లో ఎవరికి సరఫరా చేయాలని భావించారు? ఈ వ్యవహారంలో ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉంది? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పేలుడు సామగ్రి రవాణా వెనుక ఉన్న నెట్‌వర్క్‌ను గుర్తించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

ఉద్యోగం ఊడుద్ది.. జాగ్రత్త!

ఎకరానికి రూ.10 వేల పరిహారం

వర్సిటీ ఆచార్యుల భర్తీకి రంగం సిద్ధం

Read Latest AP News And Telangana News 

Updated Date - Oct 15 , 2026 | 05:16 PM