Share News

హృదయవిదారక ఘటన.. కిడ్నీ ఫెయిలైన వ్యక్తిని శ్మశానంలో వదిలేసి..

ABN , Publish Date - Mar 20 , 2026 | 09:37 PM

జగిత్యాల జిల్లాలో కిడ్నీ సమస్యతో బాధపడుతున్న వ్యక్తిని కుటుంబ సభ్యులు బతికుండగానే శ్మశానంలో వదిలేసిన ఘటన కలకలం రేపింది. స్థానికులు అతడిని ఆస్పత్రికి తరలించారు.

 హృదయవిదారక ఘటన.. కిడ్నీ ఫెయిలైన వ్యక్తిని శ్మశానంలో వదిలేసి..
Jagtial incident

జగిత్యాల జిల్లాలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. కిడ్నీ ఫెయిల్ అయిన వ్యక్తితో కుటుంబసభ్యులు అత్యంత కర్కశంగా వ్యవహరించారు. ఆస్పత్రి ఖర్చులు భరించలేక బతికుండగానే అతడిని శ్మశానంలో వదిలేసి వెళ్లిపోయారు. ప్రాణపాయ స్థితిలో ఉన్న అతడిని గుర్తించిన స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. జగిత్యాల జిల్లాకు చెందిన శ్రీధర్ గత కొంతకాలంగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాడు. డయాలసిస్, ఇతర వైద్య ఖర్చులు భరించడం కుటుంబానికి ఆర్థికంగా పెను భారమైంది.


ఈ నేపథ్యంలో కుటుంబసభ్యులు దారుణమైన నిర్ణయం తీసుకున్నారు. శ్రీధర్ ఇక బతకడని భావించిన కుటుంబసభ్యులు, అతడు మరణించక ముందే జగిత్యాలలోని వైకుంఠధామం (స్మశానవాటిక) వద్ద వదిలేసి వెళ్లిపోయారు. శ్మశానంలో పడి ఉన్న శ్రీధర్‌ దగ్గరకు స్థానికులు వెళ్లారు. వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న అతడిని దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. శ్రీధర్ శ్మశాన వాటికలో ఉన్న దృశ్యాల తాలూకా వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియో చూస్తున్న నెటిజన్లు శ్రీధర్ పరిస్థితి చూసి అయ్యో పాపం అంటున్నారు.


ఇవి కూడా చదవండి

తెలంగాణ టెన్త్ పరీక్షల రద్దుపై విద్యా కమిషన్ స్పష్టత

ముంబై హిట్ అండ్ రన్ కేసు.. 16 రోజులు కోమాలో ఉండి..

Updated Date - Mar 20 , 2026 | 09:51 PM