ఐపీఎల్ మొత్తానికి హసరంగ దూరం.. ఎల్ఎస్‌జీలోకి సౌతాఫ్రికా స్టార్ ప్లేయర్
ABN , Publish Date - Apr 10 , 2026 | 06:29 PM
ఐపీఎల్ 2026లో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ జట్టుకు భారీ షాక్ తగిలిన సంగతి తెలిసిందే. శ్రీలంక మిస్టరీ స్పిన్నర్ వానిందు హసరంగ గాయం కారణంగా టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. దీంతో హసరంగ స్థానంలో సౌతాఫ్రికా స్టార్ ఆల్‌రౌండర్ జార్జ్ లిండేని ఎల్ఎస్‌జీ ఎంపిక చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026లో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ జట్టుకు భారీ షాక్ తగిలిన సంగతి తెలిసిందే. శ్రీలంక మిస్టరీ స్పిన్నర్ వానిందు హసరంగ గాయం కారణంగా టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. టీ20 ప్రపంచ కప్ 2026 సందర్భంగా హసరంగ కండరాల గాయానికి గురయ్యాడు. ఇప్పటికీ కోలుకోకపోవడంతో లఖ్‌నవూ ఫ్రాంచైజీ అతడిని ఈ సీజన్ వరకు పక్కన పెట్టాలని నిర్ణయించింది. దీంతో హసరంగ స్థానంలో సౌతాఫ్రికా స్టార్ ఆల్‌రౌండర్ జార్జ్ లిండేని ఎల్ఎస్‌జీ ఎంపిక చేసింది. ఐపీఎల్ చరిత్రలోనే లిండేకు ఇది తొలి అవకాశం కావడం విశేషం.
34 ఏళ్ల లిండే అంతర్జాతీయ స్థాయిలో సౌతాఫ్రికా తరఫున 3 టెస్టులు, 4 వన్డేలు, 37 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఐపీఎల్ వేలంలో రూ. కోటి బేస్ ప్రైజ్‌తో ఉన్నప్పటికీ.. అతడిని ఎవరూ కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపలేదు. అయితే ఇప్పుడు ఎల్ఎస్‌జీ జట్టులో చోటు దక్కించుకోవడం లిండేకు పెద్ద అవకాశంగా మారింది. ఫ్రాంచైజీ క్రికెట్‌లో లిండేకు మంచి అనుభవం ఉంది. ఎస్ఏ 20, మేజర్ లీగ్ క్రికెట్‌లో ముంబై ఫ్రాంచైజీ తరఫున లిండే ప్రాతినిధ్యం వహించాడు. మొత్తానికి హసరంగా గైర్హాజరు లఖ్‌నవూ జట్టుకు లోటే అయినా, లిండే అనుభవంతో ఆ లోటును భర్తీ చేయాలని యాజమాన్యం భావిస్తోంది. ఇప్పుడు అతడు ఈ అవకాశాన్ని ఎలా వినియోగించుకుంటాడన్నది ఆసక్తికరంగా మారింది.
ఇదిలా ఉండగా.. లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ జట్టు ఆడిన మూడు మ్యాచుల్లో రెండు గెలిచి పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో కొనసాగుతోంది. తాజాగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎల్ఎస్‌జీ యువ ప్లేయర్ ముకుల్ చౌదరి సంచలన ఇన్నింగ్స్‌తో జట్టుకు విజయాన్ని అందించిన సంగతి తెలిసిందే.
ఇవి కూడా చదవండి:
వాంఖడే స్టేడియంలో భారత దిగ్గజం రవిశాస్త్రి స్టాండ్
నా కొడుకు జీవితం నాశనం చేస్తున్నానని తిట్టారు.. ముకుల్ తండ్రి భావోద్వేగం