హర్భజన్ సింగ్‌కు పాక్ అభిమాని స్పెషల్ రిక్వెస్ట్.. భజ్జీ రియాక్షన్ ఇదే!
ABN , Publish Date - Nov 29 , 2026 | 12:53 PM
టీమిండియా మాజీ ప్లేయర్ హర్భజన్ సింగ్‌కు పాకిస్థాన్‌కు చెందిన అభిమాని ఆసక్తికర విజ్ఞప్తి చేశాడు. భారత, పాకిస్థాన్ యువ క్రికెటర్లు మైదానంలో గొడవలు పడకుండా వారికి సర్దిచెప్పాలని కోరాడు. ఇందుకు హర్భజన్ కూడా హుందాగా సమాధానమిచ్చాడు.
ఇంటర్నెట్ డెస్క్: భారత్, పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్‌లంటేనే మైదానంలో తీవ్ర ఉత్కంఠ ఉంటుంది. అయితే ఇటీవల ఇరు దేశాల ఆటగాళ్ల మధ్య మైదానంలో చోటుచేసుకుంటున్న గొడవలు, వాగ్వాదాలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ప్లేయర్ హర్భజన్ సింగ్‌కు పాకిస్థాన్‌కు చెందిన అభిమాని ఆసక్తికర విజ్ఞప్తి చేశాడు. భారత, పాకిస్థాన్ యువ క్రికెటర్లు మైదానంలో గొడవలు పడకుండా వారికి సర్దిచెప్పాలని కోరాడు. ఇందుకు హర్భజన్ కూడా హుందాగా సమాధానమిచ్చాడు.
ఇటీవల అండర్-19 ఆసియా కప్, ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నీల్లో భారత, పాకిస్థాన్ యువ ఆటగాళ్ల మధ్య చోటుచేసుకున్న వాగ్వాదాలపై పాక్ అభిమాని స్పందించాడు. ‘అప్పట్లో భారత్, పాక్ క్రికెటర్ల మధ్య స్నేహపూర్వక సంబంధాలు ఉండేవి. ఇప్పుడు యువ క్రికెటర్లు మైదానంలో ఎందుకు గొడవలు పడుతున్నారో అర్థం కావడం లేదు. దయచేసి భారత యువ ఆటగాళ్లకు మైదానంలో గొడవలు పడవద్దని చెప్పండి. ఇది క్రికెట్. ఆటను ఆటలాగే చూడమని చెప్పండి. నేను కోరుకునేది అదే’ అని హర్భజన్‌ను అభ్యర్థించాడు.
హుందాగా స్పందించిన భజ్జీ!
పాకిస్థానీ అభిమాని విజ్ఞప్తికి హర్భజన్ సింగ్ కూడా ప్రశాంతంగా స్పందించాడు. యువ ఆటగాళ్లకు తాము ఇప్పటికే పలు సందర్భాల్లో సూచనలు చేస్తున్నామని తెలిపాడు. ‘యువ ఆటగాళ్లు వినయంగా, ఒదిగి ఉండాలని.. తమ స్థాయిని మర్చిపోకుండా హుందాగా ప్రవర్తించాలని మేము కూడా వారికి చెబుతూనే ఉన్నాం’ అని హర్భజన్ సమాధానమిచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇవి కూడా చదవండి:
భారత్‌తో టెస్టు: మూడో రోజు ముగిసిన ఆట.. కివీస్ స్కోర్ 133/3
వరుసగా రెండు హాఫ్ సెంచరీలు.. ధోనీ రికార్డును సమం చేసిన ధ్రువ్ జురెల్