పాక్ క్రికెట్ బాగు కోసం నేనేమీ చేయలేకపోతున్నా: వసీం అక్రమ్
ABN , Publish Date - Sep 09 , 2026 | 11:27 AM
పాకిస్థాన్ క్రికెట్ పరిస్థితిపై ఆ దేశ మాజీ క్రికెటర్ వసీం అక్రమ్ ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రస్తుత పరిస్థితులు కేవలం ప్లేయర్లు, క్రికెట్ బోర్డు వైఫల్యం వల్లే ఏర్పడలేదని, వ్యవస్థలోనే సమస్యలు లోతుగా పాతుకుపోయాయని పేర్కొన్నాడు.
ఇంటర్నెట్ డెస్క్: పాకిస్థాన్ క్రికెట్ పరిస్థితిపై ఆ దేశ మాజీ క్రికెటర్ వసీం అక్రమ్ ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రస్తుత పరిస్థితులు కేవలం ప్లేయర్లు, క్రికెట్ బోర్డు వైఫల్యం వల్లే ఏర్పడలేదని, వ్యవస్థలోనే సమస్యలు లోతుగా పాతుకుపోయాయని పేర్కొన్నాడు. అందుకే తాను ఒక వ్యక్తిగా పాకిస్థాన్ క్రికెట్‌ను బాగు చేయడం సాధ్యం కాదని తెలిపాడు. ఇంగ్లండ్‌తో మూడు టెస్టుల సిరీస్‌లో ఇప్పటికే 0-2తో వెనుకబడిన పాకిస్థాన్.. బుధవారం నుంచి ఎడ్జ్‌బాస్టన్‌లో మూడో టెస్టు ఆడనుంది. ఈ మ్యాచ్‌లోనూ పాక్ ఓడిపోయి 0-3తో సిరీస్‌ను కోల్పోయినా ఆశ్చర్యం లేదని అక్రమ్ వెల్లడించాడు.
‘ఈ సిరీస్‌కు ముందే ఇంగ్లండ్ చేతిలో పాకిస్థాన్ 0-3తో ఓడిపోతుందని నాకు తెలుసు. మన బ్యాటింగ్ ఇబ్బందుల్లో ఉంది. బౌలింగ్ సగటు స్థాయిలో కూడా లేదు. ఫీల్డింగ్ పరిస్థితి మరింత దారుణంగా ఉంది. దీనికి పెద్దగా లెక్కలు వేయాల్సిన అవసరం లేదు. రెండు చేతులు కలిపితే చప్పట్లు వస్తాయి. పాక్ జట్టులోని కొందరు ప్లేయర్ల మానసిక ధోరణి కూడా సమస్యలను మరింత పెంచుతోంది. తప్పు మొత్తం ప్లేయర్లపై లేదా పాకిస్థాన్ క్రికెట్ బోర్డుపైనే నెట్టడం సరికాదు. దేశ క్రికెట్ వ్యవస్థలో కింది స్థాయి నుంచే లోపాలు ఉన్నాయి’ అని వసీం అక్రమ్ వివరించాడు.
నన్ను అడుగుతూనే ఉంటారు.. కానీ!
‘పాకిస్థాన్ క్రికెట్‌ను గాడిలో పెట్టడానికి మీరు ఏదైనా చేయగలరా? అని నన్ను ఎప్పుడూ అడుగుతుంటారు. కానీ సమస్యలు చాలా లోతుగా ఉన్నాయి. ప్రస్తుతం ఉన్నవాళ్లే మన టాప్ ఆటగాళ్లు. వారి కింద సరైన వ్యవస్థ లేదు. దేశవాళీ ఫస్ట్‌క్లాస్ క్రికెట్ నిర్మాణం గత కొన్నేళ్లుగా గందరగోళంగా మారింది. స్థిరత్వం లేదు.. ఎవరిలోనూ ఓపిక లేదు. జట్టు ఓడిపోతే అభిమానులు కూడా మొత్తం వ్యవస్థను కూల్చేయాలని కోరుకుంటారు. మనం ఇప్పటికే ఎన్నోసార్లు అదే చేశాం’ అని వసీం అక్రమ్ ఆవేదన వ్యక్తం చేశాడు.
ఇవి కూడా చదవండి:
యూఎస్ ఓపెన్: కన్నీళ్లు పెట్టుకున్న ప్రత్యర్థి.. ఆ బాధ తనకు తెలుసంటూ..!
పాకిస్థాన్ చెత్త జట్టు అంటూ విమర్శలు.. అలా మాట్లాడటం సరైంది కాదు: జో రూట్