Share News

ఇషాన్‌ విధ్వంసం

ABN , Publish Date - Sep 08 , 2026 | 01:35 AM

సౌత్‌ జోన్‌తో జరుగుతున్న దులీప్‌ ట్రోఫీ ఫైనల్లో ఈస్ట్‌ జోన్‌ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. డాషింగ్‌ బ్యాటర్‌, కెప్టెన్‌ ఇషాన్‌ కిషన్‌ (334 బంతుల్లో 30 ఫోర్లు, 7 సిక్సర్లతో 270) సుదీర్ఘ ఫార్మాట్‌లోనూ సత్తా చూపగలనని నిరూపిస్తూ ఏకంగా ద్విశతకంతో ఆకట్టుకున్నాడు.

ఇషాన్‌ విధ్వంసం

  • కుషాగ్ర శతకం

  • ఈస్ట్‌ జోన్‌ తొలి ఇన్నింగ్స్‌ 708

  • సౌత్‌తో దులీప్‌ ట్రోఫీ ఫైనల్‌

చెన్నై: సౌత్‌ జోన్‌తో జరుగుతున్న దులీప్‌ ట్రోఫీ ఫైనల్లో ఈస్ట్‌ జోన్‌ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. డాషింగ్‌ బ్యాటర్‌, కెప్టెన్‌ ఇషాన్‌ కిషన్‌ (334 బంతుల్లో 30 ఫోర్లు, 7 సిక్సర్లతో 270) సుదీర్ఘ ఫార్మాట్‌లోనూ సత్తా చూపగలనని నిరూపిస్తూ ఏకంగా ద్విశతకంతో ఆకట్టుకున్నాడు. అలాగే కుమార్‌ కుషాగ్ర (132 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్సర్లతో 101) సైతం సెంచరీతో నిలువగా.. ఈస్ట్‌ జోన్‌ తొలి ఇన్నింగ్స్‌లో 708 పరుగుల భారీ స్కోరు దగ్గర ఆలౌటైంది. అనుకుల్‌ రాయ్‌ (45), ఖురేషి (40), షమి (28) చివర్లో విలువైన రన్స్‌ జత చేశారు. స్పిన్నర్‌ త్రిపురాన విజయ్‌కు నాలుగు.. మిలింద్‌, శ్రేయాస్‌ గోపాల్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. మూడో రోజు మంగళవారం సౌత్‌ జోన్‌ తొలి ఇన్నింగ్స్‌ను ఆరంభించనుంది.


నొప్పిని భరిస్తూనే..

ఓవర్‌నైట్‌ స్కోరు 385/4తో రెండో రోజైన సోమవారం ఆటను ప్రారంభించిన ఈస్ట్‌ జోన్‌ ఇన్నింగ్స్‌లో ఇషాన్‌ బ్యాటింగే హైలైట్‌. ముగ్గురు జాతీయ సెలెక్టర్లు మ్యాచ్‌ను తిలకిస్తుండగా.. తనలోని అసాధారణ ఆటను వెలికితీశాడు. దాదాపు రెండు రోజుల పాటు క్రీజులో ఉన్న ఇషాన్‌ 522 నిమిషాల తన బ్యాటింగ్‌లో 334 బంతులు ఎదుర్కొన్నాడు. ఇదిలావుండగా ఇషాన్‌ 128 పరుగుల వద్ద ఉన్నప్పుడు మిలింద్‌ వేసిన బంతి అతడి పొత్తి కడుపునకు బలంగా తాకింది. ఫిజియో విశ్రాంతి తీసుకోమని సూచించినా అతను మాత్రం బ్యాటింగ్‌కే మొగ్గు చూపాడు. ఆ తర్వాత ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో తన రెండో డబుల్‌ సాధించడమే కాకుండా మరో 31 బంతుల్లోనే 250 పరుగుల మార్క్‌కు చేరాడు. అటు కుమార్‌ కుషాగ్ర సైతం బౌలర్లను దీటుగా ఎదుర్కొని శతకం పూర్తి చేశాడు. వీరిద్దరి మధ్య ఐదో వికెట్‌కు 230 పరుగులు సమకూరడం విశేషం. ఆ తర్వాత అనుకుల్‌తో కలిసి ఇషాన్‌ ఆరో వికెట్‌కు మరో 140 రన్స్‌ జత చేశాడు. అయితే ఇషాన్‌ 250 పరుగులు చేశాక నొప్పి తిరగబెట్టడంతో రెండో సెషన్‌ చివర్లో రిటైర్డ్‌ హర్ట్‌ అయ్యాడు. మళ్లీ ఏడో వికెట్‌ కోల్పోయాక తిరిగి బరిలోకి దిగి అదనంగా 20 రన్స్‌ జోడించి వెనుదిరిగాడు. మొత్తంగా స్పిన్నర్లను లక్ష్యంగా చేసు కున్న ఇషాన్‌.. శ్రేయాస్‌, త్రిపురాన ఓవర్లలోనే 164 రన్స్‌ రాబట్టాడు.

సంక్షిప్త స్కోర్లు: ఈస్ట్‌ జోన్‌ తొలి ఇన్నింగ్స్‌: 163 ఓవర్లలో 708 ఆలౌట్‌ (ఇషాన్‌ 270, కుషాగ్ర 101, శిఖర్‌ 85, అభిమన్యు 72; త్రిపురాన 4/180, మిలింద్‌ 2/88, శ్రేయాస్‌ 2/165).

ఈ వార్తలనూ చదవండి

55 పరుగులకే ఆలౌట్.. అయినా ఆసియా కప్ మాదే: పాకిస్థాన్ కోచ్

కౌంటీలో చెలరేగిన సాయి కిశోర్.. టీమిండియా సెలెక్టర్లకు గట్టి సవాల్!

Updated Date - Sep 08 , 2026 | 01:35 AM