సిరాజ్‌ను ఎంపిక చేయకపోవడంపై విమర్శలు.. బ్యాటింగ్ కోచ్ రియాక్షన్ ఇదే!
ABN , Publish Date - Nov 19 , 2026 | 12:56 PM
సిరాజ్ ఉంటే న్యూజిలాండ్ పిచ్‌లపై అద్భుతంగా బౌలింగ్ చేసేవాడంటూ వస్తోన్న విమర్శలపై భారత బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ స్పందించాడు. తొలి రోజు ఆట ముగిసిన తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడాడు.
ఇంటర్నెట్ డెస్క్: న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్‌ను ఎంపిక చేయకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. తొలి రోజు బౌలర్లు పెద్దగా ప్రభావం చూపకపోవడంతో తుది జట్టు ఎంపికపై కూడా ప్రశ్నలు మొదలయ్యాయి. తొలి సెషన్‌లో అద్భుతంగా బౌలింగ్ చేసిన భారత బౌలర్లు.. ఆ తర్వాత తేలిపోయారు. సిరాజ్ ఉంటే న్యూజిలాండ్ పిచ్‌లపై అద్భుతంగా బౌలింగ్ చేసేవాడంటూ వస్తోన్న విమర్శలపై భారత బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ స్పందించాడు. తొలి రోజు ఆట ముగిసిన తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడాడు.
‘జట్టు ఎంపిక సమయంలో పరిస్థితులు, ప్రత్యర్థి బలాబలాలను పరిగణనలోకి తీసుకుని అత్యుత్తమ తుది జట్టును ఎంపిక చేశాం. సిరాజ్‌ను పక్కనపెట్టడం అతడి సామర్థ్యంపై సందేహంతో తీసుకున్న నిర్ణయం కాదు. టీమ్ సెలెక్షన్ అనేది మ్యాచ్ తొలి రోజు కోసం మాత్రమే జరగదు. సిరాజ్‌ను ఎంపిక చేయకపోవడం తప్పుడు నిర్ణయమేమీ కాదు. జట్టులో ఇద్దరు స్వింగ్ బౌలర్లు, మరో ఇద్దరు సీమ్ బౌలర్లు ఉన్నారు. ప్రత్యర్థి జట్టులో నలుగురు ఎడమచేతి వాటం బ్యాటర్లు ఉండటంతోనే వాషింగ్టన్ సుందర్‌కు అవకాశం కల్పించాం. ప్రసిద్ధ్ కృష్ణ దూకుడుగా బౌలింగ్ చేసే ఆటగాడు. వికెట్ల కోసం ప్రయత్నించే క్రమంలో కొన్నిసార్లు ఎక్కువ పరుగులు సమర్పించుకోవాల్సి వస్తుంది. వికెట్లు తీస్తే ప్రశంసిస్తారు. భారీగా పరుగులిచ్చినప్పుడు విమర్శిస్తారు. క్రికెట్‌లో ఇవన్నీ సహజం.
న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో నికోల్స్‌ను ఔట్ చేసే అవకాశాన్ని భారత జట్టు చేజార్చుకుంది. దానికి మూల్యం చెల్లించుకుంటుంది. కొత్త బంతితో పిచ్ బౌలర్లకు సహకరించింది. వాతావరణం కూడా అనుకూలంగా ఉంది. అయితే కీలక సమయంలో క్యాచ్ పట్టి ఉంటే మ్యాచ్‌పై భారత్ మరింత పట్టు సాధించేది’ అని సితాన్షు కోటక్ అభిప్రాయపడ్డారు.
ఇవి కూడా చదవండి:
భారత్‌తో టెస్టు మ్యాచ్: ముగిసిన తొలి రోజు ఆట.. కివీస్ స్కోర్ 243/5
టెన్నిస్ ఛాంపియన్‌షిప్ విజేతగా లారా దత్తా కుమార్తె..