Usman Khawaja Retirement: అంతర్జాతీయ క్రికెట్‌కు ఆస్ట్రేలియా క్రికెటర్ గుడ్ బై..
ABN , Publish Date - Jan 02 , 2026 | 11:19 AM
ఆస్ట్రేలియా ఆటగాడు ఉస్మాన్ ఖవాజా అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. యాషెస్‌లో భాగంగా సిడ్నీలో జరిగే టెస్టే తనకు ఆఖరు మ్యాచ్ కానుందని వెల్లడించాడు. ఖవాజా తన కెరీర్‌లో ఇప్పటివరకు 87 టెస్ట్‌లు, 40 వన్డేలు, 9 టీ20లు ఆడాడు.
ఇంటర్నెట్ డెస్క్: అంతర్జాతీయ క్రికెట్‌కు ఆస్ట్రేలియా క్రికెటర్ ఉస్మాన్ ఖవాజా (Usman Khawaja) రిటైర్మెంట్ ప్రకటించాడు. యాషెస్ లో భాగంగా సిడ్నీలో జరిగే టెస్ట్ తనకు ఆఖరు మ్యాచ్ కానుందని ప్రకటించాడు. ఇదే సమయంలో తాను ఎదుర్కొన్న జాతి వివక్ష(Racism in cricket) గురించి పలు విషయాలను వెల్లడించాడు. తాను నల్లజాతి క్రికెటర్‌నని, ఆస్ట్రేలియా తరఫున క్రికెట్ ఆడలేనని చాలా మంది నిరుత్సాపరిచారని తెలిపాడు. కానీ తాను పట్టుదలతో అనుకున్నది సాధించానని, అది తనకు గర్వకారణంగా, ఆనందదాయకంగా ఉందని తెలిపాడు. అయితే జట్టులోని పలువురు సభ్యులు, మీడియా వారు తనతో వివక్షపూరితంగా వ్యవహరించారని ఆవేదన చెందాడు. క్రికెట్‌పై తనకున్న అంకితభావం, నిబద్ధతను శంకించారని, తన సన్నద్ధతను ప్రశ్నించారని ఉస్మాన్ ఖవాజా వాపోయాడు.
ఇక తనకు గాయమైన సందర్భంలో జట్టు సభ్యులు ప్రవర్తించిన తీరుపై కూడా ఖవాజా(Usman Khawaja) స్పందించాడు. 'జట్టులోని ఇతర ప్లేయర్లు గాయపడితే వారికి సానుభూతి దక్కేది. వాళ్లను అయ్యో పాపం అనేవారు. కానీ నేను గాయపడితే మాత్రం నాదే మిస్టేక్ అన్నట్లు చూసేవారు. మా జట్టులోని ఇతర క్రికెటర్లు ముందు రోజు రాత్రి తప్పతాగి గాయపడినా వారిని ఒక్క మాట కూడా అనరు. కానీ నా విషయం మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉండేది. ఈ విషయంలోనే నేను ఎక్కువ బాధను అనుభవించా’ అని ఉస్మాన్ ఖవాజా ఆవేదన వ్యక్తం చేశాడు.
ఉస్మాన్ ఖవాజా కెరీర్:
ఉస్మాన్ ఖవాజా(Usman Khawaja) పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్ లో జన్మించి.. ఆస్ట్రేలియాలకు వలస వెళ్లాడు. అలానే ఆసీస్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన మొదటి ముస్లిం క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. కెరీర్ ప్రారంభంలో జట్టుకు ఎంపిక విషయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. తర్వాత ఓపెనర్‌గా స్థానం పదిలం చేసుకున్నాడు. అలాగే 2023లో ఆస్ట్రేలియా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ గెలిచిన జట్టులో ఖవాజా కీలక పాత్ర పోషించాడు. ప్రస్తుత యాషెస్ సిరీస్ భాగంగా మెల్‌బోర్న్ టెస్ట్‌లో ఖవాజా 82 పరుగులు చేశాడు. ఖవాజా తన కెరీర్‌లో ఇప్పటివరకు 87 టెస్ట్‌లు, 40 వన్డేలు, 9 టీ20లు ఆడాడు. అలానే అంతర్జాతీయ క్రికెట్‌లో 8,001 పరుగులు చేశాడు.
ఇవి కూడ చదవండి:
Palestine Flag Controversy: హెల్మెట్‌పై 'పాలస్తీనా జెండా' ధరించిన కశ్మీర్ క్రికెటర్
Rishabh Pant: 3, 4 తేదీల్లో టీమిండియా ఎంపిక