Share News

AP News: రాగికి జై.. రబీలో పెరిగిన పంట సాగు విస్తీర్ణం

ABN , Publish Date - Jan 02 , 2026 | 11:04 AM

అనంతపురం జిల్లా చిలమత్తూరు ఏరియా రైతులు రాగి పంట సాగుపై మొగ్గు చూపుతున్నారు. మార్కెట్లో రాగులకు గిట్టుబాటు ధర ఆశాజనకంగా ఉండడంతో ఈ ఏరియా రైతులు రాగి పంట సాగుపై మొగ్గుచూపుతున్నారు. ఒక్క చిలమత్తూరు మండలంలోనే 250 హెక్టార్లకుపైగానే సాగవుతున్నట్లు అంచనా.

AP News: రాగికి జై.. రబీలో పెరిగిన పంట సాగు విస్తీర్ణం

- మార్కెట్లో ధాన్యానికి డిమాండ్‌

- ఆదాయం బాగుండటంతో మొగ్గు చూపుతున్న రైతులు

చిలమత్తూరు(అనంతపురం): రబీలో రాగి పంట సాగు వైపు మండల రైతులు మొగ్గు చూపుతున్నారు. అనుకూలమైన వాతావరణం ఉండటం, తక్కువ పెట్టుబడి, డిమాండ్‌, ధర బాగుండటం, నీటి తడుల అవసరం ఎక్కువగా లేకపోవడం తో ఈ పంట సాగుకు రైతులు ఉత్సాహం చూపుతున్నారు. రబీ సీజన్‌లో మండల వ్యాప్తం గా 250 హెక్టార్లకు పైబడి సాగు చేసినట్లు వ్యవసాయాధికారులు పేర్కొన్నారు.


pandu1.2.jpg

పోషక విలువలు ఎన్నో..

రాగులతో చేసిన పదార్థాలను ప్రతి రోజు ఆహారంగా తీసుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు. వంద గ్రాముల రాగుల్లో 340 మిల్లీ గ్రాముల క్యాల్షియం, 328 మిల్లీ గ్రాముల క్యాలరీలు, 3.6 గ్రాముల ఫీచు పదార్థం, 7.3 గ్రాముల ప్రొటీన్‌ లభిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అందుకే ఇటీవల కాలంలో రాగితో తయారైన పదార్థాలకు మార్కెట్‌లో డిమాండ్‌ పెరిగింది. దీంతో రాగులకు గిరాకీ, ధర పెరిగింది. ఈనేపథ్యంలో రైతులు రాగి సాగుకు మొగ్గు చూపుతున్నారు. రాగి ధాన్యానికి ప్రభుత్వం క్వింటాకు రూ.4886ల గిట్టుబాటు ధర కల్పించింది.


ఇతర పంటలతో పోల్చితే అధిక ఆదాయం

మిగిలిన పంటలతో పోల్చితే రాగి పంట సాగుకు పెట్టుబడి తక్కువగా ఉంటుంది. ఈ పంట ఎకరా సాగుకు కేవలం రెండు కిలోల విత్తనాలు సరిపోతాయి. కిలో విత్తనం రూ. 50లకు మంచి ఉండదు. విత్తనాలను నారుమడులుగా పెంచి ఆ తరువాత పొలంలో నాట్లు వేస్తారు. దీంతో కూలీలు కూడా నాట్లు వేసినప్పుడు, కలుపుతీత, పంట కోతలో మాత్రమే అవసరమవుతారు. పురుగుల మందుల ఖర్చు అసలే ఉండదు. నీటి తడులు కూడా అధికంగా అవసరం లేదు. ఎకరానికి 20 నుంచి 25 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది. ప్రస్తుతం మార్కెట్లో రాగులు క్వింటా ధర రూ.4000 నుంచి రూ.5000ల వరకు ఉంది. దీంతో ఎకరానికి సుమారుగా రూ. 80 వేల నుంచి రూ. లక్ష వరకు ఆదాయం వస్తుంది. పెట్టుబడి ఎకరానికి రూ. 15 వేల నుంచి రూ. 20 వేల వరకు వచ్చినా నికర ఆదాయం రూ.60 వేలపైబడి ఉంటుంది. దీంతో ఎక్కువ మంది రైతులు రబీలో రాగి పంట సాగుకు మొగ్గు చూపుతున్నారు.


pandu1.jpg

లాభదాయంకంగా ఉంది: రామిరెడ్డి, రైతు, కోట్లోపల్లి

ఇతర పంటల కంటే రాగి పంట చాలా లాభదాయకంగా ఉంది. నేను ఎకరాలో రాగి పంట సాగు చేశా. గత ఏడాది కూడా రాగి పంట వేశా. ఆ సమయంలో పండిన రాగి ధాన్యాన్ని ఇంటి వద్దకే వచ్చి కొనుగోలు చేశారు. మొక్కజొన్న ఇతర కూరగాయల పంటల సాగులో పెట్టుబడులు ఎక్కువగా ఉంటున్నాయి. కూలీల ఖర్చు కూడా ఎక్కువే. రాగులకు డిమాండ్‌ బాగుంది. రాగులు పండించగానే వెతుక్కొని వచ్చి తీసుకెళుతున్నారు. మార్కెటింగ్‌ సమస్యలేదు. పశువులకు రాగి గడ్డి మంచి పోషకాహారం కావడంతో దాన్ని కూడా పాడిరైతులు అధిక ధర పెట్టి కొనుగోలు చేస్తున్నారు. దీంతో రాగిగడ్డితోనే సగం పెట్టుబడి వచ్చేస్తోంది.


పురుగు మందుల అవసరం లేదు

- కవితారాణి, ఏఓ, చిలమత్తూరు

తక్కువ పెట్టుబడితో సాగు చేసుకొని ఎక్కువ ఆదాయాన్ని రాగి పంట ద్వారా పొందవచ్చు. ఈ పంటను ఖరీఫ్‌, రబీలో సీజన్లలో సాగు చేసుకోవచ్చు. పురుగు మందులు వాడాల్సిన అవసరం ఉండదు. తక్కువ నీటి తడులతో పంట పూర్తి అవుతుంది. సాధారణ నేలల్లో సైతం ఈ పంట బాగా పండుతుంది. ఈ పంటకు మార్కెట్లో మంచి ధర, డిమాండ్‌ ఉంది.


ఈ వార్తలు కూడా చదవండి..

గాలి జనార్దన్‌రెడ్డిపై హత్యాయత్నం

మరో 3.5 కిలోల బంగారం రికవరీ

Read Latest Telangana News and National News

Updated Date - Jan 02 , 2026 | 11:04 AM