పీఎస్ఎల్‌ను వీడిన శనక.. రాజస్థాన్ రాయల్స్ జట్టులో చేరే అవకాశం!
ABN , Publish Date - Mar 22 , 2026 | 07:31 PM
శ్రీలంక కెప్టెన్ డాసున్ శనక పీఎస్ఎల్‌ను వీడి ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. పీఎస్ఎల్‌ను వీడిన శనక.. రాజస్థాన్ రాయల్స్ జట్టుతో చేరే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
ఇంటర్నెట్ డెస్క్: పాకిస్థాన్ సూపర్ లీగ్ నుంచి మరో క్రికెటర్ బయటకు వచ్చాడు. శ్రీలంక కెప్టెన్ డాసున్ శనక పీఎస్ఎల్‌ను వీడి ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. అతడిని గత వేలంలో ఎవరూ కొనుగోలు చేయలేదు. దీంతో పీఎస్‌ఎల్‌లోకి వెళ్లాడు. అక్కడ 75 లక్షల పాకిస్థాన్ రూపాయలకు ఓ ఫ్రాంచైజీ కొనుగోలు చేసింది. అయినా సరే ఆ లీగ్‌ను శనక వదిలేశాడు. ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టుతో చేరే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
‘అవును.. మేం శనకతో ఒప్పందం చేసుకునే దిశగా వెళ్తున్నాం. కొన్ని అంశాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. శ్రీలంక క్రికెట్ బోర్డుతో అతడు పేపర్ వర్క్‌ను పూర్తి చేయాల్సి ఉంది. అది ముగియగానే శనకతో అగ్రిమెంట్ చేసుకుంటాం. త్వరలోనే మా జట్టుతో చేరతాడు’ అని రాజస్థాన్ రాయల్స్ అధికారులు పేర్కొన్నారు. ఐపీఎల్ వేలంలో అతడు రూ.75 లక్షల బేస్ ప్రైజ్‌తో వచ్చాడు. ఇప్పుడు అతడికి ఆ మొత్తమే ఇచ్చే అవకాశం ఉంది.
విదేశీ ప్లేయర్లు వరుసగా పీఎస్ఎల్‌ను వీడి ఐపీఎల్‌లో చేరుతున్నారు. ఇప్పటికే జింబాబ్వే స్టార్ పేసర్ బ్లెస్సింగ్ ముజరబాని కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుతో చేరిపోయాడు. బంగ్లా ప్లేయర్ ముస్తాఫిజుర్ రెహమాన్ స్థానంలో అతడిని తీసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు డాసున్ శనక రాజస్థాన్ రాయల్స్‌కు రానున్నాడు. అయితే గతేడాది సౌతాఫ్రికా ఆల్‌రౌండర్ కార్బిన్ బాష్ పీఎస్ఎల్‌ను వదిలి.. ఐపీఎల్ మిడ్ సీజన్‌లోనే ముంబై జట్టుతో కలిసిపోయిన సంగతి తెలిసిందే.
ఇవి కూడా చదవండి:
ప్రేక్షకులు లేకుండానే పీఎస్ఎల్.. అభిమానులకు మొహ్సిన్ నఖ్వీ క్షమాపణలు
చార్టర్డ్ ఫ్లైట్ డిమాండ్.. విరాట్ రియాక్షన్ ఇదే!