Share News

సంజూకు మామయ్యలాంటి వాణ్ని: శశిథరూర్

ABN , Publish Date - Mar 20 , 2026 | 09:50 PM

ఇటీవల టీమ్ఇండియా టీ20 ప్రపంచకప్‌ గెలవడంలో కీలకపాత్ర పోషించిన సంజూ శాంసన్‌పై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ప్రశంసల జల్లు కురిపించాడు. అతడికి తాను మామయ్యలాంటి వాడినని చెప్పుకొచ్చారు.

సంజూకు మామయ్యలాంటి వాణ్ని: శశిథరూర్
Shashi Tharoor comments Sanju Samson

ఇంటర్నెట్ డెస్క్: సంజూ శాంసన్.. గత కొన్నిరోజులుగా మార్మోగుతున్న పేరిది. అద్భుతమైన ఆటతీరుతో టీమ్ఇండియా టీ20 ప్రపంచకప్ గెలవడంలో కీలకపాత్ర పోషించి 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌'గా నిలిచిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్‌‌పై దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పలువురు క్రికెట్ అభిమానులు అతణ్ని మాజీ క్రికెటర్ ధోనీ తర్వాత ఆ స్థానాన్ని భర్తీ చేస్తాడని వ్యాఖ్యానించారు. అయితే.. సంజూను తర్వాతి ధోనీగా పోల్చాల్సిన అవసరంలేదని టీమ్ఇండియా కోచ్ గౌతమ్ గంభీర్ అన్నారని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ అన్నారు. ఇటీవల తమ మధ్య జరిగిన ఒక సంభాషణ సందర్భంగా గౌతీ ఈ వ్యాఖ్యలు చేశాడని శశిథరూర్ వెల్లడించారు. అయితే.. సంజూతో తన బంధం ఈనాటిది కాదని.. అతడికి తాను మామయ్యలాంటి వాడినని చెప్పుకొచ్చారు థరూర్.


‘సంజూను నేను 14 ఏళ్ల వయసులోనే చూశా. ఎందుకో అప్పటినుంచే అతడికి మామయ్యలా ఫీలయ్యాను. అప్పుడే అతడిలోని ప్రతిభను స్పష్టంగా చూశా. వికెట్ కీపింగ్, బ్యాటింగ్ రెండింట్లోనూ అసాధారణ ప్రతిభ ఉంది. అప్పుడే నేను నువ్వు తర్వాతి ధోనీ అవుతావని సంజూకు చెప్పాను. కానీ.. ఆ తర్వాత గంభీర్‌తో ఓసారి ఈ విషయం చర్చకు వచ్చినప్పుడు.. ఆయన ‘లేదండీ శాంసన్‌ తర్వాతి ధోనీ కాదు.. వన్ అండ్ ఓన్లీ సంజూ శాంసన్’’ అని చెప్పారన్నారు. ఇవాళ గంభీర్‌ మాటే నిజమైందని కాంగ్రెస్ ఎంపీ చెప్పుకొచ్చారు.


సంజూ మరెవరికీ ప్రతిరూపం కావాల్సిన అవసరంలేదని.. అతడిని అతడిలాగే ఉండనిద్దామన్నారు థరూర్. సంజూ ఎంతో వినయంగా ఉంటాడని, మంచి నాయకుడని.. ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్‌ను సమర్థవంతంగా నడిపించాడని కొనియాడారు. ఇప్పుడు సీఎస్కేలోనూ తనదైన ప్రత్యేకతను చాటుకుంటాడన్నారు. జట్టుకు అవసరమైనప్పుడు రికార్డుల కోసం కాకుండా జట్టు కోసం నిస్వార్ధంగా పెద్ద షాట్లు ఆడటం అతడి గొప్పతనానికి నిదర్శమని శశిథరూర్ అభిప్రాయపడ్డారు.

గతంలో శాంసన్‌ను అన్యాయంగా జట్టు నుంచి తప్పించిన సందర్భాలున్నాయని.. కానీ ఇప్పుడు వరుసగా మూడు మ్యాచుల్లో అద్భుతంగా రాణించడం అతని స్థిరత్వానికి నిదర్శనమన్నారు థరూర్. ‘సంజూకు మున్ముందు మరిన్ని అవకాశాలివ్వాలి. వన్డేల్లోనూ రెగ్యులర్‌ ఆటగాడిగా కొనసాగిస్తే బావుంటుంది’ అని శశిథరూర్ చెప్పారు.


ఇవీ చదవండి:

పశ్చిమాసియా సంక్షోభం.. మోదీ ప్రభుత్వ వైఖరికి శశి థరూర్ మద్దతు

హృదయవిదారక ఘటన.. కిడ్నీ ఫెయిల్ అయిన వ్యక్తిని శ్మశానంలో వదిలేసి..

Updated Date - Mar 20 , 2026 | 09:59 PM