Share News

క్రీడాకారులకు మాతృత్వం అడ్డుకాదు.. వినేశ్‌కు సాక్షి మాలిక్ మద్దతు

ABN , Publish Date - May 12 , 2026 | 05:42 PM

భారత రెజ్లింగ్ సమాఖ్యపై స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ చేస్తోన్న పోరాటానికి ఒలింపిక్ పతక విజేత సాక్షి మాలిక్ మద్దతుగా నిలిచారు. రెజ్లింగ్‌లో రీఎంట్రీ ఇవ్వాలనుకుంటున్న వినేశ్‌కు డబ్ల్యూఎఫ్ఐ అనుమతి నిరాకరించడంపై సాక్షి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

క్రీడాకారులకు మాతృత్వం అడ్డుకాదు.. వినేశ్‌కు సాక్షి మాలిక్ మద్దతు
Sakshi Malik

ఇంటర్నెట్ డెస్క్: భారత రెజ్లింగ్ సమాఖ్యపై స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ చేస్తోన్న పోరాటానికి ఒలింపిక్ పతక విజేత సాక్షి మాలిక్ మద్దతుగా నిలిచారు. రెజ్లింగ్‌లో రీఎంట్రీ ఇవ్వాలనుకుంటున్న వినేశ్‌కు డబ్ల్యూఎఫ్ఐ అనుమతి నిరాకరించడంపై సాక్షి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని గొండాలో జాతీయ ఓపెన్ ర్యాంకింగ్ టోర్నీలో పాల్గొనకుండా వినేశ్‌పై డబ్ల్యూఎఫ్ఐ అనర్హత వేటు వేసిన సంగతి తెలిసిందే. రిటైర్‌మెంట్ నిబంధనలు, యాంటీ డోపింగ్ ప్రక్రియలను కారణంగా చూపుతూ వినేశ్ ప్రస్తుతం పోటీలకు అనర్హురాలని డబ్ల్యూఎఫ్ఐ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో సాక్షి మాలిక్ ఎక్స్ వేదికగా వీడియో విడుదల చేశారు. వినేశ్‌కు మద్దతుగా నిలిచారు.


‘ఇతర దేశాల్లో అథ్లెట్లు తల్లి అయిన తర్వాత కూడా పతకాలు సాధించేలా ఫెడరేషన్లు నిబంధనలను సడలిస్తాయి. కానీ మన దగ్గర మాత్రం వినేశ్ రీఎంట్రీ ఇవ్వకుండా.. ఉద్దేశపూర్వకంగానే పోటీకి రెండు రోజుల ముందు కొత్త నిబంధనలను పెట్టి అడ్డుకున్నారు. తల్లి అయిన తర్వాత వినేశ్ తిరిగి రెజ్లింగ్‌లోకి రావాలని అనుకోవడం ప్రశంసించాల్సిన విషయం. మహిళా క్రీడాకారులకు మాతృత్వం తర్వాత మరింత సహకారం అందించాల్సింది పోయి.. ఇలాంటి అడ్డంకులు సృష్టించడం బాధాకరం. ప్రధాని నరేంద్ర మోదీ, క్రీడాశాఖ మంత్రితో పాటు డబ్ల్యూఎఫ్ఐను విజ్ఞప్తి చేస్తున్నా. వినేశ్‌కు ట్రయల్స్ అవకాశం ఇవ్వాలి. ఆమె దేశానికి పతకాలు సాధించి మహిళలు మాతృత్వం తర్వాత కూడా క్రీడల్లో రాణించగలరని నిరూపించాలి’ అని సాక్షి మాలిక్ ఆ వీడియోలో పేర్కొన్నారు.


ఇదిలా ఉంటే ప్రపంచ యాంటీ డోపింగ్ సంస్థ (వాడా) రూల్ 5.6.1 ప్రకారం 2026 జూన్ 26 వరకు వినేశ్ తిరిగి పోటీల్లో పాల్గొనలేదని డబ్ల్యూఎఫ్‌ఐ స్పష్టం చేసింది. అయితే 2025 జులై 3న ఇంటర్నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఇచ్చిన లేఖను వినేశ్ బయటపెట్టారు. అందులో 2026 జనవరి 1 నుంచే తాను పోటీలకు అర్హురాలినని పేర్కొన్నట్టు సమాచారం. ఇక 2025 డిసెంబర్‌లో డోపింగ్ టెస్టుకు హాజరు అవ్వలేదనే అంశంపై కూడా వినేశ్‌కు డబ్ల్యూఎఫ్‌ఐ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అయితే ఆ సమయంలో వినేశ్ తన నవజాత శిశువు సంరక్షణతో పాటు హరియాణా అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు హాజరవుతున్నానని వివరణ ఇచ్చిన సంగతి తెలిసిందే.


ఇవి కూడా చదవండి:

నేను స్వయంగా రిటైర్ అవ్వాలనేదే వారి కోరిక: వినేశ్ ఫొగాట్

ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్‌కు భారీ జరిమానా

Updated Date - May 12 , 2026 | 06:18 PM