Share News

ఏఐ యుగంపనిలేని ప్రపంచం!

ABN , Publish Date - Feb 21 , 2026 | 03:39 AM

సాఫ్ట్‌వేర్‌ కోడ్‌లు రాసేస్తోంది.. పాటలు పాడేస్తోంది.. చెప్పినట్టుగా వీడియోలు సృష్టిస్తోంది.. కోరినట్టుగా ఫోటోలనూ మార్చి ఇచ్చేస్తోంది.. మన సందేహాలకు సమాధానాలూ ఇస్తోంది..

ఏఐ యుగంపనిలేని ప్రపంచం!

ఏఐ వ్యవస్థలు, రోబోలతో భవిష్యత్తులో 90ు ఉద్యోగాలు, ఉపాధికి కోత!

(సెంట్రల్‌ డెస్క్‌)

సాఫ్ట్‌వేర్‌ కోడ్‌లు రాసేస్తోంది.. పాటలు పాడేస్తోంది.. చెప్పినట్టుగా వీడియోలు సృష్టిస్తోంది.. కోరినట్టుగా ఫోటోలనూ మార్చి ఇచ్చేస్తోంది.. మన సందేహాలకు సమాధానాలూ ఇస్తోంది.. జస్ట్‌ ఇప్పుడే మొదలైంది.. మానవ జీవితంలో కొన్ని వేల ఏళ్లుగా వచ్చిన మార్పులు ఒక ఎత్తయితే.. కృత్రిమ మేధ (ఏఐ)తో రాబోతున్న జరగబోతున్న మార్పులు అంతకుమించి ఉండబోతున్నాయని కృత్రిమ మేధ రంగంలోని నిపుణులు చెబుతున్నారు. ఇన్నాళ్లూ కొత్త ఆవిష్కరణలు వచ్చినప్పుడల్లా మనుషుల ఉద్యోగాల్లో, ఉపాధి తీరులో మార్పులు జరుగుతూ వస్తే... ఏఐ యుగంలో మాత్రం 90శాతం జనాభాకు అసలు ఉద్యోగాలు, ఉపాధి అనేదే లేకుండా పోతుందని కృత్రిమ మేధ రంగంలోని నిపుణులు చెబుతున్నారు. ప్రజలకు రోజువారీ వ్యక్తిగత పనులు, నచ్చిన వ్యాపకాలు తప్ప మరేమీ ఉండవనీ అంటున్నారు. ఏ సంపాదనా లేకపోతే బతికేదెలా!? ఖర్చులకు డబ్బులు ఎలాగన్న సందేహాలు వస్తున్నాయి కదా!! దానికీ కొన్ని సూచనలు చేస్తున్నారు.

ఏఐకి రోబోలూ జతకలిస్తే..

రోజురోజుకు ఏఐ సామర్థ్యం మరింతగా పెరుగుతోంది. ఇప్పటికే చాలా వరకు ఆన్‌లైన్‌/కంప్యూటర్‌ ఆధారిత పనులన్నీ ఏఐ చేసేస్తోంది. పిల్లలకు హోంవర్క్‌లు చేసిపెట్టడం, వ్యాసాలు రాసిపెట్టడం నుంచి రోగుల వైద్య నివేదికలను విశ్లేషించి సమస్యను గుర్తించడం దాకా ఏఐ వినియోగం విస్తృతమైంది. చెప్పిన సూచనలకు అనుగుణంగా ఫొటోలు, వీడియోలు సిద్ధం చేసే చాట్‌జీపీటీ, గ్రోక్‌, గూగుల్‌ జెమినీ.. కావాల్సినట్టుగా పాటలు రూపొందించి పెట్టే ‘సునో’ యాప్‌.. ఇలా ఎన్నో వచ్చేశాయి. ఇక ఏఐకి రోబోలు జతకలిస్తే.. మనుషులు చేసే దాదాపు అన్ని పనులూ అవే చేస్తాయి. ఇప్పటికే రిసెప్షనిస్టులుగా, చాట్‌బోట్‌ల రూపంలో టెలీకాలర్లుగా, ఆటోమేటిక్‌ కార్ల డ్రైవర్లుగా, అమెజాన్‌ వంటి ఈ-కామర్స్‌ సైట్ల గోదాముల్లో సరుకులను సర్ది, ఆర్డర్లకు తగినట్టుగా తీసి ప్యాకింగ్‌కు సిద్ధం చేసే సిబ్బందిగా ఏఐ రోబోలు పనిచేస్తున్నాయి. కార్ల కంపెనీలు, ఎలకా్ట్రనిక్‌ వస్తువుల తయారీ సంస్థలు తమ ఫ్యాక్టరీలలో రోబోలను వినియోగిస్తున్నాయి. మొత్తంగా భవిష్యత్తులో అత్యంత భారీ సంఖ్యలో ఉద్యోగాలు పోవడం ఖాయమని ‘గాడ్‌ ఫాదర్‌ ఆఫ్‌ ఏఐ’గా గుర్తింపు పొందిన శాస్త్రవేత్త జెఫరీ హింటన్‌ స్పష్టం చేశారు.


