Share News

యూఎస్ ఓపెన్: కన్నీళ్లు పెట్టుకున్న ప్రత్యర్థి.. ఆ బాధ తనకూ తెలుసంటూ..!

ABN , Publish Date - Sep 09 , 2026 | 10:32 AM

యూఎస్ ఓపెన్ టోర్నీలో భాగంగా నేడు జరిగిన క్వార్టర్ ఫైనల్‌లో టెన్నిస్ స్టార్, 11వ సీడ్ ఫ్రాన్సిస్ టియాఫో ఘన విజయం సాధించాడు. ప్రత్యర్థి అలెక్స్ మైకెల్సెన్‌ను ఓడించి సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లాడు.

యూఎస్ ఓపెన్: కన్నీళ్లు పెట్టుకున్న ప్రత్యర్థి.. ఆ బాధ తనకూ తెలుసంటూ..!
Frances Tiafoe

ఇంటర్నెట్ డెస్క్: యూఎస్ ఓపెన్ టోర్నీలో భాగంగా నేడు జరిగిన క్వార్టర్ ఫైనల్‌లో టెన్నిస్ స్టార్, 11వ సీడ్ ఫ్రాన్సిస్ టియాఫో ఘన విజయం సాధించాడు. ప్రత్యర్థి అలెక్స్ మైకెల్సెన్‌ను ఓడించి సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లాడు. అయితే మ్యాచ్ ముగిసిన తర్వాత చోటు చేసుకున్న ఓ భావోద్వేగ సన్నివేశం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తొలుత గట్టి పోటీనిచ్చిన అలెక్స్.. అనూహ్యంగా ఓడిపోవడంతో కోర్టులోనే కన్నీళ్లు పెట్టుకున్నాడు. గెలుపు సంబరాలను పక్కన పెట్టి రాకెట్‌ను వదిలిన టియాఫో.. ప్రత్యర్థి అలెక్స్‌ను హత్తుకుని ఓదార్చడం అందరినీ ఆకట్టుకుంది.


నాలుగు గంటల 40 నిమిషాల పాటు సాగిన హోరాహోరీ పోరులో టియాఫో 5-7, 3-6, 7-5, 6-3, 7-6(6)తో అలెక్స్‌ను ఓడించాడు. తొలి రెండు సెట్లను కోల్పోయిన తర్వాత అద్భుతంగా పుంజుకున్న టియాఫో.. నిర్ణాయక టై బ్రేక్‌లోనూ ఒత్తిడిని అధిగమించి విజయాన్ని అందుకున్నాడు. మ్యాచ్‌ ఓడిన అనంతరం అలెక్స్ కన్నీళ్లను ఆపుకోలేకపోయాడు. రెండు సెట్ల ఆధిక్యాన్ని చేజార్చుకుని సెమీఫైనల్‌ అవకాశాన్ని కోల్పోవడంతో అతడు కోర్టులోనే బోరున విలపించాడు. అదే సమయంలో విజయం సాధించిన టియాఫో తన రాకెట్‌ను పక్కన పెట్టాడు. విజయోత్సాహాన్ని కూడా మధ్యలోనే ఆపేసి నేరుగా అలెక్స్ వద్దకు వెళ్లాడు. కన్నీళ్లతో ఉన్న తన ప్రత్యర్థిని ఆప్యాయంగా హత్తుకున్నాడు. కొద్దిసేపు అతడిని ఓదార్చుతూ మాట్లాడాడు. ఈ దృశ్యాలు ప్రేక్షకులనే కాదు.. సోషల్‌ మీడియా అభిమానులను కూడా కదిలించాయి.


ఆ బాధ నాకు తెలుసు: టియాఫో

గ్రాండ్‌స్లామ్‌లో ఓటమి ఎంత బాధిస్తుందో తనకు తెలుసని టియాఫో చెప్పాడు. ఈ ఏడాది వింబుల్డన్, ఫ్రెంచ్ ఓపెన్‌లోనూ టియాఫో ఐదు సెట్ల పోరాటం తర్వాత ఓటమి పాలయ్యాడు. ‘ఓటమి ఎదురైన ఆ క్షణం ఎలా ఉంటుందో నాకు తెలుసు. అందుకే వెళ్లి అలెక్స్‌ను హత్తుకుని ఓదార్చా. కొంత ధైర్యాన్నిచ్చా’ అని టియాఫో వెల్లడించాడు. అలెక్స్‌కు ఇదే తొలి గ్రాండ్‌స్లామ్ క్వార్టర్ ఫైనల్. అత్యుత్తమ ప్రదర్శనతో ఆఖరి వరకు వచ్చినా.. నిరాశ తప్పలేదు.


ఇవి కూడా చదవండి:

వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌కు శ్రేయస్ అయ్యర్ దూరం.. కారణమిదే!

ఆసియా క్రీడలు.. అవి ఫైవ్‌స్టార్ కాకపోయినా మంచి హోటళ్లే: బీసీసీఐ

Updated Date - Sep 09 , 2026 | 11:33 AM