ఆసియా క్రీడలు: నన్ను ఎందుకు తప్పించారో వివరణ ఇవ్వండి: మానికా బాత్రా
ABN , Publish Date - Jun 24 , 2026 | 12:37 PM
ఆసియా క్రీడల ఎంపికపై భారత టేబుల్ టెన్నిస్ స్టార్ ప్లేయర్ మానికా బాత్రా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. తనను జట్టు నుంచి తప్పించడానికి గల కారణాలపై స్పష్టమైన వివరణ ఇవ్వకపోతే చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు వెనకాడబోనని ఫెడరేషన్‌ను హెచ్చరించింది.
ఇంటర్నెట్ డెస్క్: ఆసియా క్రీడల ఎంపికపై భారత టేబుల్ టెన్నిస్ స్టార్ ప్లేయర్ మానికా బాత్రా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. తనను జట్టు నుంచి తప్పించడానికి గల కారణాలపై స్పష్టమైన వివరణ ఇవ్వకపోతే చట్టపరంగా ముందుకెళ్తానని ఫెడరేషన్‌ను హెచ్చరించింది. ఈ విషయంలో ప్రధాని మోదీ, క్రీడాశాఖ మంత్రి మాన్‌సుఖ్ మాండవీయ జోక్యం చేసుకోవాలని మానికా మరోసారి కోరింది.
‘నేను జట్టులో చోటు ఇవ్వాలని కోరడం లేదు. మీ నిర్ణయాన్ని మార్చుకోవాలని కూడా అడగడం లేదు. కానీ నన్ను ఎందుకు ఆసియా క్రీడల నుంచి తప్పించాల్సి వచ్చిందో స్పష్టమైన వివరణ కావాలి. ఆసియా క్రీడలకు నేను ఎంపిక కాకపోవడం తీవ్ర నిరాశకు గురిచేసింది. అయితే, నన్ను సెలక్ట్ చేయకపోవడానికిగల కారణాలను ఫెడరేషన్ తెలియజేయలేదు. ప్రస్తుత ప్రపంచ ర్యాంకింగ్స్ జాబితాలో నేను 51వ స్థానంలో ఉన్నాను. ర్యాంకింగ్స్ ప్రతి వారం మారుతుంటాయి. ఎంపిక సమయంలో ఏ కాలవ్యవధిని పరిగణనలోకి తీసుకున్నారు? టాప్-50లో ఉన్న ప్లేయర్ ఒకటి లేదా రెండు వారాల్లో 50 నుంచి 51వ స్థానానికి పడిపోతే.. ఆసియా క్రీడలకు అర్హత కోల్పోయినట్టేనా? వీటిపై ఫెడరేషన్ నాకు సమాధానం ఇచ్చి తీరాలి’ అని మానికా ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఫెడరేషన్‌పై అనుమానాలు..
‘గత ఆసియా క్రీడల్లో మహిళల డబుల్స్ విభాగంలో భారత్‌కు చారిత్రాత్మక పతకం అందించిన ఐకా ముఖర్జీకి కూడా ఈసారి చోటు దక్కలేదు. ఇలాంటి విజయాలు సాధించిన ప్లేయర్లను జట్టులోకి తీసుకోకపోతే ఎంపిక ప్రమాణాలపై సహజంగానే ప్రశ్నలు తలెత్తుతాయి. టీటీఎఫ్ఐలో ప్లేయర్ల ఎంపిక నిర్ణయాలు తీసుకునేది ఎవరు? వారిలో ఎంతమంది అంతర్జాతీయ స్థాయిలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించారు? ఒలింపిక్స్, కామన్వెల్త్ గేమ్స్, ఆసియా గేమ్స్‌ల్లో ఎంతమంది పాల్గొన్నారు? నా ఎంపికపై కూడా ఓటింగ్ జరిగి ఉంటే అవి ప్రదర్శన ఆధారంగానే చేశారా? లేదా వ్యక్తిగత అభిప్రాయాల మేరకు నన్ను తప్పించారా?’ అని మానికా బాత్రా ఫెడరేషన్‌ను ప్రశ్నించింది. కాగా జపాన్ వేదికగా సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు ఆసియా గేమ్స్ జరగనున్నాయి.
ఇవి కూడా చదవండి:
మెస్సిపై ప్రశ్నలు.. రొనాల్డో అసహనం! వీడియో వైరల్
ఫిఫా ప్రపంచ కప్: నాకౌట్‌కు కొలంబియా