జట్టు ప్రయోజనాల కోసం వందశాతం కష్టపడతాను: వైభవ్
ABN , Publish Date - Jul 22 , 2026 | 02:07 PM
వరుస బ్యాటింగ్ వైఫల్యాలపై టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ స్పందించాడు. గత నాలుగు నెలల కాలంలో తన కెరీర్‌లో ఎన్నో ఎత్తుపల్లాలు చూశానన్నాడు.
స్పోర్ట్స్ డెస్క్: టీమిండియా యువ సంచలనం ఇటీవల అంతర్జాతీయ టీ20లోకి అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. అయితే వరుసగా మూడు మ్యాచుల్లో తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరాడు. ఈ క్రమంలో అతడిపై కొందరు నెగెటివ్‌గా స్పందించారు. తన బ్యాటింగ్ వైఫల్యాలపై తాజాగా వైభవ్ సూర్యవంశీ స్పందించాడు. గత నాలుగు నెలల కాలంలో తన కెరీర్‌లో ఎన్నో ఎత్తుపల్లాలు చూశానన్నాడు. క్రికెట్‌లో ఇవన్నీ భాగమేనని, జట్టు విజయం కోసం తాను ఎప్పుడూ వందశాతం శ్రమిస్తానని వైభవ్ స్పష్టం చేశాడు.
రేపటి నుంచి జింబాబ్వే, భారత్ మధ్య టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో సంజూ శాంసన్‌ను తప్పించి వైభవ్‌ను ఎంపిక చేసింది మేనేజ్మెంట్. ఈ పరిణామాల నేపథ్యంలో తాజాగా వైభవ్ బీసీసీఐ టీవీతో మాట్లాడాడు. గడిచిన నాలుగు నెలల కాలంలో తాను ఎన్నో ఎత్తుపల్లాలు చూశానని, క్రికెట్‌లో ఇలాంటివి జరుగుతూనే ఉంటాయని తెలిపాడు. తాను ఆటను మెరుగుపరచుకునే ప్రక్రియపై మాత్రమే దృష్టి పెట్టానని, జట్టు కోసం వందకు వంద శాతం శ్రమిస్తానని వైభవ్ పేర్కొన్నాడు. తనకు కోచ్‌లు, ఇతర సిబ్బంది గైడ్ చేస్తున్నారని, ప్రాక్టీస్ సమయంలో తనకేం కావాలో అన్నీ సమకూరుస్తున్నారని అన్నాడు.
జింబాబ్వే పిచ్‌లను ఉద్దేశించి వైభవ్ మాట్లాడుతూ.. 'జింబాబ్వేతో టీ20 సిరీస్ జరిగే హరారే స్పోర్ట్స్ క్లబ్ నా మదిలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఇక్కడే నాలుగు నెలల క్రితం అండర్-19 వరల్డ్‌కప్ ఫైనల్లో మేము గెలిచాం. అప్పుడు యువ జట్టు తరఫున.. ఇప్పుడు టీమిండియా తరఫున ఇదే గ్రౌండ్‌లో ఆడటం గొప్పగా ఉంది. ఈ పిచ్‌లపై నాకు అవగాహన ఉంది. కాబట్టి జట్టు గెలుపులో నా వంతు కృషి చేస్తాను’ అని వైభవ్ సూర్యవంశీ పేర్కొన్నాడు.
ఇవి కూడా చదవండి:
భారత్‌తో టీ20 సిరీస్.. జట్టును ప్రకటించి జింబాబ్వే
అఫ్గానిస్థాన్ వన్డే కెప్టెన్ పదవికి హష్మతుల్లా షాహిది రాజీనామా