అదంతా నా భార్య ప్లాన్.. ఫ్యాన్స్ కంట పడకుండా దూబే రైలు ప్రయాణం
ABN , Publish Date - Mar 11 , 2026 | 03:35 PM
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ శివం దూబే చేసిన ఓ పని ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. విమానాలు అందుబాటులో లేకపోవడంతో త్వరగా ఇంటికెళ్లాలన్న ఉద్దేశంతో రైలులో ముంబైకి చేరుకున్నాడు. అది కూడా అభిమానుల దృష్టిలో పడకుండా సాఫీగా వెళ్లిపోయాడు.
ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ 2026 విజేతగా టీమిండియా నిలిచిన సంగతి తెలిసిందే. ప్లేయర్లకు ఎయిర్‌పోర్టుల్లో ఘన స్వాగతాలు లభించాయి. అయితే టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ శివం దూబే చేసిన పని మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. విమానాలు అందుబాటులో లేకపోవడంతో త్వరగా ఇంటికెళ్లాలన్న ఉద్దేశంతో రైలులో ముంబైకి చేరుకున్నాడు. అది కూడా అభిమానుల దృష్టిలో పడకుండా సాఫీగా వెళ్లిపోయాడు. అహ్మదాబాద్ నుంచి ముంబైకి ఎలా చేరుకున్నాడో దూబే వివరించాడు.
‘నా భార్య అంజుమ్, నా ఫ్రెండ్, నేను కలిసి అహ్మదాబాద్ నుంచి ముంబైకి రైలులో వెళ్లాం. మేం బుక్ చేసుకునే సమయానికి విమానాలు అందుబాటులో లేవు. దీంతో ఎలాగైనా ముంబైకి వెంటనే వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నా. అందుకోసం అహ్మదాబాద్ నుంచి ఉదయాన్నే ముంబైకి రైలులో చేరుకోవాలని భావించాం. రోడ్డు మార్గంలోనూ వెళ్లొచ్చు కానీ రైలు అయితే చాలా త్వరగా చేరుకునే అవకాశం ఉంది. నేను, నా భార్య, నా స్నేహితుడు థర్డ్ ఏసీ బుక్ చేసుకున్నాం. అవి మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అయితే స్టేషన్‌లో ఎవరైనా తనను గుర్తుపట్టి చుట్టుముడితే పరిస్థితి ఏంటని కాస్త కంగారు పడ్డాం. అయితే అందుకోసం ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నా. తలకు క్యాప్, ముఖానికి ఓ మాస్క్ పట్టుకున్నా. ఫుల్ స్లీవ్ ఉన్న టీ షర్ట్ వేసుకున్నా. మా ట్రైన్ ఉదయం 5.10 గంటలక బయలు దేరనుండటంతో అప్పుడు ఎక్కువ మంది స్టేషన్‌లో లేరు. కానీ అప్పటికే అహ్మదాబాద్ మొత్తం అభిమానులు జెండాలు, జెర్సీలు ధరించి సంబరాలు చేసుకుంటున్నారు.
మేం రైల్వే స్టేషన్‌కు చేరుకునేసరికి ట్రైన్ బయలుదేరేందుకు ఇంకా సమయం ఉంది. అప్పుడు ప్లాట్‌ఫాం మీద నడుచుకుంటూ వెళ్తే ఎవరైనా గుర్తుపట్టే అవకాశం ఉంది. దీంతో రైలు మరో ఐదు నిమిషాల్లో స్టార్ట్ అవుతుందనగా వచ్చేస్తానని నా భార్యకు చెప్పా. ఎలాంటి ఇబ్బంది లేకుండా రైలు ఎక్కేశాం. అప్పర్ బెర్తులో పడుకున్నా. అయితే అప్పటికీ టీసీ చూసి గుర్తు పట్టినంత పని చేశాడు. ‘శివం దూబే ఎవరు.. క్రికెటరా?’అని అడిగాడు. నా భార్య చాకచక్యంగా వ్యవహరించి ఇతడు వేరే వ్యక్తి అని చెప్పింది. వాష్ రూమ్‌కు వెళ్లేటప్పుడు ఎవరైనా గుర్తుపడతారేమోనని కాస్త కంగారు పడ్డా. కానీ అలాంటిదేమీ జరగలేదు. సాఫీగా ప్రయాణించి ముంబై చేరుకున్నా. అక్కడ దిగే సమయానికి పరిస్థితి ఎలా ఉంటుందోనని ఆందోళన చెందా. మధ్యాహ్న సమయంలో అక్కడ అభిమానులను తప్పించుకుని వెళ్లడం కష్టమే. దీంతో పోలీసులను సంప్రదించాం. వారంతా నేను విమానంలో వస్తున్నా అనుకున్నారు. రైలు ప్రయాణం అని చెప్పగానే సర్‌ప్రైజ్ అయ్యారు. పోలీస్ ఎస్కార్ట్ వాహనంలో రైల్వే స్టేషన్ నుంచి ఇబ్బంది లేకుండా బయటకు వచ్చేశా. ఇదంతా నా భార్య అంజుమ్ ప్రణాళిక. త్వరగా నా కుమారుడు, కుమార్తెను చూడాలనే ఇలా చేశాం’ అని దూబే వెల్లడించాడు.
ఇవి కూడా చదవండి:
ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్: అగ్రస్థానంలోనే అభిషేక్ శర్మ.. సత్తా చాటిన ఇషాన్ కిషన్
టీమిండియా కష్టాన్ని తక్కువ చేయొద్దు.. కీర్తి ఆజాద్‌పై వ్యాఖ్యలపై గంభీర్ కౌంటర్