Share News

స్టోక్స్‌తో విభేదాలు.. పుకార్లను కొట్టిపారేసిన మెక్‌కల్లమ్

ABN , Publish Date - Jun 24 , 2026 | 01:42 PM

ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్ బెన్ స్టోక్స్, హెడ్ కోచ్ బ్రెండన్ మెక్‌కల్లమ్ మధ్య విభేదాలు ఉన్నాయంటూ కొంతకాలంగా వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ అంశంపై తాజాగా మెక్‌కల్లమ్ స్పందించాడు.

స్టోక్స్‌తో విభేదాలు.. పుకార్లను కొట్టిపారేసిన మెక్‌కల్లమ్
Brendon McCullum

ఇంటర్నెట్ డెస్క్: ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్ బెన్ స్టోక్స్, హెడ్ కోచ్ బ్రెండన్ మెక్‌కల్లమ్ మధ్య విభేదాలు ఉన్నాయంటూ కొంతకాలంగా వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. న్యూజిలాండ్‌తో తొలి టెస్టు అనంతరం ఓ రగ్బీ ప్లేయర్‌తో ఇంగ్లండ్ ఆటగాళ్లు వాగ్వాదానికి దిగిన ఘటన తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ ఘటనలో కూడా వీరిద్దరి పేర్లు ప్రస్తావనకు రావడంతో ఈ వివాదం మరింత ముదిరింది. అయితే ఈ అంశంపై తాజాగా మెక్‌కల్లమ్ స్పందించాడు. సోషల్ మీడియాలో వస్తోన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశాడు. స్టోక్స్ తనకు మంచి మిత్రుడని వెల్లడించాడు. న్యూజిలాండ్‌తో మూడో టెస్టు నేపథ్యంలో మెక్‌కల్లమ్ మాట్లాడాడు.


‘కొంతకాలంగా మాపై వస్తున్న వార్తల గురించి స్టోక్స్‌ను అడిగాను. ఇదంతా ఎక్కడ మొదలైందో నీకేమైనా తెలుసా? అని ప్రశ్నించాను. స్టోక్స్ కూడా తనకు ఏమీ తెలియదని సమాధానమిచ్చాడు. నేను మాత్రం అతడిని మంచి స్నేహితుడిలాగే భావిస్తాను. కెప్టెన్‌గా స్టోక్స్, కోచ్‌గా నేను కలిసి.. ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాం. ఇంగ్లండ్ క్రికెట్ ప్రయోజనాలే నాకు ముఖ్యం. మా మధ్య ఎలాంటి విభేదాలు లేవు’ అని మెక్‌కల్లమ్ స్పష్టం చేశాడు. 2022లో ఇంగ్లండ్ టెస్టు జట్టు కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన మెక్‌కల్లమ్.. స్టోక్స్‌తో కలిసి జట్టులో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాడు. దూకుడైన ‘బజ్ ‌బాల్’ శైలిని ప్రవేశపెట్టి టెస్టు క్రికెట్‌లో ఇంగ్లండ్ ఆటతీరును పూర్తిగా మార్చేశాడు.


మూడో టెస్టుకు స్టోక్స్ రీఎంట్రీ..

నైట్‌క్లబ్ వివాదం నేపథ్యంలో కెప్టెన్ స్టోక్స్, పేసర్ అట్కిన్సన్‌లపై న్యూజిలాండ్‌తో రెండో టెస్టుకు వేటు పడిన సంగతి తెలిసిందే. విచారణ చేపట్టిన ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు.. వీరికి క్లీన్‌చీట్ ఇచ్చింది. దీంతో స్టోక్స్ మూడో టెస్టుకు అందుబాటులోకి వచ్చాడు. 1-1తో సమంగా ఉన్న సిరీస్‌లో.. నిర్ణయాత్మక మూడో టెస్టు గురువారం ప్రారంభం కానుంది. రెండో టెస్టులో ఘోర ఓటమిని చవి చూసిన ఇంగ్లండ్ సిరీస్ గెలవాలనే కసితో బరిలోకి దిగనుంది.


ఇవి కూడా చదవండి:

మెస్సిపై ప్రశ్నలు.. రొనాల్డో అసహనం! వీడియో వైరల్

ఫిఫా ప్రపంచ కప్: నాకౌట్‌కు కొలంబియా

Updated Date - Jun 24 , 2026 | 01:53 PM