Share News

గంగూలీ కెప్టెన్సీలో టీమిండియా వ్యక్తిత్వమే మారిపోయింది: దీప్ దాస్‌గుప్తా

ABN , Publish Date - Aug 30 , 2026 | 01:52 PM

భారత క్రికెట్‌ చరిత్రలో సౌరభ్‌ గంగూలీది ప్రత్యేక అధ్యాయం. కెప్టెన్‌గా జట్టుకు దూకుడు నేర్పిన దాదా.. ప్రత్యర్థులు స్లెడ్జింగ్‌ చేస్తే మౌనంగా ఉండకుండా తిరిగి బదులివ్వాలనే ధైర్యాన్ని భారత ఆటగాళ్లలో నింపాడని మాజీ క్రికెటర్‌ దీప్‌ దాస్‌గుప్తా వెల్లడించాడు.

గంగూలీ కెప్టెన్సీలో టీమిండియా వ్యక్తిత్వమే మారిపోయింది: దీప్ దాస్‌గుప్తా
Deep Dasgupta

ఇంటర్నెట్ డెస్క్: భారత క్రికెట్‌ చరిత్రలో సౌరభ్‌ గంగూలీది ప్రత్యేక అధ్యాయం. కెప్టెన్‌గా జట్టుకు దూకుడు నేర్పిన దాదా.. ప్రత్యర్థులు స్లెడ్జింగ్‌ చేస్తే మౌనంగా ఉండకుండా తిరిగి బదులివ్వాలనే ధైర్యాన్ని భారత ఆటగాళ్లలో నింపాడని మాజీ క్రికెటర్‌ దీప్‌ దాస్‌గుప్తా వెల్లడించాడు. గంగూలీకి ఉన్న ‘నేనే కింగ్‌’ అనే మైండ్‌సెట్‌ క్రమంగా జట్టు మొత్తానికీ అలవడిందని వెల్లడించాడు. గంగూలీ కెప్టెన్సీలో భారత జట్టు వ్యక్తిత్వమే మారిపోయిందని గుర్తుచేసుకున్నాడు.


‘గంగూలీ కెప్టెన్‌గా ఉన్నప్పుడు ఎవరైనా మమ్మల్ని స్లెడ్జ్ చేస్తే.. మేమూ తిరిగి బదులివ్వడం మొదలుపెట్టాం. అంతకుముందు ఆ కోపాన్ని లోపలే ఉంచుకుని.. దాన్ని ఆటలో చూపించేవాళ్లం. కానీ గంగూలీ వచ్చిన తర్వాత స్లెడ్జింగ్‌కు స్లెడ్జింగ్‌తోనే సమాధానం ఇవ్వడం మొదలైంది. అతడి ముద్దుపేరు మహారాజ్‌. ఎప్పుడూ ‘నేనే కింగ్‌’ అనే భావనతో ఉంటాడు. ఆ ధోరణి క్రమంగా జట్టులోనూ కనిపించడం మొదలైంది. నా తొలి ఆస్ట్రేలియా పర్యటనకు, 2003లో జరిగిన చివరి పర్యటనకు మధ్య ఈ మార్పు స్పష్టంగా కనిపించింది. మొదట్లో మా స్పందన అంతా నియంత్రితంగా, అంతర్గతంగా ఉండేది. 2003 నాటికి మాత్రం ఎవరైనా ఏదైనా అంటే.. మేమూ వారికి తిరిగి సమాధానం ఇచ్చే వాళ్లం. గంగూలీ వేసిన పునాదిపైనే ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లీ టెస్టు క్రికెట్‌ను ఉన్నత స్థాయికి తీసుకెళ్లారు’ అని దాస్‌గుప్తా పేర్కొన్నాడు.


గంగూలీ భారత జట్టుకు 196 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో నాయకత్వం వహించాడు. ఇందులో 97 విజయాలు, 79 ఓటములు, 15 డ్రాలు ఉన్నాయి. టెస్టుల్లో 49 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించి 21 విజయాలు, 13 ఓటములు, 15 డ్రాలు నమోదు చేశాడు. గంగూలీ సారథ్యంలో 2001లో ఆస్ట్రేలియాపై బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీలో చిరస్మరణీయ విజయం సాధించిన భారత్‌.. 2002లో లీడ్స్‌లో, 2003లో అడిలైడ్‌లోనూ చారిత్రక టెస్టు విజయాలు నమోదు చేసింది. 2002 నాట్‌వెస్ట్‌ ట్రోఫీ విజయం, 2003 వన్డే ప్రపంచకప్‌లో రన్నరప్‌ కావడం కూడా గంగూలీ కెప్టెన్సీలోనే జరిగాయి.


ఇవి కూడా చదవండి:

అప్పుడు సంజు రియాక్షన్ చూసి షాకయ్యా: సూర్యకుమార్ యాదవ్

అదరగొట్టిన మెస్సి.. ఒకే మ్యాచ్‌లో నాలుగు గోల్స్.. వీడియో వైరల్

Updated Date - Aug 30 , 2026 | 01:52 PM