పరుగులు చేయలేకపోయినా పూర్తి బాధ్యత నాదే: సంజు శాంసన్
ABN , Publish Date - Oct 10 , 2026 | 01:49 PM
వరుసగా నాలుగు ఇన్నింగ్స్‌లలో విఫలమైనా.. తనపై నమ్మకం కోల్పోలేదని టీమిండియా వికెట్ కీపర్, బ్యాటర్ సంజు శాంసన్ స్పష్టం చేశాడు. వెస్టిండీస్‌తో రెండో టీ20లో విధ్వంసకర ఇన్నింగ్స్‌తో విమర్శకులకు బ్యాట్‌తోనే సమాధానమిచ్చాడు.
ఇంటర్నెట్ డెస్క్: వరుసగా నాలుగు ఇన్నింగ్స్‌లలో విఫలమైనా.. తనపై నమ్మకం కోల్పోలేదని టీమిండియా వికెట్ కీపర్, బ్యాటర్ సంజు శాంసన్ స్పష్టం చేశాడు. వెస్టిండీస్‌తో రెండో టీ20లో విధ్వంసకర ఇన్నింగ్స్‌తో విమర్శకులకు బ్యాట్‌తోనే సమాధానమిచ్చాడు. రాంచీ వేదికగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో 41 బంతుల్లో 82 పరుగులు చేసి తన సత్తా చాటాడు. అయితే జట్టు భారీ స్కోరు చేసినప్పటికీ విజయం సాధించలేకపోవడం అభిమానులను నిరాశపరిచింది. ఈ క్రమంలో సంజు తన ఆటపై పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.
వెస్టిండీస్‌తో రెండో టీ20 ముగిసిన అనంతరం.. గత నాలుగు ఇన్నింగ్స్‌లతో పోలిస్తే ఈసారి మెరుగైన ప్రదర్శన చేయడానికి కారణమేంటనే ప్రశ్న సంజుకు ఎదురైంది. దీనికి అతడు తనదైన శైలిలో స్పందించాడు. ‘ప్రొఫెషనల్ క్రికెటర్‌గా భారత్ తరఫున ఆడుతున్నప్పుడు నా బాధ్యతలను నేను సక్రమంగా నిర్వర్తించాలి. అందుకోసం అవసరమైన సన్నద్ధత, ప్రాక్టీస్, శిక్షణ.. నా చేతుల్లో ఉన్న ప్రతిదీ చేస్తాను. కానీ ఈ ఫార్మాట్‌లో ఫలితం ఎప్పుడూ మన చేతుల్లో ఉండదు. అందుకే వరుసగా మూడు ఇన్నింగ్స్‌ల్లో విఫలమయ్యానని చెప్పి.. తర్వాతి ఇన్నింగ్స్‌లో నెమ్మదిగా ఆడి ఫామ్ అందుకోవాలని అనుకోలేం. నేను పరుగులు చేయలేకపోతే ఆ బాధ్యత నాదే. అందుకు మరెవరినీ నిందించను. మైదానంలోకి అడుగుపెట్టిన ప్రతిసారీ పరుగులు చేయడమే నా పని. దాన్ని సాధించేందుకు ప్రయత్నిస్తూనే ఉంటాను’ అని సంజు వెల్లడించాడు.
ఇవి కూడా చదవండి:
టెస్టు క్రికెట్ చరిత్రలోనే తొలిసారి.. ఆసీస్ జట్టులో అందరూ 30 ఏళ్లు దాటినవారే!
షమీకి జట్టులో చోటు దక్కుతుందని అనుకోవడం లేదు: ఆకాశ్ చోప్రా