Share News

ఐర్లాండ్ సిరీస్‌లో వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఇవ్వాల్సింది: గావస్కర్

ABN , Publish Date - Jun 29 , 2026 | 11:22 AM

భారత క్రికెట్ జట్టుకు పసికూన ఐర్లాండ్ షాకిచ్చిన సంగతి తెలిసిందే. రెండు టీ20ల సిరీస్‌ను 2-0తో ఐర్లాండ్ క్లీన్‌స్వీప్ చేసింది. దీనిపై టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ స్పందించాడు. వైభవ్ సూర్యవంశీని ఆడించాల్సిందని వెల్లడించాడు.

ఐర్లాండ్ సిరీస్‌లో వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఇవ్వాల్సింది: గావస్కర్
Sunil Gavaskar

ఇంటర్నెట్ డెస్క్: భారత క్రికెట్ జట్టుకు పసికూన ఐర్లాండ్ షాకిచ్చిన సంగతి తెలిసిందే. రెండు టీ20ల సిరీస్‌ను 2-0తో ఐర్లాండ్ క్లీన్‌స్వీప్ చేసింది. అయితే అద్భుత ప్రదర్శనలతో సీనియర్ జట్టులో చోటు సంపాదించుకున్న యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి ఈ సిరీస్‌లో ఆడే అవకాశం రాలేదు. కాగా సీనియర్ ప్లేయర్లు పూర్తిగా విఫలమవ్వడంతో.. వైభవ్‌కు అవకాశం ఇచ్చి ఉండాల్సిందంటూ నెట్టింట చర్చ మొదలైంది. ఇదే విషయంపై టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ స్పందించాడు. వైభవ్ ఐర్లాండ్‌పై అరంగేట్రం చేసి ఉంటే బాగుండేదని వెల్లడించాడు.


‘వైభవ్ సూర్యవంశీకి ఐర్లాండ్ సిరీస్‌లోనే అవకాశం ఇవ్వాలని నేను భావించాను. ఈ రెండు మ్యాచుల్లో అతడిని ఆడించి ఉంటే అంతర్జాతీయ క్రికెట్‌కు మంచి ఆరంభం అయ్యేది. రాబోయే కఠిన సిరీస్‌లకు ముందు ఇది సరైన వేదిక అయ్యేది. వైభవ్ ఎప్పటికైనా భారత జట్టులో ఆడాల్సిందే. అందుకోసం ఎక్కువ కాలం ఎదురుచూస్తూ ఉండటం సరైంది కాదు. టీమ్ మేనేజ్‌మెంట్ అతడి గురించి ఆలోచించాలి. అభిషేక్ శర్మ లేదా సంజు శాంసన్‌తో కలిసి వైభవ్‌ను ఓపెనింగ్‌కు దింపాలి. అతడు పూర్తిగా పక్కన పెట్టే ప్లేయర్ కాదు. ఐర్లాండ్‌తో కాకపోతే ఇంగ్లండ్‌తో సిరీస్‌లో అయినా వైభవ్‌ను అవకాశం రావాలి’ అని గావస్కర్ వెల్లడించాడు.


భారత్‌పై ఐర్లాండ్ 2-0తో సిరీస్ కైవసం చేసుకుంది. తొలి టీ20లో 34 పరుగులతో ఓడిన భారత్.. రెండో మ్యాచ్‌లో కేవలం ఒక్క పరుగు తేడాతో ఓటిమి పాలైంది. స్టార్ బ్యాటర్లంతా తీవ్రంగా విఫలమయ్యారు. కాగా రెండో టీ20లో అరంగేట్రం చేసిన ప్రిన్స్ యాదవ్ 3 వికెట్లతో రాణించాడు. బ్యాటింగ్‌లో ఆఖరి బంతికి సిక్సర్ బాదినా జట్టును గెలిపించలేకపోయాడు. ఐర్లాండ్ బౌలర్ జై మూన్‌డ్రా, హోల్డర్ చెరో మూడు వికెట్లు తీసి భారత్ ఓటమిని శాసించారు. కాగా టీమిండియా జులై 1 నుంచి ఇంగ్లండ్‌తో సిరీస్‌లో తలపడనుంది.


ఇవి కూడా చదవండి:

మరో విషాదం.. షూటింగ్ దిగ్గజం జస్పాల్ రాణా తల్లి మృతి

ఐర్లాండ్‌తో ఘోర ఓటమి.. హెడ్ కోచ్ గంభీర్‌పై విమర్శలు

Updated Date - Jun 29 , 2026 | 11:22 AM