Share News

‘సూపర్ ఇంటెలిజెన్స్’ వచ్చేసిందన్న మస్క్‌కు యాన్ లెకున్ చురకలు

ABN , Publish Date - Nov 23 , 2026 | 11:45 AM

‘సూపర్ ఇంటెలిజెన్స్’ వచ్చేసిందన్న ఎలాన్ మస్క్‌కు ఏఐ గాడ్‌ఫాదర్ యాన్ లెకున్ చురకలంటించారు. 'ఇంకా పూర్తి సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు కూడా లేవంటూ సెటైర్ వేశారు.

‘సూపర్ ఇంటెలిజెన్స్’ వచ్చేసిందన్న మస్క్‌కు యాన్ లెకున్ చురకలు
Elon Musk Yann LeCun

శాన్ ఫ్రాన్సిస్కో, నవంబర్ 23: కృత్రిమ మేధ (AI) సామర్థ్యాలపై టెస్లా అధినేత ఎలాన్ మస్క్, 'ఏఐ గాడ్‌ఫాదర్'గా పేరొందిన ప్రముఖ శాస్త్రవేత్త యాన్ లెకున్ (Yann LeCun) మధ్య 'ఎక్స్' (X) వేదికగా ఆసక్తికర చర్చ జరిగింది. మానవ మేధస్సును మించిన 'సూపర్ ఇంటెలిజెన్స్' యుగంలోకి మనం అడుగుపెట్టేశామని మస్క్ ప్రకటించగా, కనీసం పూర్తిస్థాయి సెల్ఫ్ డ్రైవింగ్ కార్లను కూడా తయారు చేయలేకపోయామని లెకున్ సెటైర్లు వేశారు.

ఆంత్రోపిక్ సంస్థకు చెందిన 'క్లౌడ్' ఏఐ, 167 ఏళ్లుగా పరిష్కారం కాని ప్రముఖ గణిత సమస్య 'రీమన్ హైపోథీసిస్' ను ఛేదించిందన్న వార్తల నేపథ్యంలో మస్క్ స్పందించారు. 'స్పష్టమైన సూపర్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది. సింగులారిటీకి స్వాగతం' అని మస్క్ 'ఎక్స్'లో పోస్ట్ చేశారు.

మస్క్ వ్యాఖ్యలపై యాన్ లెకున్ వ్యంగ్యంగా స్పందించారు. 'ఈరోజే నాకో విషయం తెలిసింది. మన దగ్గర సూపర్ ఇంటెలిజెన్స్ ఉంది కానీ, ఇప్పటికీ లెవల్-5 అటానమస్ డ్రైవింగ్ (పూర్తిస్థాయి సెల్ఫ్ డ్రైవింగ్) కార్లు మాత్రం లేవు' అని చురకలంటించారు.

17 ఏళ్ల కుర్రాడు కేవలం 20 గంటల ప్రాక్టీస్‌తో నేర్చుకోగలిగే డ్రైవింగ్‌ను కూడా ఈ సూపర్ ఇంటెలిజెన్స్ ఏఐ ఇప్పటికీ చేయలేకపోతోందని లెకున్ ఎద్దేవా చేశారు.

కాగా, 2021లోనే టెస్లా కార్లు పూర్తిస్థాయి లెవల్-5 అటానమస్ డ్రైవింగ్ సాధిస్తాయని మస్క్ గతంలో ధీమా వ్యక్తం చేశారు. కానీ టెస్లా తాజా 'సైబర్‌క్యాబ్' కూడా కేవలం లెవల్-4 (పరిమిత ప్రాంతాలు, పరిస్థితులకు మాత్రమే పరిమితం) వద్దే ఉంది. మరోవైపు, తమ కొత్త 'AI5' చిప్ కేవలం ఆప్టిమస్ రోబోలకు మాత్రమే పరిమితమని, కార్లకు ప్రస్తుత 'AI4' చాలని, లెవల్-5 అవసరం లేదని మస్క్ తాజాగా స్పష్టం చేశారు.

మస్క్ ప్రతిష్ఠాత్మకంగా చెబుతున్న టెస్లా 'ఆప్టిమస్' హ్యూమనాయిడ్ రోబోలపైనా లెకున్ విమర్శలు గుప్పించారు. 'ఎలాంటి ముందస్తు శిక్షణ లేకుండా ఓ ఎనిమిదేళ్ల చిన్నారి చేసే పనుల్లో కనీసం దరిదాపుల్లోకి కూడా నేటి రోబోలు రాలేకపోతున్నాయి. ఇక పిల్లుల తెలివితేటల గురించి మాట్లాడకపోవడమే మంచిది' అని లెకున్ అన్నారు. ఇవన్నీ చూస్తుంటే మనం సూపర్ ఇంటెలిజెన్స్ యుగంలో ఉన్నామనడం చాలా 'వింతగా' అనిపిస్తోందని వ్యాఖ్యానించారు.

2026 జనవరిలో దావోస్ సదస్సులో మాట్లాడిన మస్క్, 2030 నాటికి ఏఐ మొత్తం మానవాళి కంటే తెలివైనదిగా మారుతుందని, మనుషుల కంటే రోబోలే ఎక్కువగా ఉంటాయని అంచనా వేశారు. అయితే, ఆప్టిమస్ రోబోల భద్రత, డిజైన్, మన్నిక విషయంలో ఇంకా కొన్ని సవాళ్లు ఉన్నాయని, అందువల్ల వాటి ఉత్పత్తి నెమ్మదిగా ఉంటుందని మస్క్ ఇటీవల అంగీకరించారు. (Elon Musk Yann LeCun)


ఈ వార్తలనూ చదవండి:

ఎన్విడియా చిప్స్ స్మగ్లింగ్‌ వెనుక చైనా వ్యాపారవేత్త స్కెచ్

భారత్‌లోని వైవిధ్యం ఇతర దేశాలకు కూడా ఆదర్శం: పుతిన్

Updated Date - Nov 23 , 2026 | 12:02 PM