మరోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన టీమిండియా మాజీ క్రికెటర్..
ABN , Publish Date - May 05 , 2026 | 04:03 PM
పశ్చిమ బెంగాల్‌ను 15 ఏళ్లు పాలించిన మమతా బెనర్జీకి 2026 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో గట్టి షాక్ తగిలింది. భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించి.. దీదీ పాలనకు చరమగీతం పాడింది. అయితే బీజేపీ నుంచి ఎన్నికైన 200 మంది పైచిలుకు ఎమ్మెల్యేల్లో టీమిండియా మాజీ క్రికెటర్ అశోక్ దిండా కూడా ఉన్నారు.
ఇంటర్నెట్ డెస్క్: పశ్చిమ బెంగాల్‌ను 15 ఏళ్లు పాలించిన మమతా బెనర్జీకి 2026 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో గట్టి షాక్ తగిలింది. భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించి.. దీదీ పాలనకు చరమగీతం పాడింది. అయితే బీజేపీ నుంచి ఎన్నికైన 200 మంది పైచిలుకు ఎమ్మెల్యేల్లో టీమిండియా మాజీ క్రికెటర్ అశోక్ దిండా కూడా ఒకరు. పూర్వ మిడ్నాపూర్ ప్రాంతంలోని మోయ్నా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అశోక్ దిండా బీజేపీ ఎమ్మెల్యేగా మరోసారి ఎన్నికయ్యారు.
అశోక్ దిండా.. తన సమీప ప్రత్యర్థి, టీఎంసీ అభ్యర్ది చందన్ మొండల్‌పై 14వేలకు పైగా ఓట్ల తేడాతో గెలిచారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో(2021) స్వల్ప తేడాతో విజయం సాధించిన దిండా.. ఈ సారి మంచి మెజారిటీతో గెలుపొందారు. 2021లో అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అశోక్.. అదే ఏడాదిలో బీజేపీలో చేరి తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. ఇప్పుడు వరుసగా రెండోసారి విజయం సాధించడంతో.. బెంగాల్‌లో ఏర్పాటయ్యే బీజేపీ ప్రభుత్వంలో మంత్రిగా నియమితుడయ్యే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఇదిలా ఉండగా, 42 ఏళ్ల అశోక్ దిండా.. 2009లో టీమిండియాలోకి అరంగేట్రం చేశారు. తన క్రికెట్ కెరీర్‌లో 13 వన్డేలు, 9 టీ20లు ఆడి 29 వికెట్లు తీశారు. కుడిచేతి మీడియం పేసర్ అయిన అశోక్ దిండా.. ఐపీఎల్ ద్వారా వెలుగులోకి వచ్చి భారత జట్టులో అవకాశాలు దక్కించుకున్నారు. ఐపీఎల్‌లో చాలా కాలం కేకేఆర్ తరఫున ప్రాతినిధ్యం వహించారు. ఐపీఎల్ కెరీర్‌లో 78 మ్యాచులు ఆడి 69 వికెట్లు పడగొట్టారు. 2010లో ఆసియా కప్ గెలిచిన భారత జట్టులో సభ్యుడిగా ఉన్నారు. దేశవాళీ క్రికెట్‌లోనూ దిండా అద్భుత ప్రదర్శనలు చేశారు. బెంగాల్ తరఫున ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 420 వికెట్లు, లిస్ట్ ఏ క్రికెట్‌లో 151 వికెట్లు పడగొట్టారు.
ఇవి కూడా చదవండి:
‘టెస్టు ప్లేయర్’ అనే ముద్రను చెరిపేసుకోవడం గర్వంగా ఉంది: కేఎల్ రాహుల్
ఆటకు డబ్బుతో సంబంధమే లేదు.. పంత్ ఆటతీరుపై ఎల్ఎస్‌జీ కోచ్ రియాక్షన్