Share News

టీ20 ప్రపంచ కప్ 2026: వర్షం ముప్పు.. భారత్-పాక్ మ్యాచ్ రద్దైతే..?

ABN , Publish Date - Feb 14 , 2026 | 03:58 PM

టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా భారత్-పాకిస్థాన్ జట్లు కొలంబోలోని ప్రేమదాస స్టేడియం వేదికగా ఆదివారం తలపడనున్నాయి. అయితే ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉందని వార్తలు వస్తున్నాయి. అదే జరిగి ఈ మ్యాచ్ రద్దైతే పరిస్థితి ఏంటనే దానిపై ఆసక్తి నెలకొంది.

టీ20 ప్రపంచ కప్ 2026: వర్షం ముప్పు.. భారత్-పాక్ మ్యాచ్ రద్దైతే..?
India vs Pakistan

ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా భారత్-పాకిస్థాన్ జట్లు కొలంబోలోని ప్రేమదాస స్టేడియం వేదికగా ఆదివారం తలపడనున్నాయి. వరుస విజయాలతో జోరు మీదున్న టీమిండియా.. పాక్‌పై గెలిచి గెలుపు జోరును కొనసాగించాలని చూస్తోంది. ఈ మ్యాచ్ కోసం దేశమంతా ఎదురుచూస్తోంది. అవకాశం దొరికినప్పుడల్లా పాక్‌పై పగ తీర్చుకోవాలనుకుంటారు భారత అభిమానులు. మైదానంలో భారత బ్యాటర్లు చెలరేగితే.. తామే కత్తి పట్టి యుద్ధం చేసినట్టుగా ఫీలవుతుంటారు. అలాంటి రసవత్తర పోరుకు సమయం దగ్గర పడింది.


అయితే రేపు జరగనున్న భారత్-పాక్ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉందని వార్తలు వస్తున్నాయి. అదే జరిగి ఈ మ్యాచ్ రద్దైతే పరిస్థితి ఏంటనే దానిపై ఆసక్తి నెలకొంది. రిజర్వ్ డే లేనందున మ్యాచ్ జరగకపోతే మరో రోజు ఈ మ్యాచ్ నిర్వహించే పరిస్థితి లేదు. దీంతో వర్షం పడకుండా ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు.


నేరుగా సూపర్ 8కు..

ఒకవేళ వర్షం కారణంగా ఈ మ్యాచ్ రద్దు అయితే భారత్, పాకిస్థాన్‌లకు చెరొక పాయింట్ దక్కుతుంది. ఇప్పటికే ఇరు జట్లు చెరో రెండు మ్యాచ్‌లు గెలిచి నాలుగు పాయింట్లతో ఉన్నాయి. అప్పుడు భారత్, పాక్ ఖాతాల్లోకి 5 పాయింట్లు చేరుతాయి. ఇరు జట్లు నేరుగా సూపర్ 8కి క్వాలిఫై అవుతాయి. గ్రూప్ ఏలోని మిగతా జట్లు యూఎస్ఏ, నెదర్లాండ్స్ మూడు మ్యాచ్‌లు ఆడి ఓ మ్యాచ్‌లో గెలిచాయి. దీంతో వాటి ఖాతాలో తలో రెండు పాయింట్లు ఉన్నాయి. నమీబియా రెండు మ్యాచుల్లోనూ ఓడి సున్నా పాయింట్లతో ఉంది.


ఒకవేళ వర్షం వల్ల మ్యాచ్ ఆగిపోయే పరిస్థితే వస్తే.. శ్రీలంక క్రికెట్ బోర్డుకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. టికెట్ల రూపంలో వచ్చే ఆదాయాన్ని కూడా బోర్డు కోల్పోనుంది. ఇప్పటి వరకు మ్యాచే ఆడనని మొండిపట్టు పట్టిన పాక్.. ఎట్టకేలకు ఆడేందుకు ఒప్పుకుందని ఆనందపడేలోపే వరుణుడి రూపంలో మరో ప్రమాదం పొంచి ఉంది. ఈ మ్యాచ్ వర్షార్పణం కాకుండా సాఫీగా జరగాలని అభిమానులు కోరుకుంటున్నారు.


ఇవి కూడా చదవండి:

భారత్-పాక్ హైవోల్టేజ్ మ్యాచ్.. టీమిండియాదే విజయం: భజ్జీ

గర్ల్‌ఫ్రెండ్‌తో హోటల్ లాబీలో హార్దిక్ పాండ్య.. వీడియో వైరల్

Updated Date - Feb 14 , 2026 | 05:08 PM