Share News

ఐపీఎల్ 2026: వారి బ్యాటింగ్ అదుర్స్.. కానీ టైటిల్ మాత్రం గెలవడం కష్టం: రాబిన్ ఉతప్ప

ABN , Publish Date - Mar 22 , 2026 | 06:25 PM

ఐపీఎల్ 2026 మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. బ్యాటింగ్ ఆర్డర్ పటిష్టంగా ఉన్నా.. గొప్ప బౌలర్లలెవరూ లేకపోవడం ఆ ఎస్ఆర్‌హెచ్ జట్టును ఇబ్బంది పెడుతోంది. ఈ నేపథ్యంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు గురించి టీమిండియా మాజీ ప్లేయర్ రాబిన్ ఉతప్ప కీలక వ్యాఖ్యలు చేశాడు.

ఐపీఎల్ 2026: వారి బ్యాటింగ్ అదుర్స్.. కానీ టైటిల్ మాత్రం గెలవడం కష్టం: రాబిన్ ఉతప్ప
SRH

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026 మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. మార్చి 28న ఆర్సీబీ-ఎస్ఆర్‌హెచ్ మ్యాచ్‌తో ఈ మెగా టోర్నీకి తెరలేవనుంది. అయితే ప్రస్తుతం ఆందోళన అంతా ఎస్ఆర్‌హెచ్ టీమ్ పైనే! బ్యాటింగ్ ఆర్డర్ పటిష్టంగా ఉన్నా.. గొప్ప బౌలర్లలెవరూ లేకపోవడం ఆ జట్టును ఇబ్బంది పెడుతోంది. స్టార్ బౌలర్ ప్యాట్ కమిన్స్ గాయం కారణంగా పలు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. దీంతో బౌలింగ్ లైనప్ మరింత బలహీనపడింది. ఈ నేపథ్యంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు గురించి టీమిండియా మాజీ ప్లేయర్ రాబిన్ ఉతప్ప కీలక వ్యాఖ్యలు చేశాడు.


‘ఎస్ఆర్‌హెచ్ బ్యాటింగ్ చూడటానికి రెండు కళ్లు సరిపోవు. అది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఆ జట్టు టైటిల్ గెలవడం మాత్రం కష్టమే. ట్రోఫీలు గెలిపించేంది బౌలర్లు.. ఆ సమస్యే ఎస్ఆర్‌హెచ్‌కు తలనొప్పిగా మారింది. జట్టులో హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్కత్, శివం మావి వంటి పేసర్లు ఉన్నారు. కానీ వారి బౌలింగ్ దళం అంత ప్రభావం చూపుతుందని అనిపించట్లేదు. హైదరాబాద్ జట్టు టైటిల్ కోసం గట్టి పోటీనివ్వలేదని మాత్రం అర్థమవుతోంది.


హోం గ్రౌండ్ హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో పిచ్‌లు పూర్తిగా బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటాయి. ఇక్కడ పేస్‌తో బౌలింగ్ చేయడం కంటే ఓ ప్రణాళికతో బంతులు సంధించాల్సి ఉంటుంది. ఇతర జట్టు కూడా భారీ స్కోర్లు చేసే అవకాశాలు ఉంటాయి. వారిని కట్టడి చేయగల బౌలర్లే ఎస్ఆర్‌హెచ్‌లో లేరు. ఈ స్టేడియంలో షమీ లాంటి బౌలర్‌కే పెద్దగా ఫలితం రాలేదు. భువనేశ్వర్ కుమార్ లాంటి తెలివైన బౌలర్ జట్టుకు అవసరం. గత సీజన్‌లో అభిషేక్ శర్మ, హెడ్, క్లాసెన్ మినహా ఎవరూ రాణించలేదు. టాపార్డర్ విఫలమైతే లక్ష్యాన్ని కాపాడుకోలేక తిప్పలు పడ్డారు. ఈసారి కూడా బౌలింగ్ విభాగంపై ఫ్రాంచైజీ దృష్టి పెట్టలేదు. అందుకే ఎస్ఆర్‌హెచ్ టైటిల్ కోసం గట్టి పోటీని ఇవ్వడం కష్టమే’ అని ఉతప్ప అభిప్రాయపడ్డాడు.


ఇవి కూడా చదవండి:

ప్రేక్షకులు లేకుండానే పీఎస్ఎల్.. అభిమానులకు మొహ్సిన్ నఖ్వీ క్షమాపణలు

చార్టర్డ్ ఫ్లైట్ డిమాండ్.. విరాట్ రియాక్షన్ ఇదే!

Updated Date - Mar 22 , 2026 | 06:25 PM