Share News

Mary Kom: ఆమె బాక్సింగ్ కెరీర్ కోసం నా జీవితాన్ని త్యాగం చేశాను.. మేరీ కోమ్ మాజీ భర్త సంచలన ఆరోపణలు

ABN , Publish Date - Jan 15 , 2026 | 12:00 PM

భారత బాక్సింగ్ లెజెండ్ మేరీ కోమ్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఇటీవల తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ఆమె మాజీ భర్తపై చేసిన సంచలన వ్యాఖ్యలు తీవ్ర దుమారం లేపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె ఆరోపణలకు మేరీ మాజీ భర్త ఘాటుగా స్పందించారు.

Mary Kom: ఆమె బాక్సింగ్ కెరీర్ కోసం నా జీవితాన్ని త్యాగం చేశాను.. మేరీ కోమ్ మాజీ భర్త సంచలన ఆరోపణలు
Mary Kom

ఇంటర్నెట్ డెస్క్: అంతర్జాతీయ వేదికల్లో దేశానికి ఎంతో గౌరవం తెచ్చిపెట్టిన భారత బాక్సింగ్ లెజెండ్ మేరీ కోమ్.. వ్యక్తిగత జీవితానికి సంబంధించి రోజుకో విషయంతో వార్తల్లో నిలుస్తున్నారు. పెళ్లైన దాదాపు 20 ఏళ్ల తర్వాత తన భర్త కరుంగ్ ఆంఖోలర్ నుంచి విడాకులు తీసుకున్న ఆమె.. ఇటీవలే తన మాజీ భర్తపై చేసిన సంచలన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. బహిరంగంగానే ఇరువురు ఆరోపణలు చేసుకోవడంతో ఈ వ్యవహారం మరింత చర్చనీయాంశం అయింది. తాజాగా ఈ మేరీ మాజీ భర్త ఆమె(Mary Kom)పై పలు సంచలన ఆరోపణలు చేశారు.


రాజకీయాల్లోకి వెళ్లి భారీగా డబ్బు ఖర్చు చేశానన్న వ్యాఖ్యలపై కరుంగ్ (Karung Onkholer) ఘాటుగా స్పందించారు. ‘2016లో ఆమె రాజ్యసభ సభ్యురాలిగా నామినేట్ అయ్యారు. ఆమె పదవీకాలం ముగిసే సమయంలో నన్ను ఎన్నికల్లో పోటీ చేయమని ఆమెనే ప్రోత్సహించారు. నేనేమీ దుబారా ఖర్చులు చేయలేదు. ఆమె ఒత్తిడి వల్లే రాజకీయాల్లోకి రావాల్సి వచ్చింది. మాకు పెళ్లి అయ్యే సమయానికి నేను యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నాను. ఫుట్‌బాల్ కూడా ఆడేవాడిని. ఆమె బాక్సింగ్ కెరీర్‌పై దృష్టి పెట్టాలనుకుంది. పెళ్లి తర్వాత పిల్లలను చూసుకోవాలని నన్ను కోరింది. ఆమె నెలల తరబడి శిక్షణలు, టోర్నీల కోసం బయటే ఉండేది. పిల్లలకు స్నానం చేయించి, భోజనం పెట్టడం, స్కూల్‌కి తీసుకెళ్లడం వంటి పనులన్నీ నేనే చూసుకున్నా’ అని కరుంగ్ అన్నారు.


అవన్నీ ప్రేమతోనే చేశా..

‘మా దాంపత్య జీవితంలో నేనేం చేసినా డబ్బు కోసం కాదు.. ప్రేమతోనే చేశా. లింగ భేదాలను చూడకుండా.. అన్నీ పనులు చేశా. నేను ఆమె డ్రైవర్‌ను, వంటవాడిని, ఇంటి పనులన్నీ నేనే చేసేవాడిని. కుటుంబం కోసం ప్రేమతో చేశాను. ఇప్పుడు ఆమె చేస్తున్న వ్యాఖ్యలు బాధాకరంగా ఉన్నాయి. మాకు సంప్రదాయ కోర్టులో విడాకులు వచ్చాయి. అయినప్పటికీ నేనే చేసిన సహకారాన్ని తక్కువ చేసి మాట్లాడవద్దు’ అని తేల్చి చెప్పారు.


మేరీ కోమ్ ఏమన్నారంటే..?

‘మా వివాహ సమయంలో అతడు ఒక్క రూపాయి కూడా సంపాదించలేదు. నేనే నా కుటుంబానికి ఏకైక ఆదాయ మార్గం. వీధుల్లో ఫుట్‌బాల్ ఆడేవాడు. నా కోసం త్యాగం ఎక్కడ చేశాడు?. ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఇంట్లోనే నిద్రపోయేవాడు. నేను కష్టపడి సంపాదించిన డబ్బును కూడా అతడు ఖర్చు చేశాడు. నా బ్యాంకు ఖాతా దాదాపు ఖాళీ అయింది’ అని మేరీ ఆరోపించారు.


ఇవి కూడా చదవండి:

11 ఏళ్ల రికార్డు.. చరిత్ర సృష్టించిన కేఎల్ రాహుల్!

ఆ తప్పిదమే మా ఓటమిని శాసించింది: శుభ్‌మన్ గిల్

Updated Date - Jan 15 , 2026 | 12:23 PM