Share News

మెస్సిపై ప్రశ్నలు.. రొనాల్డో అసహనం! వీడియో వైరల్

ABN , Publish Date - Jun 24 , 2026 | 10:33 AM

ఫిఫా ప్రపంచ కప్ 2026లో ఉజ్బెకిస్థాన్‌పై పోర్చుగల్ 5-0 తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో రొనాల్డోకు మెస్సి గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. దీంతో అతడు తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు.

మెస్సిపై ప్రశ్నలు.. రొనాల్డో అసహనం! వీడియో వైరల్
Cristiano Ronaldo

ఇంటర్నెట్ డెస్క్: ఫిఫా ప్రపంచ కప్ 2026లో ఉజ్బెకిస్థాన్‌పై పోర్చుగల్ 5-0 తేడాతో ఘన విజయం సాధించింది. ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో రెండు గోల్స్ కొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్ అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో రొనాల్డోకు మెస్సి గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. దీంతో అతడు తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


రిపోర్టర్లు అడిగిన చాలా ప్రశ్నలకు రొనాల్డో సమాధానం చెప్పడానికి ఇష్టపడలేదు. ‘రికార్డు స్థాయిలో మీరిద్దరూ (మెస్సి, రొనాల్డో) ఆరోసారి ఫిఫా ప్రపంచ కప్ ఆడుతున్నారు.. దీనిపై మీ స్పందనేంటి?’ అని ఓ రిపోర్టర్ అడగ్గా.. రొనాల్డో ‘నో కామెంట్’ అని సమాధానమిచ్చాడు. ‘ఫిఫాలో వరుసగా రెండు మ్యాచుల్లో మెస్సి ఐదు గోల్స్ కొట్టాడు. ఎంబాపె కూడా..’ అని మరో రిపోర్టర్ అడుగుతుండగానే మధ్యలోనే ఆపేసి తలను పక్కకు తిప్పి ‘వేరే ప్రశ్న అడగండి’ అంటూ రొనాల్డో సమాధానిమిచ్చాడు. ‘లియోనెల్ మెస్సితో మ్యాచ్ జరిగితే ఎలా ఉంటుంది?’ అన్న ప్రశ్నపై స్పందించిన రొనాల్డో.. ‘ఆ ప్రశ్నకు ఎలా సమాధానం చెప్పాలో తెలియదు. అది పూర్తిగా అర్థం లేని ప్రశ్న. అయితే అలాంటి మ్యాచ్ జరిగితే మాత్రం అద్భుతంగా ఉంటుంది’ అని వ్యాఖ్యానించాడు.


మరోవైపు మరో జర్నలిస్ట్ మెస్సి గురించి ప్రశ్నించబోతుండగా రొనాల్డో పట్టించుకోకుండా ముందుకు వెళ్లినట్లు ఆ వీడియోలో కనిపించింది. అదే సమయంలో ‘మీరు అడిగే ప్రశ్నపై నా జవాబు ఆధారపడి ఉంటుంది. అనవసర ప్రశ్నలకు సమాధానం ఇవ్వను’ అంటూ రొనాల్డో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ప్రస్తుతం మెస్సి నేతృత్వంలోని అర్జెంటీనా జట్టు నాకౌట్ దశకు చేరగా.. పోర్చుగల్ మాత్రం రెండు మ్యాచ్‌ల్లో నాలుగు పాయింట్లతో ఇంకా అర్హత ఖరారు చేసుకోలేదు.


ఇవి కూడా చదవండి:

రిటైర్ అవుతానని అనుకున్నారు.. కానీ నా లక్ష్యం అదే: రొనాల్డో

రాంచీ స్టేడియం వద్ద తొక్కిసలాట.. ముగ్గురి పరిస్థితి విషమం

Updated Date - Jun 24 , 2026 | 10:36 AM