Share News

సన్‌రైజర్స్‌లోకి పాక్ క్రికెటర్.. క్లారిటీ ఇచ్చిన యాజమాన్యం

ABN , Publish Date - Mar 13 , 2026 | 09:44 AM

ది హండ్రెడ్ లీగ్ కోసం ఐపీఎల్ ఫ్రాంచైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్.. పాక్ క్రికెటర్‌ను తీసుకోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. దీనిపై ఎస్ఆర్‌హెచ్ యాజమాన్యం క్లారిటీ ఇచ్చింది.

సన్‌రైజర్స్‌లోకి పాక్ క్రికెటర్.. క్లారిటీ ఇచ్చిన యాజమాన్యం
SRH Coach Reveals Inside Details On Bid For Pak Cricketer

ఇంటర్నెట్ డెస్క్: ఇంగ్లండ్‌లో జరిగే 'ది హండ్రెడ్' లీగ్‌లో భారత యాజమాన్యానికి చెందిన జట్టు 'సన్ రైజర్స్ లీడ్స్' పాకిస్థాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్‌ను వేలంలో కొనుగోలు చేయడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోన్న సంగతి తెలిసిందే. వేలంలో అతణ్ని రూ.2.34 కోట్లు వెచ్చించి జట్టులోకి తీసుకోవడంతో సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. ఈ నేపథ్యంలో అతణ్ని జట్టులోకి తీసుకోవడానికి గల అసలు కారణాన్ని వెల్లడించింది సన్‌రైజర్స్ యాజమాన్యం.


ఈ విషయమై ఎస్ఆర్‌హెచ్ హెడ్‌కోచ్ డానియెల్ వెటోరీ మాట్లాడుతూ.. 'అబ్రార్ అహ్మద్.. వైవిధ్యమైన స్పిన్నర్. చాలామంది, ముఖ్యంగా దేశీయ ఆటగాళ్లు ఇంతకముందు అతడి బౌలింగ్‌ను చూసిఉండరు. పాక్ ఆటగాళ్ల చుట్టూ తిరుగుతున్న ఊహాగానాల గురించి తెలుసు. కానీ వారిని వేలంలోకి తీసుకోకుండా ఉండేందుకు మాకు ఎలాంటి నిర్దిష్ట సూచనలు అందలేదు. అంతర్జాతీయ జట్ల నుంచి చాలామంది క్రికెటర్లు వేలంలోకి వచ్చారు. అయితే.. మా ప్రాధాన్యం దృష్ట్యా మేము ప్రభావవంతంగా స్పిన్ బౌలింగ్ చేయగలిగే అబ్రార్‌ను తీసుకున్నాం' అని న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ స్పష్టతనిచ్చాడు.


దీంతో భారత యాజమాన్యంలోని ఫ్రాంచైజీతో ఒప్పందం కుదుర్చుకున్న తొలి పాక్ ఆటగాడిగా అబ్రార్ నిలిచాడు. లండన్‌లో జరిగిన బిడ్డింగ్‌లో 190,000 పౌండ్లు(భారత కరెన్సీలో సుమారు రూ.2.34 కోట్లు) వెచ్చించి ఈ మిస్టరీ స్పిన్నర్‌ను సన్‌రైజర్స్ లీడ్స్ సొంతం చేసుకుంది. ఈ వేలం ప్రక్రియలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సహ యజమాని కావ్య మారన్ పాల్గొన్నారు. పాక్ క్రికెటర్‌ను కొనుగోలు చేయడమంటే దేశ భావాలను పట్టించుకోకపోవడమేనని దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కావ్య మారన్‌పైనా అభిమానులు మండిపడ్డారు.


అయితే.. జాతీయత ఆధారంగా ఆటగాళ్లను తప్పించడం చట్ట విరుద్ధమని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు(ECB) ముందుగానే హెచ్చరించినట్లు తెలుస్తోంది. దీంతో భారత మేనేజ్‌మెంట్‌లోని సన్ రైజర్స్ లీడ్స్, ఎంఐ లండన్, మాంచెస్టర్ సూపర్ జెయింట్స్, సౌత్ రన్ బ్రేవ్ టీమ్‌లు పాక్ ఆటగాళ్లను తీసుకోకూడదనే అనధికార నియమాన్ని కొనసాగించలేకపోయాయని విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా.. ఇంత వివాదం మధ్యలోనూ అబ్రార్ ఎంపికను సమర్థిస్తున్నారు పలువురు క్రికెట్ నిపుణులు. అబ్రార్.. ప్రస్తుతం ప్రపంచంలో అత్యుత్తమ స్పిన్నర్లలో ఒకడిగా గుర్తింపు పొందాడు. గత 38 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లలో 52 వికెట్లు తీసి అద్భుత ప్రదర్శన చేశాడు.


ఇవీ చదవండి:

‘క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌’ గిల్‌

బాహుబలితో ఉత్తేజితులయ్యాం

Updated Date - Mar 13 , 2026 | 09:44 AM