Share News

శ్రేయాంక గాయపడటం భారత్‌కు ఎదురుదెబ్బ: మిథాలీ రాజ్

ABN , Publish Date - Jun 19 , 2026 | 09:42 PM

స్టార్ ప్లేయర్ శ్రేయాంక పాటిల్ గాయం కారణంగా ప్రపంచ కప్ టోర్నీ మొత్తానికి దూరమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె గాయంపై టీమిండియా మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ స్పందించింది.

శ్రేయాంక గాయపడటం భారత్‌కు ఎదురుదెబ్బ: మిథాలీ రాజ్
Mithali Raj

ఇంటర్నెట్ డెస్క్: మహిళల టీ20 ప్రపంచ కప్‌లో వరుసగా రెండు విజయాలతో జోరు మీదున్న భారత జట్టుకు షాక్ తగిలింది. స్టార్ ప్లేయర్ శ్రేయాంక పాటిల్ గాయం కారణంగా టోర్నీ మొత్తానికి దూరమైన సంగతి తెలిసిందే. నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో బౌలింగ్ చేస్తుండగా ఆమె కుడి కాలికి తీవ్ర గాయమైంది. దీంతో శ్రేయాంక స్థానంలో ప్రేమ రావత్‌ను రీప్లేస్‌మెంట్‌గా తీసుకున్నారు. ఈ నేపథ్యంలో శ్రేయాంక గాయంపై టీమిండియా మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ స్పందించింది.


‘ఇది కచ్చితంగా భారత్‌కు ఎదురుదెబ్బే. జట్టు మేనేజ్‌మెంట్ శ్రేయాంక‌ను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక వ్యూహాలు సిద్ధం చేసి ఉండొచ్చు. ఏడాది పాటు గాయాలతో ఇబ్బందులు పడి తిరిగి జట్టులోకి వచ్చిన ఆమె.. ప్రపంచ కప్‌లో ఆడే అవకాశం కోల్పోవడం అత్యంత బాధాకరం. శ్రేయాంక లేకపోవడంతో భారత స్పిన్ విభాగంలో మార్పులు తప్పవు. భారత్‌కు స్పిన్ బౌలింగ్ బలం. దీప్తి శర్మ, శ్రీచరణి పాటు మూడో స్పిన్నర్‌గా రాధా యాదవ్‌ ఆ బాధ్యతలు తీసుకునే అవకాశం ఉంది. ప్రపంచ కప్ లాంటి టోర్నీల్లో ఆమెకు ఉన్న అనుభవం జట్టుకు ఉపయోగపడుతుంది’ అని మిథాలీ రాజ్ అభిప్రాయపడింది.


మిడిలార్డర్ మెరుగు పడాలి..

‘భారత్ బ్యాటింగ్ విభాగంలో కొన్ని సమస్యలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మిడిలార్డర్‌లో వరుసగా వికెట్లు కోల్పోవడం ఆందోళన కలిగిస్తోంది. పాకిస్థాన్, నెదర్లాండ్స్ మ్యాచ్‌లోనూ స్వల్ప వ్యవధిలో వికెట్లు పడటం వల్ల రిచా ఘోష్‌పై అదనపు ఒత్తిడి పడుతోంది. ఆమె చివర్లో వేగంగా పరుగులు చేయగలదు. కానీ అంతకుముందు టాప్ ఆర్డర్, మిడిలార్డర్ బ్యాటర్లు కనీసం 30 పరుగుల భాగస్వామ్యాలు నిర్మించాలి. అప్పుడు రిచాకు తన సహజ ఆట ఆడే అవకాశం లభిస్తుంది’ అని మిథాలీ తెలిపింది. కాగా సీనియర్ పేసర్ రేణుకా సింగ్ ఠాకూర్‌ను బెంచ్‌పై ఉంచడంపై కూడా మిథాలీ స్పందించింది. ‘ప్రపంచకప్ తొలి మ్యాచ్‌లో సీనియర్ ప్లేయర్ రేణుకాను కాకుండా ఇతర పేసర్లను ఎంపిక చేశారంటే ఆమె ప్రస్తుతం ఆశించిన రిథమ్‌లో లేకపోవచ్చు. కేవలం అనుభవం ఆధారంగా జట్టులో చోటు ఇవ్వలేం. ప్రణాళికలను అమలు చేసే స్థితిలో ఉండాలి’ అని వెల్లడించింది.


ఇదిలా ఉండగా.. ప్రస్తుతం గ్రూప్-ఎలో వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచిన టీమిండియా.. అగ్రస్థానంలో కొనసాగుతోంది. శనివారం దక్షిణాఫ్రికాతో కీలక మ్యాచ్ ఆడనుంది. ఆ తర్వాత బంగ్లాదేశ్, ఆస్ట్రేలియాలతో తలపడనుంది.


ఇవి కూడా చదవండి:

ఢిల్లీ క్యాపిటల్స్ గూటికి రిషభ్ పంత్?

భారత హెల్మెట్ ధరించి.. సెంచరీ బాదిన సంగక్కర!

Updated Date - Jun 19 , 2026 | 09:51 PM