షమీకి జట్టులో చోటు దక్కుతుందని అనుకోవడం లేదు: ఆకాశ్ చోప్రా
ABN , Publish Date - Oct 10 , 2026 | 12:00 PM
అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ మారిన తర్వాత సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ జట్టులోకి తిరిగి రావడంతో షమీ పునరాగమనంపై కూడా ఆశలు పెరిగాయి. అయితే మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా మాత్రం షమీ విషయంలో కీలక వ్యాఖ్యలు చేశాడు.
ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ మళ్లీ భారత జట్టులోకి వస్తాడా? 2027 వన్డే ప్రపంచకప్ ఆడే అవకాశం దక్కించుకుంటాడా? ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో ఇదే చర్చ నడుస్తోంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ మారిన తర్వాత సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ జట్టులోకి తిరిగి రావడంతో షమీ పునరాగమనంపై కూడా ఆశలు పెరిగాయి. అయితే మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా మాత్రం షమీ విషయంలో కీలక వ్యాఖ్యలు చేశాడు.
‘అజిత్ అగార్కర్ మాత్రమే షమీ రీఎంట్రీకి అడ్డుపడుతున్నాడని వార్తలు వస్తున్నాయి. మిగతా సెలెక్టర్లు షమీని ఎంపిక చేయాలనుకున్నారని భావిస్తే మనల్ని మనమే మోసం చేసుకున్నట్లు అవుతుంది. సెలక్షన్ కమిటీలో ఐదుగురు సభ్యులు ఉంటారు. నేను సెలక్టర్లతో మాట్లాడాను. వారందరి అభిప్రాయం ఒక్కటే. అగార్కర్ మాత్రమే ఈ నిర్ణయం తీసుకున్నారని, మిగతావారంతా దానికి అంగీకరించారని అనుకోవడం సరికాదు.
న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు షమీ పేరును పరిశీలిస్తున్నారన్న చర్చ జరుగుతోంది. అతడికి అవకాశం రావచ్చనే వార్తలను నేను కొట్టిపారేయడం లేదు. కానీ అగార్కర్ వెళ్లిపోయారు కాబట్టి షమీకి జట్టులో చోటు దక్కుతుందని మాత్రం నేను అనుకోవడం లేదు. 2027 ప్రపంచకప్‌లో ఆడాలంటే ఇదే అతడికి కీలకమైన అవకాశం. ఇప్పుడు కాకపోతే ఆ తర్వాత ఎప్పుడు?. అయితే షమీ తిరిగి జట్టులోకి వస్తాడా? రాడా? అనే విషయంపై నాకు కూడా అంతర్గతంగా ఎలాంటి సమాచారం లేదు’ అని ఆకాశ్ చోప్రా వెల్లడించాడు.
పేసర్ల గాయాలు.. షమీకి అవకాశం దక్కేనా?
ప్రస్తుతం భారత జట్టు పేస్ విభాగంలో పలు సమస్యలు ఉన్నాయి. జస్‌ప్రీత్ బుమ్రా పనిభారాన్ని ఎలా నిర్వహించాలన్నది జట్టు యాజమాన్యానికి సవాలుగా మారింది. హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ, హార్దిక్ పాండ్య గాయాల సమస్యలు కూడా ఆందోళన కలిగిస్తున్నాయి. న్యూజిలాండ్ పర్యటనలో ఐదు టీ20లు, ఐదు వన్డేలు, రెండు టెస్టులు ఆడాల్సి ఉండటంతో బౌలర్ల ఎంపిక కీలకంగా మారనుంది. ప్రస్తుతం షమీకి టీ20 జట్టులో చోటు లేదు. అయితే వన్డే జట్టులోకి వస్తాడా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. న్యూజిలాండ్ పర్యటనకు భారత వన్డే జట్టును అక్టోబర్ మధ్యలో ప్రకటించే అవకాశం ఉంది. అప్పుడే షమీ భవితవ్యంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి:
వెస్టిండీస్‌పై ఓటమికి బౌలింగ్ కోచ్ సమాధానం చెప్పాలి: గావస్కర్
249 పరుగులు చేసినా భారత్ ఓటమి.. ఎవరినీ నిందించలేను: గంభీర్