IPL 2026: ఆర్సీబీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. చిన్నస్వామి స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్‌లకు గ్రీన్ సిగ్నల్..
ABN , Publish Date - Jan 17 , 2026 | 08:30 PM
ఆర్సీబీ అభిమానులకు గుడ్ న్యూస్. ఆర్సీబీ హోం గ్రౌండ్ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో అంతర్జాతీయ, ఐపీఎల్ మ్యాచ్‌లకు నిర్వహించేందుకు ప్రభుత్వం నుంచి అనుమతి లభించినట్లు కర్ణాటక రాష్ట్ర క్రికెట్ సంఘం శనివారం ప్రకటించింది..
ఇంటర్నెట్ డెస్క్: ఆర్సీబీ హోంగ్రౌండ్ చిన్నస్వామి స్టేడియంలో మళ్లీ క్రికెట్ సందడి మొదలు కానుంది. నెలల తరబడి కొనసాగిన అనిశ్చితికి ఎట్టకేలకు తెరపడింది. బెంగళూరులో ఉన్న ఈ స్టేడియంలో అంతర్జాతీయ, ఐపీఎల్ మ్యాచులు నిర్వహించేందుకు కర్ణాటక ప్రభుత్వం నుంచి అనుమతి లభించినట్లు కర్ణాటక రాష్ట్ర క్రికెట్ సంఘం (కేఎస్‌సీఏ) శనివారం ప్రకటించింది.
‘బెంగళూరులోని ప్రతిష్ఠాత్మక చిన్నస్వామి స్టేడియం(Chinnaswamy stadium)లో అంతర్జాతీయ, ఐపీఎల్ మ్యాచ్‌ల నిర్వహణకు కర్ణాటక ప్రభుత్వం, హోం శాఖ అనుమతి మంజూరు చేసిందని ప్రకటించడానికి మేం సంతోషిస్తున్నాం. ప్రభుత్వం నియమించిన టాస్క్‌ఫోర్స్ నివేదికను పరిశీలించిన అనంతరం భద్రతా ఏర్పాట్లు సంతృప్తికరంగా ఉన్నాయని నిర్ధారించడంతో హోం శాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది’ అని కేఎస్‌సీఏ ఓ ప్రకటనలో పేర్కొంది.
18 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ ఐపీఎల్ 2025లో ఆర్సీబీ ఛాంపియన్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. గతేడాది జూన్ 4న చిన్నస్వామి స్టేడియంలో సంబరాలు నిర్వహించారు. అప్పుడు స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాటలో 11 మంది మృతి చెందగా.. 50 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. దీంతో చిన్నస్వామి స్టేడియంలో అన్ని క్రికెట్ కార్యకలాపాలూ నిలిచిపోయాయి. దాదాపు మూడు లక్షల మంది అభిమానులు తరలిరావడం, సరైన నియంత్రణ చర్యలు లేకపోవడమే ఈ దుర్ఘటనకు కారణమని దర్యాప్తు నివేదిక తేల్చింది. ఈ ఘటనపై విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ జాన్ మైకెల్ డి.కున్హా నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం జ్యుడిషియల్ కమిషన్ వేసింది. ఈ కమిషన్ చిన్నస్వామి స్టేడియం మ్యాచ్‌ల నిర్వహణకు సురక్షితం కాదని తేల్చింది. ఈ క్రమంలో కొన్ని షరతులతో మ్యాచ్‌లు నిర్వహించుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఐపీఎల్ 2026 సీజన్ మార్చి 26 నుంచి మొదలుకానుంది.
ఇవి కూడా చదవండి:
రాణించిన అభిజ్ఞాన్, వైభవ్.. బంగ్లాదేశ్ టార్గెట్ 239..