సామాజిక, ఆర్థిక వ్యవస్థలన్నీ తలకిందులు!

భవిష్యత్తులో వ్యవసాయం నుంచి అంతరిక్షం దాకా అన్ని పనులూ ఏఐ రోబోలతో చేసేస్తుందని, దీనితో మానవ సామాజిక, ఆర్థిక వ్యవస్థలు సమూలంగా మారిపోతాయన్నది నిపుణులు చెబుతున్న మాట. మనుషుల్లో ఇప్పుడున్న ధనిక, మధ్యతరగతి, పేదలు వంటి వర్గాలు మారిపోయి.. మూడు కొత్త వర్గాలు ఏర్పడుతాయని వారు స్పష్టంగా చెబుతున్నారు. ఒకటి అత్యంత సంపన్నమైన ఏఐ వ్యవస్థల యజమానులు.. రెండోది ఏఐ వ్యవస్థల నిర్వహణ, అభివృద్ధిని పర్యవేక్షించే మేనేజర్లు/ఇన్నోవేటర్లు.. మూడోది ఏఐ వల్ల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కోల్పోయి చేయడానికి ఏమీ లేకుండా ఉండిపోయే ప్రజలు. ఏఐ కారణంగా 90శాతం మంది జనాభాకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేకుండా పోతాయని యూకేకు చెందిన ప్రముఖ ఏఐ శాస్త్రవేత్త స్టూవర్ట్‌ రస్సెల్‌, సన్‌ మైక్రోసిస్టమ్స్‌ సహవ్యవస్థాపకుడు వినోద్‌ ఖోస్లా ఇటీవలే పేర్కొన్నారు.

3.jpg

ఏఐ వ్యవస్థలు చేతిలో ఉన్నవారిదే ‘పవర్‌’!

భారీగా సంపద పోగుపడిన ‘ఏఐ’ యజమానులే పవర్‌ఫుల్‌గా మారిపోతారని.. ప్రభుత్వాలనూ శాసించగలిగే పరిస్థితులు ఉంటాయని స్టూవర్ట్‌ రస్సెల్‌ తదితర ఏఐ నిపుణులు హెచ్చరిస్తున్నారు. తమ చేతిలోని ఏఐ వ్యవస్థలను అడ్డుపెట్టుకుని.. సరుకుల ఉత్పత్తి నుంచి సేవల వరకు అన్నింటినీ నియంత్రించగలిగే పరిస్థితి ఉంటుందని అంటున్నారు. అందువల్ల ఏఐ విషయంలో స్పష్టమైన నియంత్రణ, పకడ్బందీ మార్గదర్శకాలపై ఇప్పుడే దృష్టిపెట్టాలని సూచిస్తున్నారు. భవిష్యత్తులో ఏఐ వ్యవస్థల యాజమాన్యమే కీలకమని, దానిపై ప్రభుత్వాలు, సంస్థలు దృష్టిపెట్టాలని మైండ్‌ నెట్‌వర్క్‌ ఏఐ సంస్థ సీఈవో క్రిస్టియర్‌ పుసెట్రీ సూచిస్తున్నారు.

  • భారీగా పెట్టుబడులు పెట్టి ఏఐ వ్యవస్థలు, రోబోలను ఏర్పాటు చేసే యజమానులు మొదటి వర్గంగా ఉంటారు. ప్రస్తుతం మనుషులు చేస్తున్న ఉద్యోగాలు, పనులన్నీ ఏఐ, రోబోలే చేస్తాయి. పరిశ్రమల్లో కార్మికులు ఉండరు. వ్యవసాయం, భవనాల నిర్మాణం వంటి శ్రమ ఆధారిత పనులు, ఇంటి పనులు, వంట పనులు.. సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లు, టీచర్లు, లాయర్లు, జర్నలిస్టులు, డ్రైవర్లు, కస్టమర్‌ కేర్‌ సిబ్బంది, బ్యాంకు ఉద్యోగులు, మార్కెటింగ్‌ ఉద్యోగులు, గ్రాఫిక్‌ డిజైనర్లు, కంటెంట్‌ క్రియేటర్లు, హెచ్‌ఆర్‌ ఉద్యోగులు, డెలివరీ బాయ్స్‌.. ఇలా అన్ని పనులనూ ఏఐ రోబోలు చేస్తాయి. ఆ పనులకు సంబంధించిన ఆదాయమంతా ‘ఏఐ’ వ్యవస్థల యజమానుల చేతికే వెళుతుంది.

