మాతృత్వం తర్వాత క్రికెట్‌లోకి రీఎంట్రీ.. ఐసీసీ గైడ్‌లైన్స్‌పై సచిన్ హర్షం
ABN , Publish Date - Jun 24 , 2026 | 08:52 AM
మహిళా క్రికెటర్ల కోసం ఐసీసీ ఓ కీలక ముందడుగు వేసింది. ప్రసవం తర్వాత కూడా మైదానంలోకి అడుగుపెట్టేందుకు ‘రిటర్న్ టు ప్లే పోస్ట్-ప్రెగ్నెన్సీ’ గైడ్‌లైన్స్‌ను రూపొందించింది. ఐసీసీ ప్రకటించిన ఈ మార్గదర్శకాలను భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ స్వాగతించాడు.
ఇంటర్నెట్ డెస్క్: మహిళా క్రికెటర్ల కోసం ఐసీసీ ఓ కీలక ముందడుగు వేసింది. ప్రసవం తర్వాత కూడా మైదానంలోకి అడుగుపెట్టేందుకు ‘రిటర్న్ టు ప్లే పోస్ట్-ప్రెగ్నెన్సీ’ గైడ్‌లైన్స్‌ను రూపొందించింది. మాతృత్వం కారణంగా మహిళా క్రికెటర్ల కెరీర్ ముగిసిపోకూడదనే లక్ష్యంతో.. వారికి అవసరమైన మద్దతు అందించేందుకు ఈ సరికొత్త పాలసీని తీసుకొచ్చింది. మాతృత్వం తర్వాత ప్రొఫెషనల్ క్రికెట్ ఆడటం సాధ్యమేనని చెప్పడమే ఈ గైడ్‌లైన్స్ ముఖ్య ఉద్దేశం. ఐసీసీ ప్రకటించిన ఈ మార్గదర్శకాలను భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ స్వాగతించాడు.
‘‘రిటర్న్ టు ప్లే పోస్ట్-ప్రెగ్నెన్సీ’ గైడ్‌లైన్స్ మహిళల క్రికెట్ భవిష్యత్తుకు భారీ ఊతమిస్తాయి. క్రీడల్లో సాధికారత అంటే ప్లేయర్ల జీవితంలోని ప్రతి దశకు సరైన మద్దతు ఉండటమే. ప్రసవం తర్వాత కూడా ప్రొఫెషనల్ క్రికెట్ సాధ్యమే. క్రీడా ప్రపంచం సరైన దిశలోనే సాగుతోందనే దానికి ఐసీసీ తీసుకున్న ఈ నిర్ణయం ఓ ఉదాహరణ. ఇది ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌లోకి అడుగుపెట్టాలనుకునే ప్రతి మహిళకు ఓ ప్రోత్సాహం లాంటిదే’ అని సచిన్ టెండూల్కర్ హర్షం వ్యక్తం చేశాడు.
అసలేంటీ ఐసీసీ గైడ్‌లైన్స్..
ఈ గైడ్‌లైన్స్‌లో భాగంగా ‘6-R’ ఫార్ములాను ఐసీసీ ప్రతిపాదించింది. ఇందులో రెడీ (సిద్ధం కావడం), రివ్యూ (సమీక్ష), రీస్టోర్ (పునరుద్ధరణ), రీకండిషన్ (పునఃస్థితికి తీసుకురావడం), రిటర్న్ (తిరిగి ఆడటం), రిఫైన్ (మెరుగుపరచడం) అనే ఆరు దశలు ఉంటాయి. శారీరకంగా కోలుకోవడం నుంచి వైద్య సమీక్షలు, నెమ్మదిగా శిక్షణ ప్రారంభించడం, క్రికెట్‌కు అవసరమైన కండిషనింగ్ సాధించడం, పోటీల్లోకి తిరిగి రావడం, ఆ తర్వాత కూడా ఆరోగ్యాన్ని పర్యవేక్షించడం వరకు ప్రతీ అంశాన్ని ఈ ప్రణాళికలో పొందుపరిచారు. ఈ మార్గదర్శకాల ప్రకారం, ప్రతి క్రీడాకారిణికి ఒక ప్రత్యేక కేస్ మేనేజర్‌ను నియమించాలని సిఫార్సు చేశారు. సాధారణంగా డాక్టర్ లేదా ఫిజియోథెరపిస్ట్ ఈ బాధ్యతలు చూస్తారు. గర్భం దాల్చినప్పటి నుంచి తిరిగి మైదానంలోకి అడుగుపెట్టే వరకు వీరే ఆమెకు ప్రతినిధిగా వ్యవహరిస్తారు. అంతేకాకుండా, మెడికల్ సిబ్బంది, ఫిజియోథెరపిస్టులు, సైకాలజిస్టులు, డైటీషియన్లు, కోచ్‌లు, కుటుంబ సభ్యులతో కూడిన ఒక బృందం క్రీడాకారిణికి అండగా నిలవాలని ఐసీసీ సూచించింది. స్థానిక చట్టాలకు అనుగుణంగా రూపొందించిన ఈ మార్గదర్శకాలు మహిళా క్రికెటర్ల శారీరక, మానసిక సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని రూపొందించామని ఐసీసీ వెల్లడించింది.
ఇవి కూడా చదవండి:
రిటైర్ అవుతానని అనుకున్నారు.. కానీ నా లక్ష్యం అదే: రొనాల్డో
రాంచీ స్టేడియం వద్ద తొక్కిసలాట.. ముగ్గురి పరిస్థితి విషమం