టీ20 ప్రపంచ కప్: చావో రేవో! రసవత్తరంగా మారనున్న సూపర్ 8
ABN , Publish Date - Feb 20 , 2026 | 12:14 PM
టీ20 ప్రపంచ కప్ 2026.. గ్రూప్ స్టేజి దాదాపు ముగింపు దశకు చేరుకుంది. ఎనిమిది జట్లు సూపర్ 8కి చేరుకున్నాయి. దీంట్లో భారత్, సౌతాఫ్రికా, వెస్టిండీస్, జింబాబ్వే జట్లు గ్రూప్ 1లో ఉన్నాయి. మరోవైపు గ్రూప్ 2లో పాకిస్థాన్, ఇంగ్లాండ్, శ్రీలంక, న్యూజిలాండ్ జట్లు ఉన్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ 2026.. గ్రూప్ స్టేజి దాదాపు ముగింపు దశకు చేరుకుంది. ఎనిమిది జట్లు సూపర్ 8కి చేరుకున్నాయి. అయితే ప్రస్తుతం చర్చంతా.. పసికూన జింబాబ్వే మీదే! ఎందుకంటారా.. ఆస్ట్రేలియా, శ్రీలంక జట్లున్న గ్రూప్‌లో జింబాబ్వే జట్టు అగ్రస్థానంలో నిలుస్తుందని ఎవరైనా అనుకుని ఉంటారా? ఈ జట్టు ధాటికి బలమైన ఆస్ట్రేలియా ప్రపంచ కప్ టోర్నీ నుంచే నిష్క్రమిస్తుందని ఎవరైనా ఊహించి ఉంటారా? అనూహ్యంగా అసాధారణమైన ప్రదర్శనతో అజేయంగా నిలిచిన జింబాబ్వే.. గ్రూప్ బిలో ‘టాప్’ లేపింది. ఆసీస్‌పై విజయం అదృష్టం కాదని నిరూపిస్తూ.. ఆఖరి లీగ్ మ్యాచ్‌లో శ్రీలంకనూ చిత్తు చేసింది.
అయితే సూపర్ 8లో భాగంగా భారత్, సౌతాఫ్రికా, వెస్టిండీస్, జింబాబ్వే జట్లు గ్రూప్ 1లో ఉన్నాయి. భారత్, సఫారీలు మాత్రమే హాట్ ఫేవరెట్లు కాదని.. వెస్టిండీస్, జింబాబ్వే కూడా గట్టి పోటీనివ్వనున్నాయని క్రికెట్ విశ్లేషకుల అభిప్రాయం. దీనికి ఓ కారణం లేకపోలేదు.. లీగ్ స్టేజిలో ఈ నాలుగు జట్లు ఒక్క ఓటమిని కూడా చవి చూడలేదు. దీంతో సూపర్ 8లో గ్రూప్ 1.. ప్రతి మ్యాచ్ సెమీ ఫైనల్ పోరులా రసవత్తరంగా మారనుంది.
సఫారీలు ప్రతీకారం తీర్చుకుంటారా?
ఫామ్ పరంగా చూస్తే భారత్, దక్షిణాఫ్రికా జట్లు సెమీస్‌కు ఫేవరెట్లు. ఎప్పుడైనా సరే.. సౌతాఫ్రికా జట్టు చాలా ప్రమాదకరం. ఆఖరి బంతి వరకు గెలుపు కోసం పోరాడటం వారి నైజం. దానికి టీ20 ప్రపంచ కప్ 2024 ప్రత్యక్ష ఉదాహరణ. ఫైనల్‌లో ఓడినప్పటికీ గట్టి పోటీనిచ్చి భారత్‌ను భయపెట్టిందనడంలో సందేహం లేదు. నాటి ఓటమికి టీమిండియాపై సఫారీలు ఇప్పుడు ప్రతీకారం తీర్చుకుంటారా? అనేది చూడాల్సి ఉంది. అలాగే వెస్టిండీస్‌ను ఏమాత్రం తక్కువగా అంచనా వేయలేం. 2016లో భారత్ వేదికగా జరిగిన టోర్నీలో టైటిల్ గెలిచిన జట్టు అదే. అంచనాలు లేకుండా బరిలోకి దిగి అసాధారణమైన ప్రదర్శన కనబర్చగల ప్లేయర్లు ఈ కరేబియన్ జట్టు సొంతం.
గ్రూప్ 2 తేలికగా కనిపించినా..
మరోవైపు గ్రూప్ 2లో పాకిస్థాన్, ఇంగ్లాండ్, శ్రీలంక, న్యూజిలాండ్ జట్లు ఉన్నాయి. ఈ గ్రూప్‌లోని ప్రతి జట్టు గ్రూప్ దశలో ఒక మ్యాచ్ ఓడింది. ఇంగ్లాండ్ వెస్టిండీస్ చేతిలో, న్యూజిలాండ్ దక్షిణాఫ్రికా చేతిలో, పాకిస్థాన్ భారత్ చేతిలో పరాజయం పాలయ్యాయి. శ్రీలంక మాత్రం బలమైన ఆసీస్‌ను ఓడించి.. పసికూన జింబాబ్వే చేతిలో ఓడటం గమనార్హం. కాగా సూపర్ 8లో ప్రతి మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగే సూచనలు కనిపిస్తున్నాయి. జింబాబ్వే అండర్ డాగ్ కథ ఇక్కడితో ఆగుతుందా? లేక మరో సంచలనానికి నాంది పలుకుతుందా? అన్నది చూడాలి.
ఇవి కూడా చదవండి:
అంతర్జాతీయ క్రికెట్‌కు స్టార్ క్రికెటర్ గుడ్ బై
మాతో మ్యాచ్‌ను భారత్ సీరియస్‌గా తీసుకోవట్లేదు: పాక్ మాజీ పేసర్