Share News

వైభవ్ బ్యాటింగ్‌కు ఇంగ్లండ్ సర్‌ప్రైజ్ అవుతుంది: సునీల్ గావస్కర్

ABN , Publish Date - Jun 30 , 2026 | 01:34 PM

యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అరంగేట్రంపైనే అందరి ఆసక్తి నెలకొంది. ఐర్లాండ్‌తో సిరీస్‌లో అతడిని ఆడించకపోవడంపై ఇప్పటికీ చర్చ కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

వైభవ్ బ్యాటింగ్‌కు ఇంగ్లండ్ సర్‌ప్రైజ్ అవుతుంది: సునీల్ గావస్కర్
Sunil Gavaskar

ఇంటర్నెట్ డెస్క్: పసికూన ఐర్లాండ్ చేతిలో భారత జట్టు 0-2 తేడాతో క్లీన్‌స్వీప్ అయిన సంగతి తెలిసిందే. జులై 1 నుంచి టీమిండియా ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. ఈ నేపథ్యంలో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అరంగేట్రంపైనే అందరి ఆసక్తి నెలకొంది. ఐర్లాండ్‌తో సిరీస్‌లో అతడిని ఆడించకపోవడంపై ఇప్పటికీ చర్చ కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇంగ్లండ్‌తో జరిగే టీ20 సిరీస్‌కు వైభవ్‌ను ఆడించాలని తెలిపాడు. అతడి విధ్వంసకర బ్యాటింగ్‌కు ఇంగ్లండ్ బౌలర్లు ఆశ్చర్యపోతారని వెల్లడించాడు.


‘ఇంగ్లండ్‌తో తొలి టీ20లోనే వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నా. ఐర్లాండ్ సిరీస్ ఓటమి నుంచి కోలుకోవడానికి ఇదే సరైన మార్గం. అయితే ఇప్పటికే మంచి ఫామ్‌లో ఉన్న అభిషేక్ శర్మ, సంజు శాంసన్ ఓపెనింగ్ జోడీని విడగొట్టడం అంత సులువైన విషయం కాదు. కానీ వైభవ్ వంటి యువ ప్లేయర్ కోసం టీమ్ మేనేజ్‌మెంట్ కఠిన నిర్ణయం తీసుకోక తప్పదు. ఇంగ్లండ్ ప్లేయర్లు ఐర్లాండ్ సిరీస్‌ను చూసి భారత బ్యాటర్లపై కొంత అవగాహన పెంచుకుని ఉంటారు. కానీ వైభవ్ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. అతడి ఐపీఎల్ వీడియోలు తప్ప వారికి మరే సమాచారం లేదు. ఒక్కసారి అతడు జోరందుకుంటే మ్యాచ్‌ను ఒంటిచేత్తో మలిచే సత్తా ఉంది. ప్రస్తుతం భారత్‌కు వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ అవసరం’ అని గావస్కర్ వివరించాడు.


సీనియర్లు అండగా నిలుస్తున్నారు..

వైభవ్‌కు సీనియర్ ఆటగాళ్లు అందిస్తున్న సహకారాన్ని కూడా గావస్కర్ ప్రశంసించాడు. ‘అభిషేక్ శర్మ స్థానానికి వైభవ్ పోటీదారుడే అయినా.. అతడితో మాట్లాడే తీరు ఎంతో ప్రోత్సాహకరంగా ఉంది. ఇషాన్ కిషన్ కూడా వైభవ్‌కు ఎన్నో విలువైన సూచనలు చేస్తున్నాడు. ఈ కుర్రాడికి ఇంకా 20 ఏళ్లకు పైగా క్రికెట్‌లో భవిష్యత్తు ఉంది. ఈ క్రమంలో సీనియర్లు అతడిని సరైన దారిలో నడిపించడం ప్రశంసనీయం. జట్టులో చోటు దక్కకపోయినా నిరాశ చెందాల్సిన అవసరం లేదు. డ్రెస్సింగ్ రూమ్‌లో కూర్చొని కూడా ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. సీనియర్ ప్లేయర్లు ఎలా ప్రాక్టీస్ చేస్తున్నారు.. వైఫల్యాలను ఎలా ఎదుర్కొంటున్నారు.. ఒత్తిడిని ఎలా అధిగమిస్తారు.. ఇలాంటి అంశాలన్నీ యువ ప్లేయర్లకు ఎంతో ఉపయోగపడతాయి. కొన్నిసార్లు టాలెంట్ ఉన్నప్పటికీ.. మానసిక ధైర్యం కూడా ముఖ్యమే. ప్రస్తుతం వైభవ్‌ విషయంలో జరుగుతున్న ఈ ఎంపిక ప్రక్రియ అతడి భవిష్యత్తుకు ఎంతో మేలు చేస్తుంది’ అని గావస్కర్ వ్యాఖ్యానించాడు.


ఇవి కూడా చదవండి:

ఆసియా గేమ్స్: భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్

వంటమనిషిపై దాడి.. పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్‌పై కేసు

Updated Date - Jun 30 , 2026 | 01:51 PM