Share News

ఇదే నా చివరి ప్రపంచ కప్.. రిటైర్‌మెంట్ కన్ఫామ్ చేసిన కోహ్లీ!

ABN , Publish Date - Sep 26 , 2026 | 03:52 PM

భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన అంతర్జాతీయ కెరీర్ చివరి దశకు చేరిందనే సంకేతాలు ఇచ్చేశాడు. టెస్టు, టీ20 ఫార్మాట్లకు వీడ్కోలు పలికిన కోహ్లీ.. వన్డేల్లోనే కొనసాగుతోన్న సంగతి తెలిసిందే.

ఇదే నా చివరి ప్రపంచ కప్.. రిటైర్‌మెంట్ కన్ఫామ్ చేసిన కోహ్లీ!
Virat Kohli

ఇంటర్నెట్ డెస్క్: భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన అంతర్జాతీయ కెరీర్ చివరి దశకు చేరిందనే సంకేతాలు ఇచ్చేశాడు. టెస్టు, టీ20 ఫార్మాట్లకు వీడ్కోలు పలికిన కోహ్లీ.. వన్డేల్లోనే కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా వేదికలుగా జరగనున్న 2027 వన్డే ప్రపంచ కప్ తన చివరి ఐసీసీ టోర్నీ అని స్పష్టం చేశాడు. ఈసారి ఎలాగైనా కప్ కొట్టడమే తన ప్రధాన లక్ష్యమని వెల్లడించాడు. ఆదివారం వెస్టిండీస్‌తో జరగనున్న తొలి వన్డేకు ముందు కోహ్లీ ఈ కీలక వ్యాఖ్యలు చేశాడు.


‘2027 వన్డే ప్రపంచ కప్.. భారత్ తరఫున నేను ఆడబోయే చివరి ఐసీసీ టోర్నీ ఇదే. మైదానంలో నా శక్తినంతా ధారపోసి ఆడుతా. ఎలాగైనా ఈ ప్రపంచ కప్ గెలిచి తీరాల్సిందే. అందుకోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నా’ అని కోహ్లీ వెల్లడించాడు. 2027 ప్రపంచకప్‌ అక్టోబర్‌, నవంబర్‌ నెలల్లో దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియాలో జరగనుంది. ఇది కోహ్లీకి నాలుగో వన్డే ప్రపంచకప్‌ కానుంది.


ఛాంపియన్స్‌ ట్రోఫీ-2025 తర్వాత వన్డేల్లో కోహ్లీ అద్భుతంగా రాణిస్తున్నాడు. ఇప్పటివరకు 12 వన్డేల్లో 76 సగటుతో 760 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు, ఐదు అర్ధసెంచరీలు ఉన్నాయి. 2025 ఆరంభం నుంచి చూస్తే 64.68 సగటుతో 1,035 పరుగులు చేశాడు. ఇక గత 10 వన్డేల్లో మూడు శతకాలు సహా ఏడు హాఫ్ సెంచరీలు బాదాడు.


ఇవి కూడా చదవండి:

ఆసియా క్రీడలు: క్వార్టర్ ఫైనల్‌లో భారత్ తలపడేది ఆ జట్టుతోనే..!

శుభ్‌మన్ గిల్ సుదీర్ఘకాలం కెప్టెన్‌గా కొనసాగుతాడు: విరాట్ కోహ్లీ

Updated Date - Sep 26 , 2026 | 04:41 PM