Share News

ఐపీఎల్ నుంచే టెస్టు క్రికెట్‌కు సిద్ధమయ్యా: మానవ్ సుతార్

ABN , Publish Date - Jun 09 , 2026 | 12:43 PM

అఫ్గాన్‌పై అరంగేట్ర మ్యాచ్‌లోనే భారత యువ స్పిన్నర్ మానవ్ సుతార్ 7 వికెట్లతో సత్తా చాటి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు. తాజాగా తన అరంగేట్ర అనుభవాలను సుతార్ పంచుకున్నాడు.

ఐపీఎల్ నుంచే టెస్టు క్రికెట్‌కు సిద్ధమయ్యా: మానవ్ సుతార్
Manav Suthar

ఇంటర్నెట్ డెస్క్: అఫ్గానిస్థాన్‌తో జరిగిన ఏకైక టెస్టులో భారత జట్టు 300 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అరంగేట్ర మ్యాచ్‌లోనే యువ స్పిన్నర్ మానవ్ సుతార్ 7 వికెట్లతో సత్తా చాటి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు. తాజాగా తన అరంగేట్ర అనుభవాలను సుతార్ పంచుకున్నాడు. టెస్టు జట్టులో అవకాశం వస్తుందనే సంకేతాలు వచ్చినప్పటి నుంచే ఐపీఎల్ సమయంలోనూ ఎర్రబంతితో ప్రాక్టీస్ ప్రారంభించినట్లు వెల్లడించాడు.


‘కోచ్ గంభీర్ సర్, కెప్టెన్ గిల్ భయ్యా ఐపీఎల్ సమయంలోనే నాకు టెస్టు అరంగేట్రం చేసే అవకాశం వస్తుందని చెప్పారు. ఆ క్షణం నా జీవితాంతం గుర్తుండిపోతుంది. భారత్ తరఫున టెస్టు క్రికెట్ ఆడటం నా కల మాత్రమే కాదు.. నా కుటుంబం కల కూడా. చిన్నప్పటి నుంచి టెస్టు క్రికెటర్ కావడమే నా లక్ష్యం. అఫ్గాన్‌తో టెస్టు మ్యాచ్ కోసం నా పేరు పరిశీలనలో ఉందని తెలిసిన తర్వాత ఐపీఎల్ సమయంలో కూడా ఎర్రబంతితో ప్రాక్టీస్ చేశాను. అవకాశం వస్తే ఎలా బౌలింగ్ చేయాలన్న దానిపై ముందుగానే ప్రణాళిక సిద్ధం చేసుకున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మూడు, నాలుగు సుదీర్ఘ ప్రాక్టీస్ సెషన్లు నిర్వహించాను’ అని మానవ్ సుతార్ వెల్లడించాడు.


తొలి వికెట్ ఎప్పటికీ ఫేవరెట్..

‘అఫ్గాన్ ప్లేయర్లు బౌలింగ్ చేస్తున్నప్పుడు బంతి కొద్దిగా టర్న్ అవుతున్నట్లు గమనించాను. నేను బ్యాటింగ్ చేసినప్పుడు కూడా కొన్ని బంతులు ఆగి వచ్చాయి. దీంతో స్పిన్నర్లకు పిచ్ అనుకూలిస్తుందని అర్థమైంది. తొలి ఓవర్ నుంచే బంతి తిరగడంతో నా టెక్నిక్ పాటించాను. వర్కౌట్ అయింది. అరంగేట్ర మ్యాచ్‌లో సాధించిన తొలి వికెట్ ఎప్పటికీ నా ఫేవరెట్. ఆ వికెట్‌కు ముందు మంచి పోటీ నడిచింది. నేను మాత్రం ఒకే ప్రాంతంలో నిరంతరం బంతులు వేయడంపైనే దృష్టి పెట్టాను. చిన్నప్పటి నుంచే స్పాట్ బౌలింగ్‌పై దృష్టి పెట్టడం వల్లే నాలో ఈ స్థిరత్వం వచ్చింది’ అని సుతార్ పేర్కొన్నాడు.


ఇవి కూడా చదవండి:

ట్రై సిరీస్: నిరాశపరిచిన వైభవ్ సూర్యవంశీ

మద్యం మత్తులో ఇంగ్లండ్ ప్లేయర్ల వీరంగం.. స్టోక్స్ కెప్టెన్సీకి ముప్పు?

Updated Date - Jun 09 , 2026 | 12:43 PM