ఎమ్మెల్యే టికెట్ కోసం రూ.5 కోట్లు డిమాండ్ చేశారు.. టీఎంసీపై మనోజ్ తివారి సంచలన ఆరోపణలు
ABN , Publish Date - May 05 , 2026 | 06:12 PM
పశ్చిమ బెంగాల్‌లో మరికొద్ది రోజుల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కానుంది. ఈ నేపథ్యంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే, టీమిండియా మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ.. ఆ పార్టీపై సంచలన ఆరోపణలు చేశారు. తన రాజకీయ ప్రయాణంలో టీఎంసీ అధ్యాయం ముగిసిందని ప్రకటించారు.
ఇంటర్నెట్ డెస్క్: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో 2026 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కీలక మార్పులు తీసుకొచ్చాయి. 15 ఏళ్ల దీదీ పాలనకు ప్రజలు చరమగీతం పాడారు. మరికొద్ది రోజుల్లో బెంగాల్‌లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కానుంది. ఈ నేపథ్యంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే, టీమిండియా మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ.. ఆ పార్టీపై సంచలన ఆరోపణలు చేశారు. తన రాజకీయ ప్రయాణంలో టీఎంసీ అధ్యాయం ముగిసిందని ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన అనంతరం మనోజ్ తివారీ మీడియాతో మాట్లాడారు. పార్టీలోని అవినీతిని, టికెట్ల అమ్మకాలను బహిర్గతం చేశారు. ఎమ్మెల్యే టికెట్ కోసం భారీగా డబ్బు డిమాండ్ చేశారని తెలిపారు. ఈ ఆరోపణలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీశాయి.
‘హౌరాలోని శిబ్‌పూర్ నియోజకవర్గం నుంచి నాకు టికెట్ ఇవ్వడానికి టీఎంసీ నిరాకరించింది. ఎమ్మెల్యే టికెట్ కావాలంటే రూ.5కోట్లు చెల్లించాలని డిమాండ్ చేసింది. ఈ సారి ఎన్నికల్లో సుమారు 70 నుంచి 72 మంది అభ్యర్థులు భారీగా డబ్బు చెల్లించి టికెట్లు కొనుగోలు చేశారు. అందుకే పార్టీ ఘోర పరాజయం పాలైంది. అవినీతిమయమైన పార్టీకి పతనం తప్పదు. టీఎంసీతో నా అధ్యాయం ముగిసింది. పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం లేదు. మమతా బెనర్జీ ప్రభుత్వంలో నేను క్రీడల శాఖ సహాయ మంత్రిగా పనిచేశాను. పేరుకే మంత్రి పదవి.. కానీ నాకు ఎటువంటి అధికారులు ఉండేవి కాదు. కనీసం నియోజకవర్గ సమస్యల గురించి మాట్లాడే అవకాశం కూడా ఇచ్చేవారు కాదు. నా సొంత నియోజకవర్గంలో డ్రైనేజీ, మురుగునీటి సమస్యల కోసం ఎంతో పోరాడాను. కొన్ని పనుల కోసం నా సొంత డబ్బును ఖర్చు చేశాను. ప్రతి ఏడాది ఏదో ఒక మాస్టర్ ప్లాన్ అంటారు. కానీ అది మాటలకే పరిమితం అయ్యేది’ అని మనోజ్ తివారీ విమర్శించారు.
క్రీడా శాఖలో రాజకీయాలు..
బెంగాల్ క్రీడా మంత్రి అరూప్ బిస్వాస్‌పై కూడా తివారీ తీవ్ర విమర్శలు చేశారు. ‘బిస్వాస్‌కు క్రీడల పట్ల అవగాహన లేదు. నా ఎదుగుదలను చూసి అసూయ పడేవారు. క్రీడా కార్యక్రమాలకు నన్ను ఆహ్వానించకుండా అడ్డుకునేవారు. నాపై ఎన్నో అవినీతి ఆరోపణలు చేశారు. నేను ఐపీఎల్‌లో 10 ఏళ్లు, ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 20 ఏళ్లు ఆడాను. నాకు డబ్బు అవసరం లేదు’ అని తివారీ స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే, రాజకీయాలకు స్వస్తి పలికి.. తిరిగి క్రికెట్ వైపు అడుగులు వేయాలని అనుకుంటున్నట్లు మనోజ్ తివారీ తెలిపారు. బెంగాల్ రంజీ జట్టు ప్రధాన కోచ్ పదవికి దరఖాస్తు చేసుకున్నట్లు వెల్లడించారు. బీసీసీఐ లెవల్ 2 కోచింగ్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన తివారీ.. భవిష్యత్తులో కోచ్‌గా సేవలు అందించాలని భావిస్తున్నట్లు తెలిపారు.
ఇవి కూడా చదవండి:
‘టెస్టు ప్లేయర్’ అనే ముద్రను చెరిపేసుకోవడం గర్వంగా ఉంది: కేఎల్ రాహుల్
ఆటకు డబ్బుతో సంబంధమే లేదు.. పంత్ ఆటతీరుపై ఎల్ఎస్‌జీ కోచ్ రియాక్షన్