Gold Recovery: మరో 3.5 కిలోల బంగారం రికవరీ
ABN , Publish Date - Jan 02 , 2026 | 05:43 AM
రాష్ట్రంలో సంచలనం రేకెత్తించిన శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం మండలం తూమకుంట (పారిశ్రామికవాడ) స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖ చోరీ కేసుకు సంబంధించి...
తూమకుంట ఎస్‌బీఐ చోరీ కేసులో పురోగతి
హిందూపురం, జనవరి 1(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో సంచలనం రేకెత్తించిన శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం మండలం తూమకుంట (పారిశ్రామికవాడ) స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖ చోరీ కేసుకు సంబంధించి మరో 3.5 కిలోల బంగారం ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఇదివరకే పోలీసులు 2 కిలోల బంగారం రికవరీ చేశారు. దీంతో మొత్తం 5.5 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నట్లయింది. ఇందుకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ సతీష్ కుమర్ గురువారం హిందూపురం అప్‌గ్రేడ్ పోలీసు స్టేషన్‌లో వెల్లడించారు. గతేడాది జూలై 27న తూమకుంట ఎస్‌బీఐ శాఖకు దుండగులు కన్నం వేసి, ఖాతాదారుల లాకర్లలోని 11.2 కిలోల బంగారం, రూ.40 లక్షల నగదు ఎత్తుకెళ్లారు. సెలవుల అనంతరం రెండ్రోజులకు గుర్తించిన బ్యాంకు అధికారులు.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీనిపై అప్పట్లో కేసు నమోదుచేసి, దర్యాప్తు చేపట్టారు. హరియాణ రాష్ట్రం గుర్గావ్ జిల్లా మారుతికుంజ్ గ్రామానికి చెందిన అనిల్‌కుమార్ పన్వార్, రాజస్థాన్‌కు చెందిన మహ్మద్ ఇస్రార్ ఖాన్ చోరీకి పాల్పడినట్లు తేల్చారు. అనిల్‌కుమార్ పన్వార్‌ను ఆగస్టులో అరెస్టు చేసి, అతడి నుంచి 2 కిలోల బంగారం, నేరానికి ఉపయోగించిన బైక్‌ను సీజ్ చేశారు. రాజస్థాన్‌కు చెందిన మహ్మద్ ఇస్రార్‌ఖాన్ రాజస్థాన్ జైలులో ఉండగా కస్టడీలోకి తీసుకుని, విచారించారు. అతడి స్వగ్రామమైన రాజస్థాన్ రాష్ట్రం కరోలి జిల్లా సలంపూర్ వద్ద పొలాల్లో దాచి ఉంచిన బంగారం ఆభరణాలు, కరిగించి కడ్డీలు చేసిన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన బంగారాన్ని కూడా రికవరీ చేస్తామని డీఎస్పీ మహేష్, సీఐ ఆంజనేయులు తెలిపారు.