మరో పదేళ్లలో ఏఐతో మానవాళికి ముప్పు: గూగుల్ మాజీ ఇంజినీర్
ABN , Publish Date - Oct 28 , 2026 | 05:52 PM
కృత్రిమ మేధ (ఏఐ)తో మానవాళి మనుగడకే ముప్పు ఏర్పడే ప్రమాదం ఉందని గూగుల్ మాజీ ఇంజినీర్ నేట్ సోరెస్ హెచ్చరించారు. మరో పదేళ్లలో మనుషులు అంతరించిపోయే ప్రమాదం 50 శాతానికి మించి ఉందని ఆయన అంచనా వేశారు.
ఇంటర్నెట్ డెస్క్: కృత్రిమ మేధ (ఏఐ)తో మానవాళి మనుగడకే ముప్పు ఏర్పడే ప్రమాదం ఉందని గూగుల్ మాజీ ఇంజినీర్ నేట్ సోరెస్ హెచ్చరించారు. మరో పదేళ్లలో మనుషులు అంతరించిపోయే ప్రమాదం 50 శాతానికి మించి ఉందని ఆయన అంచనా వేశారు. ఈ ఆందోళనతోనే తాను పదవీ విరమణ కోసం డబ్బు దాచడం కూడా మానేశానని వెల్లడించారు. ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతం సాంకేతిక రంగంలో చర్చకు దారితీశాయి. గూగుల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏఐ భద్రతపై పరిశోధనలు చేస్తున్న మెషిన్ ఇంటెలిజెన్స్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఎంఐఆర్ఐ) అధ్యక్షుడిగా నేట్ సోరెస్ కొనసాగుతున్నారు (Nate Soares about AI risks).
అత్యంత శక్తిమంతమైన ఏఐ వ్యవస్థలు భవిష్యత్తులో మానవుల నియంత్రణను దాటిపోయే ప్రమాదాలపై ఆయన చాలా కాలంగా అధ్యయనం చేస్తున్నారు. రాబోయే పదేళ్లలో మానవాళి మనుగడ సాగించకపోయే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోందని సోరెస్ పేర్కొన్నారు. గూగుల్‌లో పనిచేసిన సమయంలో ప్రారంభించిన పదవీ విరమణ పొదుపు ఖాతాలో ఇప్పటికీ డబ్బు ఉన్నప్పటికీ, గత పదేళ్లుగా అందులో కొత్తగా నిధులు జమ చేయలేదని ఆయన వెల్లడించారు (AI could kill humanity).
అత్యంత శక్తిమంతమైన ఏఐ తన లక్ష్యాలను సాధించడానికి మనుషులు ఊహించని మార్గాలను ఎంచుకుంటుందని, మానవ నియంత్రణను తప్పించుకుని పనులు చేస్తుందని సోరెస్ వాదిస్తున్నారు (Superintelligent AI). ఈ ప్రమాదాలను అడ్డుకోవడానికి ఏఐ వ్యవస్థలను సురక్షితంగా రూపొందించడం, వాటి అభివృద్ధిపై తగిన నియంత్రణలు విధించడం అవసరమని ఆయన అభిప్రాయపడుతున్నారు. ఏఐ భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేస్తున్న వారిలో నోబెల్ బహుమతి గ్రహీత, ప్రముఖ ఏఐ శాస్త్రవేత్త జెఫ్రీ హింటన్ కూడా ఉన్నారు. మానవాళికి ఏఐ తీవ్ర ముప్పుగా మారే ప్రమాదాన్ని తక్కువగా అంచనా వేయకూడదని ఆయన గతంలో హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి..
సర్ ప్రక్రియపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. నిరంతరం దరఖాస్తులు స్వీకరించాలని స్పష్టం..
విద్వేషాన్ని వ్యాప్తి చేయకండి.. రాహుల్ గాంధీపై నిర్మలా సీతారామన్ ఆగ్రహం