Minister Gali Janardhan Reddy: గాలి జనార్దన్‌రెడ్డిపై హత్యాయత్నం
ABN , Publish Date - Jan 02 , 2026 | 05:47 AM
కర్ణాటక మాజీ మంత్రి, గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దన్‌రెడ్డిపై హత్యాయత్నం జరిగింది. గురువారం రాత్రి బళ్లారిలో హవంబావి ప్రాంతంలోని ఆయన ఇంటి వద్దే బళ్లారి నగర ఎమ్మెల్యే భరత్‌రెడ్డి సన్నిహితుడు....
బళ్లారిలో ఎమ్మెల్యే భరత్‌రెడ్డి సన్నిహితుడి కాల్పులు
గన్‌మన్ తుపాకీ లాక్కుని 2 రౌండ్లు కాల్చిన సతీశ్‌రెడ్డి
తప్పించుకున్న మాజీ మంత్రి
ఇరు వర్గాల పరస్పర కాల్పులు
ఒకరి మృతి.. సతీశ్‌కు గాయాలు
బళ్లారి, జనవరి 1(ఆంధ్రజ్యోతి): కర్ణాటక మాజీ మంత్రి, గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దన్‌రెడ్డిపై హత్యాయత్నం జరిగింది. గురువారం రాత్రి బళ్లారిలో హవంబావి ప్రాంతంలోని ఆయన ఇంటి వద్దే బళ్లారి నగర ఎమ్మెల్యే భరత్‌రెడ్డి సన్నిహితుడు సతీశ్‌రెడ్డి కాల్పులు జరిపాడు. అయితే జనార్దన్‌రెడ్డి తప్పించుకున్నారు. ఈ ఘటనతో బళ్లారిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గాలి జనార్దన్‌రెడ్డి, బళ్లారి రూరల్ పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బళ్లారిలోని ఎస్పీ సర్కిల్‌లో మహర్షి వాల్మీకి విగ్రహాన్ని ఈనెల 3న ఏర్పాటు చేయనున్నారు. నగరవ్యాప్తంగా ఫ్లెక్సీలు కడుతున్నారు. ఈ క్రమంలోనే గురువారం సాయంత్రం హవ్వబావి ప్రాంతంలోని జనార్దన్‌రెడ్డి ఇంటి ప్రహరీకి కూడా సతీశ్‌రెడ్డి దగ్గరుండి ఫ్లెక్సీలు కట్టిస్తున్నాడు. జనార్దన్‌రెడ్డి అనుచరులు అడ్డుచెప్పారు. ప్రహరీకి వద్దని, బయట కట్టుకోవాలని సూచించారు. సతీశ్‌రెడ్డి వినకుండా కుర్చీ తెప్పించుకుని జనార్దన్‌రెడ్డి ఇంటి ముందు కాలుమీద కాలు వేసుకుని కూర్చుని.. ‘ఇక్కడే ఫ్లెక్సీ కడతాను’ అని పట్టుబట్టాడు. దీంతో ఇరువర్గాల మధ్య గొడవ మొదలైంది. అదే సమయంలో గంగావతి నుంచి జనార్దన్‌రెడ్డి బళ్లారి ఇంటికి వచ్చారు. ఆయన్ను చూసి సతీశ్‌రెడ్డి తన అనుచరులను రెచ్చగొట్టాడు. ఫ్లెక్సీ కట్టేందుకు యత్నించడంతో జనార్దన్‌రెడ్డి అనుచరులు, సతీశ్‌రెడ్డి మధ్య తోపులాట జరిగింది. ఈ సందర్భంగా పరస్పరం రాళ్ల దాడి చేసుకోవడంతో కొందరికి గాయాలయ్యాయి. గుంపును చెదరగొట్టేందుకు ఇద్దరి గన్‌మెన్ గాలిలోకి కాల్పులు జరిపారు. సతీశ్‌రెడ్డి ఓ గన్‌మన్ వద్ద తుపాకీ లాక్కుని.. జనార్దన్‌రెడ్డి వైపు రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు. అయితే ఆయన తప్పించుకున్నారు. ఇదే సమయంలో ఇరువర్గాలూ కాల్పులకు దిగాయి. ఓ బుల్లెట్ తగిలి భరత్‌రెడ్డి వర్గానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త రాజశేఖర్ మరణించాడు. సతీశ్‌రెడ్డికి కూడా బుల్లెట్ గాయమైంది. అతడి పరిస్థితి విషమంగా ఉండడంతో వెంటనే బెంగళూరుకు తరలించారు. విషయం తెలుసుకున్న గాలి సన్నిహితుడు, మాజీ మంత్రి శ్రీరాములు, కంప్లి ఎమ్మెల్యే సురేశ్‌బాబు, గాలి సోమశేఖర్‌రెడ్డి, వారి అనుచరులు అక్కడకు చేరుకున్నారు. అయితే ఇరు వర్గాలనూ పోలీసులు చెదరగొట్టారు. గొడవ జరిగినపుడు ఎమ్మెల్యే భరత్‌రెడ్డి ఊరిలో లేరు. గొడవ గురించి తెలుసుకుని బళ్లారి వచ్చారు. అనుచరులతో ఎస్పీ సర్కిల్‌కు చేరుకున్నారు. తీవ్ర ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులు పెద్దఎత్తున రంగంలోకి దిగారు. పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.
చిల్లర రౌడీలకు భయపడేది లేదు: జనార్దన్‌రెడ్డి
ఎమ్మెల్యే భరత్‌రెడ్డి, అతడి నాన్న సూర్యనారాయణరెడ్డి, సతీశ్‌రెడ్డి లాంటి చిల్లర రౌడీలకు భయపడేది లేదనీ, ఇలాంటి వాళ్లను ఎంతోమందిని చూశానని గాలి జనార్దన్‌రెడ్డి అన్నారు. తనపై కాల్పులు జరపగా.. పక్కనే పడిపోయిన బుల్లెట్‌ను ఆయన మీడియాకు చూపారు. వాల్మీకి విగ్రహం ఏర్పాటు పేరుతో భరత్‌రెడ్డి అనవసర రాద్దాంతం చేస్తున్నాడన్నారు. బళ్లారిలో విచ్చలవిడిగా మట్కా, పేకాట. గంజాయి విక్రయాలు, రౌడీయిజం నడిపిస్తున్నాడని.. ఎమ్మెల్యే వేధింపులు భరించలేక పలువురు పోలీసులు బదిలీ చేయించుకుని వెళ్లిపోయారని చెప్పారు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమేనన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో బీజేపీ నాయకులను.. ముఖ్యంగా తనను టార్గెట్ చేసి, హత్య చేయించాలని కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు.