Share News

రూ.100 ఇస్తేనే సెల్ఫీ దిగుతా.. చిన్నారులతో వైభవ్ సూర్యవంశీ సరదా ప్రాంక్

ABN , Publish Date - Apr 27 , 2026 | 06:37 PM

ఐపీఎల్ 2026లో వైభవ్ సూర్యవంశీ దూకుడుగా ఆడుతూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ క్రమంలో అతడికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తనతో సెల్ఫీ దిగడానికి వచ్చిన చిన్నారులను ఆటపట్టిస్తూ వైభవ్ ప్రాంక్ చేశాడు.

రూ.100 ఇస్తేనే సెల్ఫీ దిగుతా.. చిన్నారులతో వైభవ్ సూర్యవంశీ సరదా ప్రాంక్
Vaibhav Suryavanshi

ఇంటర్నెట్ డెస్క్: వైభవ్ సూర్యవంశీ.. సంచలన ప్రదర్శనలు చేస్తూ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ఐపీఎల్ 2026లోనూ దూకుడుగా ఆడుతూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తోన్న వైభవ్.. కేవలం 36 బంతుల్లోనే సెంచరీ బాదేశాడు. గతేడాది 14 ఏళ్ల వయసులో.. అరంగేట్రం చేసిన మూడో ఆటలోనే 35 బంతుల్లో శతక్కొట్టి సంచలనం సృష్టించాడు. మైదానంలో బ్యాట్‌తో చెలరేగుతున్న వైభవ్‌కు ఫ్యాన్ ఫాలోయింగ్ తక్కువేం కాదు. చిన్నా పెద్దా తేడా లేకుండా అతడి ఆటకు అందరూ ఫిదా అవుతున్నారు. 15 ఏళ్ల వైభవ్ కూడా గ్రౌండ్‌లో అల్లరి పనులు చేస్తూ సరదాగా ఉంటాడు. ఈ క్రమంలో వైభవ్ సూర్యవంశీకి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తనతో సెల్ఫీ దిగడానికి వచ్చిన చిన్నారులను ఆటపట్టిస్తూ వైభవ్ ప్రాంక్ చేశాడు. ఈ వీడియోను రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది.


మంగళవారం పంజాబ్ కింగ్స్‌తో రాజస్థాన్ రాయల్స్ తలపడనుంది. అందుకోసం ఆర్ఆర్ టీమ్ ఇప్పటికే ఛత్తీస్‌గఢ్ చేరుకుంది. ఈ క్రమంలో ఎయిర్‌పోర్ట్‌లో వైభవ్ సూర్యవంశీని చూసేందుకు చిన్నారులు వచ్చారు. అతడితో సెల్ఫీ దిగడానికి ప్రయత్నించారు. ఇంతలో వైభవ్.. ‘బ్రదర్.. నేను మీకు ఫొటో ఇవ్వాలంటే ఖర్చు అవుతుంది. నేను సీరియస్‌గానే చెబుతున్నా. డబ్బులు ఇస్తేనే ఫొటో దిగుతా’ అని అన్నాడు. దీంతో ఆ చిన్నారులకు ఆశ్చర్యపోయి ఒకరి ముఖం మరొకరు చూసుకున్నారు. అక్కడి నుంచి వెళ్లిపోబోతుండగా.. వారిని ఆపిన వైభవ్ ‘నేను ఒక్కోదానికి రూ.100 తీసుకుంటా. మీ దగ్గర ఎంత ఉందో చెప్పండి’ అని అడిగాడు. అందులోని ఓ పిల్లాడు ‘నా దగ్గర రూ.200 ఉంది’ అని వైభవ్ సూర్యవంశీకి ఇవ్వబోయాడు. వెంటనే నవ్వేసిన వైభవ్.. ఇదంతా ప్రాంక్ అంటూ వారిని ఆటపట్టించాడు. ఆ తర్వాత ఆ పిల్లలతో ఫొటోలు దిగాడు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.


ఇవి కూడా చదవండి:

అతడిని ల్యాబ్‌కు తీసుకెళ్లి పరీక్షించాలి.. వైభవ్‌పై పాక్ క్రికెట్ అనలిస్ట్ ప్రశంసలు

మూడేళ్ల నాటి సెహ్వాగ్‌ సవాల్‌.. బ్యాట్‌తోనే సమాధానం ఇచ్చిన రింకు సింగ్!

Updated Date - Apr 27 , 2026 | 06:38 PM