Share News

దులీప్ ట్రోఫీ: 15 ఏళ్లకే సంచలనం.. కెప్టెన్‌గా వైభవ్ సూర్యవంశీ

ABN , Publish Date - Aug 30 , 2026 | 12:52 PM

భారత యువ సంచలనం వైభవ్‌ సూర్యవంశీ మరో అరుదైన ఘనత సాధించాడు. కేవలం 15 ఏళ్ల వయసులోనే సీనియర్‌ పురుషుల జట్టుకు నాయకత్వం వహించే అవకాశం దక్కించుకున్నాడు.

దులీప్ ట్రోఫీ: 15 ఏళ్లకే సంచలనం.. కెప్టెన్‌గా వైభవ్ సూర్యవంశీ
Vaibhav Suryavanshi

ఇంటర్నెట్ డెస్క్: భారత యువ సంచలనం వైభవ్‌ సూర్యవంశీ మరో అరుదైన ఘనత సాధించాడు. కేవలం 15 ఏళ్ల వయసులోనే సీనియర్‌ పురుషుల జట్టుకు నాయకత్వం వహించే అవకాశం దక్కించుకున్నాడు. దులీప్ ట్రోఫీలో భాగంగా సెంట్రల్ జోన్ జట్టుతో ఈస్ట్ జోన్ జట్టు తలపడుతోంది. ఈస్ట్ జోన్ జట్టు కెప్టెన్ ఇషాన్ కిషన్ గాయపడటంతో వైస్ కెప్టెన్ వైభవ్‌ స్టాండింగ్‌ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు. సెంట్రల్‌ జోన్‌ ఇన్నింగ్స్‌లో 19వ ఓవర్‌ సమయంలో కిషన్‌ మైదానం వీడడంతో వైభవ్‌ జట్టు పగ్గాలు అందుకున్నాడు.


కీపింగ్‌ చేస్తుండగా గాయం..

కీపింగ్‌ చేస్తుండగా ఇషాన్‌ కిషన్‌ కుడి మణికట్టుకు బంతి బలంగా తగిలింది. వెంటనే ఫిజియోలు మైదానంలోనే చికిత్స అందించారు. అనంతరం నొప్పి తీవ్రతరం కావడంతో ఇషాన్ కిషన్‌ మైదానం వీడాడు. దీంతో కీపింగ్‌ బాధ్యతలను కుమార్‌ కుషాగ్ర చేపట్టాడు. కిషన్‌ అందుబాటులో లేకపోవడంతో వైభవ్‌ సూర్యవంశీ కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించాడు. సీనియర్‌ పురుషుల జట్టుకు అతడు నాయకత్వం వహించడం ఇదే తొలిసారి.


రెండో మ్యాచ్‌లోనే..

సెంట్రల్‌ జోన్‌తో జరుగుతున్న మ్యాచ్‌ వైభవ్‌కు దులీప్‌ ట్రోఫీలో రెండోది మాత్రమే. 2024లో రంజీ ట్రోఫీ అరంగేట్రం చేసిన అతడు.. ఇప్పటివరకు తొమ్మిది ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లు ఆడాడు. దులీప్‌ ట్రోఫీలో తొలి మ్యాచ్‌లో నార్త్‌ ఈస్ట్‌ జోన్‌పై వైభవ్‌ కేవలం 8 పరుగులే చేశాడు. అయితే బంతితో మాత్రం మెరిశాడు. రెండు వికెట్లు తీసి ఈస్ట్‌జోన్‌ ఇన్నింగ్స్‌ విజయానికి తన వంతు సహకారం అందించాడు. ఇప్పటివరకు తొమ్మిది ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌ల్లో 16.53 సగటుతో 215 పరుగులు చేశాడు. ఇందులో ఒక అర్ధశతకం ఉంది.


ఈస్ట్‌ జోన్‌కు శుభారంభం

సెమీఫైనల్లో టాస్‌ గెలిచిన ఇషాన్‌ కిషన్‌ తొలుత ఫీల్డింగ్‌ ఎంచుకున్నాడు. ఈస్ట్‌జోన్‌ బౌలర్లు జట్టుకు మంచి ఆరంభం అందించారు. లంచ్ బ్రేక్ సమయానికి సెంట్రల్ జోన్ జట్టు 3 వికెట్లు కోల్పోయి 81 పరుగులు చేసింది. క్రీజులో యశ్ రాథోడ్(6*), ఆర్యన్ జుయల్(42*) ఉన్నారు. ఈస్ట్ జోన్ బౌలర్లలో అభిజిత్‌ సర్కార్ 2, ముకేశ్ కుమార్ ఒక వికెట్ పడగొట్టారు.


ఇవి కూడా చదవండి:

అప్పుడు సంజు రియాక్షన్ చూసి షాకయ్యా: సూర్యకుమార్ యాదవ్

అదరగొట్టిన మెస్సి.. ఒకే మ్యాచ్‌లో నాలుగు గోల్స్.. వీడియో వైరల్

Updated Date - Aug 30 , 2026 | 02:22 PM