Share News

అమ్మ నుంచి ఫోన్ కాల్.. ప్రెస్‌ మీట్‌ను మధ్యలో ఆపేసిన నితీశ్‌కుమార్ రెడ్డి

ABN , Publish Date - Jun 14 , 2026 | 10:27 AM

అఫ్గాన్‌తో జరిగిన తొలి వన్డేలో భారత్ విజయం సాధించింది. ఆ తర్వాత జరిగిన ప్రెస్ మీట్‌లో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అమ్మ నుంచి ఫోన్ కాల్.. ప్రెస్‌ మీట్‌ను మధ్యలో ఆపేసిన నితీశ్‌కుమార్ రెడ్డి
Nitish Kumar Reddy

ఇంటర్నెట్ డెస్క్: ధర్మశాల వేదికగా అఫ్గానిస్థాన్‌తో జరిగిన తొలి వన్డేలో భారత్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఆ మ్యాచ్ విజయానంతరం నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. టీమిండియా యువ ఆల్‌రౌండర్, తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి ప్రెస్ మీట్‌లో ఉన్నప్పుడు అతడి తల్లి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. లిఫ్ట్ చేసిన నితీశ్.. తన తల్లితో తెలుగులో మాట్లాడాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


మీడియా సమావేశంలో రిపోర్టర్ల ప్రశ్నలకు సమాధానాలు ఇస్తున్న సమయంలో నితీశ్ కుమార్ రెడ్డి ఫోన్ మోగింది. అమ్మ నుంచి కాల్ వచ్చిందని గుర్తించిన అతడు.. ప్రెస్ మీట్‌ను కాసేపు ఆపి లిఫ్ట్ చేసి మాట్లాడాడు. ‘అమ్మా.. 5 నిమిషాల్లో మళ్లీ చేస్తాను’ అని తెలుగులో మాట్లాడి ఫోన్ కట్ చేశాడు. అనంతరం మీడియా ప్రతినిధులకు చిరునవ్వుతో క్షమాపణలు చెప్పాడు. ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ‘మన తెలుగును ప్రపంచ వేదికపై హైలైట్ చేస్తున్నాడు’, ‘నితీశ్‌కు అమ్మ అంటే ఎంత ప్రేమో..’, ‘అమ్మ నుంచి కాల్ వస్తే ఎత్తక తప్పదు’ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.


మ్యాచ్ విషయానికొస్తే.. వర్షం కారణంగా అఫ్గాన్‌తో తొలి వన్డేను 25 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గాన్ జట్టు 194 పరుగులకు ఆలౌటైంది. అరంగేట్రంలోనే గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబె తలో 3 వికెట్లతో చెలరేగారు. నితీశ్ కుమార్ రెడ్డి 2, అర్ష్‌దీప్ సింగ్ 2 వికెట్లు తీశారు. ఛేదనలో భారత్ 22.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఆటను ముగించింది. శుభ్‌మన్ గిల్(84*), కేఎల్ రాహుల్(39*) రాణించారు. కాగా గిల్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది.


ఇవి కూడా చదవండి:

పాక్‌తో హ్యాండ్‌షేక్ వివాదం.. హర్మన్‌ప్రీత్ రియాక్షన్ ఇదే

ఆసియా క్రీడలకు సింధు, సాత్విక్‌

Updated Date - Jun 14 , 2026 | 11:03 AM