  • ఏఐ వ్యవస్థల నిర్వహణ కోసం యజమానుల కింద పనిచేసే ఉద్యోగులు, ఏఐ వ్యవస్థలను మరింత మెరుగుపరిచే, సరికొత్త ఆవిష్కరణలు చేసే ఇన్నోవేటర్లు, ఏఐ చేయలేని భావోద్వేగాలతో ముడిపడిన పనులు చేసేవారు.. రెండో వర్గంగా ఉంటారు. వీరికి పని ఉంటుంది. అందుకు తగిన ఆదాయమూ ఉంటుంది. మొత్తంగా జనాభాలో కేవలం రెండు, మూడు శాతం యజమానులు, మరో ఏడెనిమిది శాతం ఉండే మేనేజర్లు/ఇన్నోవేటర్ల వద్దే మొత్తం సంపదలో 99శాతం సంపద కేంద్రీకృతమై ఉంటుంది.

  • అన్ని పనులూ ఏఐ వ్యవస్థలు, రోబోలే చేస్తుంటే.. చేయడానికి ఉద్యోగం, ఉపాధి ఏమీ లేకుండా ఉండిపోయే ప్రజలు 90శాతం ఉంటారు. వారికి దాదాపుగా ఎలాంటి ఆదాయమూ ఉండదు. ప్రభుత్వం అందించే ఆర్థిక సాయంపైనే ఆధారపడాల్సి ఉంటుంది.

2.jpg


సంపద సృష్టి ఎలా? పంపిణీ ఎలా?

మనుషులకు ఉద్యోగాలు, ఉపాధి పోయినా.. ఆ పనులన్నీ ఏఐ వ్యవస్థలు, రోబోలతో జరిగిపోతూనే ఉంటాయి. పంటల నుంచి పరిశ్రమల్లో ఉత్పత్తుల దాకా ఇంకా మెరుగ్గా కొనసాగుతూ ఉంటాయి. వాటి నుంచి పన్నుల రూపంలో ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతూనే ఉంటుంది. ఇప్పటికంటే ఇంకా ఎక్కువగా సంపద సృష్టి జరుగుతూనే ఉంటుంది. ఆ సంపద అంతా ‘ఏఐ’ యజమానుల చేతిలోకే వెళుతుంది. కొంత ప్రభుత్వానికి చేరుతుంది. పని ఉండని ప్రజలకు ఖర్చుల కోసం ‘యూబీఐ (యూనివర్సల్‌ బేసిక్‌ ఇన్‌కం-అందరికీ కనీస వేతనం)’ కింద ప్రభుత్వమే ప్రతినెలా డబ్బులు ఇవ్వాల్సి ఉంటుందని ఏఐ నిపుణులు చెబుతున్నారు. వ్యవస్థలు కొనసాగాలంటే వినియోగం ఉండాలని, ప్రభుత్వమే డబ్బులు ఇచ్చి ఆ వినియోగాన్ని కొనసాగించక తప్పదని స్పష్టం చేస్తున్నారు. ‘ఏఐ’ యజమానులపై ఆదాయ పన్నును, ఏఐ వ్యవస్థలు చేసే ఉత్పత్తులపై పన్నులను పెంచడం ద్వారా ‘యూబీఐ’ కోసం అవసరమైన సొమ్మును ప్రభుత్వం సమకూర్చుకోవచ్చని అంటున్నారు.

1.jpg

ఐదేళ్లలో 80 కోట్ల ఉద్యోగాలకు కోత!

ఏఐ కారణంగా 2030 నాటికల్లా ప్రపంచవ్యాప్తంగా 30 కోట్ల మందికి ఉద్యోగాలు పోతాయని ప్రముఖ ఆర్థిక సేవల సంస్థ గోల్డ్‌మన్‌ సాక్స్‌ అంచనా వేయగా, ఆ సంఖ్య 80 కోట్లకుపైగానే ఉంటుందని కన్సల్టింగ్‌ సేవల కంపెనీ మెక్‌కిస్నీ పేర్కొంది. ఆ ఉద్యోగుల స్థానంలో ఏఐని వినియోగించడం వల్ల కంపెనీల ఉత్పాదకత, లాభాలు 14శాతం వరకు పెరిగే అవకాశం ఉందని అంచనా వేశాయి.


ఇవి కూడా చదవండి...

ఆయేషా కేసు క్లోజ్‌!

వైసీపీ మహాపచారం

Read Latest Telangana News And Telugu News

Updated Date - Feb 21 , 2026 | 10:07 AM