ఒక్క మ్యాచ్‌తో కుల్‌దీప్ సామర్థ్యాన్ని అంచనా వేయొద్దు: స్పిన్ కోచ్ బహుతులే
ABN , Publish Date - Aug 21 , 2026 | 04:51 PM
భారత స్టార్ స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ్‌పై స్పిన్ బౌలింగ్ కోచ్ సాయిరాజ్ బహుతులే ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. శ్రీలంకతో తొలి టెస్టులో పెద్దగా ప్రభావం చూపలేకపోయినప్పటికీ.. అతడిపై టీమ్ మేనేజ్‌మెంట్‌కు పూర్తి నమ్మకం ఉందని స్పష్టం చేశాడు.
ఇంటర్నెట్ డెస్క్: భారత స్టార్ స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ్‌పై స్పిన్ బౌలింగ్ కోచ్ సాయిరాజ్ బహుతులే ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. శ్రీలంకతో తొలి టెస్టులో పెద్దగా ప్రభావం చూపలేకపోయినప్పటికీ.. అతడిపై టీమ్ మేనేజ్‌మెంట్‌కు పూర్తి నమ్మకం ఉందని స్పష్టం చేశాడు. కొలంబో వేదికగా జరగనున్న రెండో టెస్టులో కుల్‌దీప్ తిరిగి పుంజుకుంటాడని ధీమా వ్యక్తం చేశాడు. గాలే టెస్టులో కుల్‌దీప్ రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 25 ఓవర్లు బౌలింగ్ చేసి ఒక వికెట్ మాత్రమే తీశాడు. తొలి ఇన్నింగ్స్‌లో 14 ఓవర్లు వేసి 65 పరుగులు ఇచ్చి ఒక వికెట్ దక్కించుకున్నాడు. రెండో ఇన్నింగ్స్‌లో 11 ఓవర్లు వేసినా వికెట్ లేకుండానే 38 పరుగులు ఇచ్చాడు. అతని ఏకైక వికెట్ కమిందు మెండిస్‌ది. శుభ్‌మన్ గిల్ అదిరే క్యాచ్ పట్టడంతో కుల్‌దీప్ ఖాతాలో వికెట్ చేరింది.
‘ఒక్క మ్యాచ్ ఆధారంగా కుల్‌దీప్ యాదవ్ సామర్థ్యాన్ని అంచనా వేయడం సరికాదు. కుల్‌దీప్ చాలా బాగా బౌలింగ్ చేస్తున్నాడు. గాలేలో పరిస్థితుల కారణంగా అతడు తన పాత్రను కొంత భిన్నంగా నిర్వర్తించాల్సి వచ్చింది. నా దృష్టిలో కుల్‌దీప్ ఎప్పటికీ మ్యాచ్ విన్నరే. అతడు కచ్చితంగా మా ప్రణాళికల్లో భాగమే. రెండో టెస్టులో అతడు తిరిగి పుంజుకుంటాడు. ఆ నమ్మకం టీమ్ మేనేజ్‌మెంట్‌కు ఉంది’ అని బహుతులే తెలిపాడు.
ఆ బంతితో కుల్‌దీప్‌కు ఇబ్బందులు
గాలే పిచ్, బంతి పరిస్థితులు కుల్‌దీప్ బౌలింగ్ శైలికి అంతగా అనుకూలించలేదని బహుతులే అభిప్రాయపడ్డాడు. కూకాబుర్రా బంతి మెరుపు తగ్గి మెత్తబడిన తర్వాత మణికట్టు స్పిన్నర్‌కు బంతి నుంచి ఆశించినంత సహకారం లభించలేదని వివరించాడు. ‘మెత్తబడిన బంతితో అన్ని రకాల స్పిన్నర్లు ఇబ్బంది పడతారు. అయితే ఫింగర్ స్పిన్నర్లకు పరిస్థితులు కొంత అనుకూలంగా ఉంటాయి. లెగ్ స్పిన్నర్లకు మాత్రం బంతి మెత్తబడినప్పుడు బౌలింగ్ చేయడం కాస్త కష్టమే. పిచ్ నెమ్మదించిన కొద్దీ కుల్‌దీప్ తన బౌలింగ్ వేగం, బంతి వేసే ట్రాజెక్టరీని మార్చుకోవాల్సి వచ్చింది’ అని కోచ్ బహుతులే వెల్లడించాడు.
ఇవి కూడా చదవండి:
స్పిన్ ఉచ్చులో చిక్కకుండా.. నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తోన్న శుభ్‌మన్ గిల్
బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్: సెమీస్‌కు ట్రీసా-గాయత్రి జోడీ.. పతకం ఖాయం