పాక్-బంగ్లా మ్యాచ్‌లో హైడ్రామా.. చెలరేగిన మరో వివాదం
ABN , Publish Date - Mar 16 , 2026 | 12:32 PM
బంగ్లాదేశ్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో పాక్ 1-2 తేడాతో ఓడిన సంగతి తెలిసిందే. అయితే సిరీస్ ప్రారంభం నుంచి పాక్ ఏదో ఒక అంశంతో వార్తల్లో నిలుస్తూ వస్తోంది. రెండో వన్డేలో సల్మాన్ అఘా రనౌట్ తీవ్ర వివాదాస్పదమైంది. ఈ నేపథ్యంలో మరో వివాదం తెరపైకి వచ్చింది.
ఇంటర్నెట్ డెస్క్: బంగ్లాదేశ్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో పాక్ 1-2 తేడాతో ఓడిన సంగతి తెలిసిందే. ఆఖరి మ్యాచ్‌లో 11 పరుగుల తేడాతో బంగ్లా విజయం సాధించింది. అయితే సిరీస్ ప్రారంభం నుంచి పాక్ ఏదో ఒక అంశంతో వార్తల్లో నిలుస్తూ వస్తోంది. రెండో వన్డేలో సల్మాన్ అఘా రనౌట్ తీవ్ర వివాదాస్పదమైంది. క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించారంటూ బంగ్లా ఆటగాళ్లపై విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో మరో వివాదం తెరపైకి వచ్చింది.
మూడో వన్డేలో బంగ్లాదేశ్ రివ్యూ వివాదానికి తావిస్తోంది. పాకిస్థాన్ ఇన్నింగ్స్‌లో చివరి ఓవర్‌ను బంగ్లా బౌలర్ రిషాద్ హుస్సేన్ వేశాడు. ఐదో బంతి లెగ్‌సైడ్ వైపు వెళ్లింది. అప్పుడు క్రీజులో షాహిన్ అఫ్రిది ఉన్నాడు. అయితే బంగ్లా జట్టు వైడ్ బాల్ విషయమై కాకుండా ఎల్బీడబ్ల్యూ కోసం రివ్యూకి వెళ్లింది. రిప్లేలో బంతిని బ్యాట్ తాకినట్లు తేలింది. దీంతో అంపైర్ దాన్ని లీగల్ డెలివరీగా తేల్చాడు. అయితే బంగ్లా జట్టు రివ్యూ కోల్పోయింది. కానీ అసలు వివాదం ఇక్కడే మొదలైంది.
డీఆర్ఎస్ రివ్యూ టైమ్ ఆన్ కాలేదని.. తెరపై రిప్లేను చూసిన తర్వాత బంగ్లా ప్లేయర్లు రివ్యూకు వెళ్లారని పాక్ ఆరోపిస్తోంది. ఈ మేరకు మ్యాచ్ అనంతరం హెడ్ కోచ్ మైక్ హెస్సన్ మ్యాచ్ రిఫరీ నీయాముర్ రషీద్‌ను కలిసి ఈ విషయంపై ఐసీసీకి అధికారికంగా ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఆఖరి బంతికి అఫ్రిది స్టంపౌట్ అవ్వడంతో పాక్ 11 పరుగుల తేడాతో ఓడింది.
ఇవి కూడా చదవండి:
బాబర్ ఆజమ్ మానసిక స్థితి సరిగ్గా లేదు: పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు
చరిత్రను మార్చాలని చూడొద్దు.. బీసీసీఐపై రోహిత్ శర్మ అభిమానుల ఆగ్రహం